Indian Railways: వందే భారత్ ట్రైన్స్ విషయంలో కీలక నిర్ణయం.. ఇక ఆ మార్గాల్లోనూ..
వందే భారత్ రైళ్ల రాకతో ప్రయాణికులకు ఎంతో టైమ్ ఆదా అవుతుంది. వీటి వల్ల తక్కువ టైమ్‌లోనే గమ్యస్థానాలకు చేరుకోవచ్చు. అయితే ఈ రైళ్లలోనూ 100శాతానికి మించి రద్దీ ఉంటుంది. ఈ క్రమంలో రైల్వే శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. ఇది ప్రయాణికులకు గుడ్ న్యూస్‌గా చెప్పొచ్చు.

దేశంలో రైలు ప్రయాణానికి ఉన్న డిమాండ్ అంతా ఇంతా కాదు. తక్కువ ధరతో ఎక్కువ దూరం ప్రయాణించాలంటే ఏకైక మార్గం రైల్వే ప్రయాణం. రోజు కోట్ల మందిని రైళ్లు గమ్యస్థానాలకు చేరుస్తాయి. అయితే పండగవేళల్లో ఆ రద్దీ మామూలుగా ఉండదు. అందుకే నెలల ముందే టికెట్స్ బుక్ చేసుకుంటారు. కాగా ప్రయాణికులకు మరింత మెరుగైన ప్రయాణ సౌకర్యం అందించేందుకు కేంద్రం వందే భారత్ రైళ్లు తీసుకొచ్చింది. దీంతో ప్రయాణ సమయం భారీగా తగ్గింది. అయితే వందే భారత్ రైళ్లు ఇకపై మరింత ఎక్కువ కోచ్‌లతో నడవనున్నాయి. ప్రయాణికుల రద్దీ ఎక్కువగా ఉన్న రూట్లలో 20 బోగీలతో కూడిన వందే భారత్ రైళ్లను నడపాలని రైల్వే శాఖ నిర్ణయించింది.
ఏం మారుతుంది..?
ప్రస్తుతం 16 బోగీలతో నడుస్తున్న మూడు రైళ్లను 20 బోగీలుగా మార్చనున్నారు. అలాగే 8 బోగీలు ఉన్న నాలుగు రైళ్లను 16 బోగీలకు పెంచుతారు. దీనివల్ల ఎక్కువ మంది ప్రయాణించడానికి వీలవుతుంది. రైల్వే శాఖ ప్రస్తుతం 144 వందే భారత్ రైళ్లను నడుపుతున్నాయి. వీటిల్లో సీట్లు దాదాపు 100శాతం కంటే ఎక్కువగా నిండిపోతున్నాయి. ఈ పెరుగుతున్న డిమాండ్‌ను దృష్టిలో ఉంచుకొని రైల్వేలు ఈ నిర్ణయం తీసుకున్నాయి.
స్లీపర్ కోచ్‌లు
వందే భారత్ రైళ్లలో స్లీపర్ కోచ్‌లు కూడా రాబోతున్నాయి. ప్రస్తుతం 10 స్లీపర్ రైళ్లు తయారీలో ఉన్నాయి. చెన్నైలోని ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీ 50 వందే భారత్ స్లీపర్ రేక్‌లను తయారు చేస్తోంది. వీటితో పాటు భవిష్యత్తులో సుదూర ప్రయాణాలకు వీలుగా 200 స్లీపర్ బోగీలను కూడా తయారు చేయనున్నారు. ఈ మార్పులు ప్రయాణికులకు సౌకర్యవంతంగా ఉండటమే కాకుండా, రైల్వేల ఆదాయాన్ని కూడా పెంచుతాయి.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..




