Gold: పెళ్లి అయినవారి దగ్గర ఎంత బంగారం ఉంచుకోవచ్చు..? పెళ్లి కాని వారి దగ్గర ఎంత ఉండొచ్చు..?

ఇప్పుడంతా గోల్డ్‌ టైమ్‌ నడుస్తోంది. ఎక్కడ చూసినా.. ఎక్కడ విన్నా ఒకటే మాట..! బంగారం ధర లక్ష రూపాయలకు పోతుందట కదా అనే మాటే వినిపిస్తోంది. ఈ టైమ్‌లో బంగారాన్ని కొనడమే కాదు.. అమ్మడం కూడా ఎక్కువగానే జరుగుతోంది. మరి బంగారం అమ్మితే పన్ను కట్టాల్సిందేనా? అసలు ఇంట్లో ఎంత బంగారాన్ని ఉంచుకోవచ్చు? పెళ్లి అయిన వారి దగ్గర ఎంత బంగారం ఉండాలి..? పెళ్లి కాని వారి దగ్గర ఎంత ఉండాలి.?

Gold: పెళ్లి అయినవారి దగ్గర ఎంత బంగారం ఉంచుకోవచ్చు..? పెళ్లి కాని వారి దగ్గర ఎంత ఉండొచ్చు..?

Updated on: Apr 17, 2025 | 10:21 AM

భారతీయులకు బంగారానికి అవినాభావ సంబంధం ఉంది. భారతదేశంలో బంగారం అనేది ఆభరణంగా మాత్రమే కాకుండా.. ఆర్థిక భద్రతకు కూడా కీలకంగా ఉంటుంది. సంక్షోభ సమయాల్లో ఇది ఆదుకుంటుందనే భరోసా. సురక్షిత పెట్టుబడి సాధనంగా కూడా భావిస్తారు. పెద్దమొత్తంలో కొని రేట్లు పెరిగినప్పుడు అమ్ముతుంటారు. గోల్డ్ ఫండ్స్‌లో పెట్టుబడులు పెట్టి సంపాదిస్తున్న వారు కూడా ఉన్నారు. అందుకే ఇప్పుడు బంగారంపై పెట్టుబడి బహురూపాలుగా విస్తరించింది. అయితే గతంలో బంగారానికి లెక్కా పత్రం ఉండేది కాదు. కానీ ఇప్పుడు మాత్రం ఖచ్చితంగా లెక్కలుండాల్సిందే. పన్ను కట్టాల్సిందే.

గోల్డ్‌ బాండ్స్‌లో పెట్టుబడులకు లాభం వచ్చినా ట్యాక్స్‌

ఆభ‌ర‌ణాలు, నాణేలు, బార్లు రూపంలో బంగారాన్ని కొనుగోలు చేస్తే వాటిని ఎంత కాలానికి విక్రయించారు అనే అంశంపై ప‌న్ను ఆధార‌ప‌డి ఉంటుంది. బంగారాన్ని కొనుగోలు చేసిన 3 సంవ‌త్సరాల్లోపు విక్రయిస్తే స్వల్ప కాలంగానూ.. మూడేళ్లు మించితే దీర్ఘకాలంగానూ పరిగణించి మూలధన లాభంపై పన్ను విధిస్తారు. దీర్ఘ కాల పెట్టుబడులపై లాభాలు వస్తే పన్నులు కట్టాల్సి ఉంటుంది. బంగారాన్ని అమ్మి లాభాలు సంపాదిస్తే అందులో 20 శాతం క్యాపిటల్ గెయిన్స్ ట్యాక్స్‌ ఖచ్చితంగా కట్టాల్సిందే. బంగారం కొన్న మూడేళ్ల తర్వాత అమ్మితే ఎంత మొత్తంలో లాభం వచ్చిందో అందులో ఇరవై శాతం క్యాపిటల్ గెయిన్స్ ట్యాక్స్‌ కింద ప్రభుత్వానికి చెల్లించాల్సిందే. దానికి మినహాయింపులు లేవు. అలాగే గోల్డ్‌ బాండ్స్‌లో పెట్టుబడులు పెట్టినప్పుడు కూడా ఆ బాండ్స్‌లో వచ్చే లాభంలో ప్రభుత్వానికి కొన్ని స్కీములను బట్టి 10 నుంచి 20 శాతం వరకు పన్ను చెల్లించాల్సి ఉంటుంది.

ఇంట్లో ఉన్న బంగారానికి ప్రూఫ్స్ తప్పని సరి

ఇక భారత ఆదాయపు పన్ను శాఖ నిబంధనల ప్రకారం.. ఇంట్లో ఎంత బంగారం అయినా దాచుకోవచ్చు. అయితే దీనికి కచ్చితమైన ప్రూఫ్స్ ఉండాలి. నిర్ణీత పరిమితికి మించి బంగారాన్ని ఇంట్లో ఉంచుకుంటే.. దానికి సంబంధించిన రుజువులు చూయించాలని చెబుతోంది సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ టాక్సెస్. బంగారం కొనుగోలు రిసిప్ట్స్ నుంచి దానికి డబ్బు ఎక్కడి నుంచి వచ్చిందనేది చూయించాల్సి వస్తుంది. పరిమితికి మించి బంగారం ఉన్నట్లయితే అప్పుడు రుజువులు చూయించాలి లేకుంటే ఆదాయపు పన్ను శాఖ దీనిని సీజ్ చేస్తుంది.

ఎవరి వద్ద ఎంత బంగారం ఉండొచ్చు..?

ఇక ఆదాయపు పన్ను చట్టం ప్రకారం.. ఎలాంటి ప్రూఫ్స్ లేకుండా మహిళలు, పురుషులు ఎంత బంగారం కలిగి ఉండొచ్చో కూడా నిబంధనలు ఉన్నాయి. పెళ్లైన మహిళలు తమ దగ్గర 500 గ్రాములు లేదా 50 తులాల వరకు గోల్డ్ ఉంచుకోవచ్చు.  పెళ్లి కాని యువతులకు అయితే పరిమితి 250 గ్రాములుగా ఉంది. ఇక పురుషులు తమ దగ్గర ప్రూఫ్స్ లేకుండా 100 గ్రాముల వరకు బంగారం మాత్రమే ఉంచుకోవచ్చు. అంటే బంగారం ఇంట్లో ఉంచుకోవడానికి టాక్స్ లేదు కానీ.. అదే బంగారం విక్రయిస్తే మాత్ర దానిపై పన్ను చెల్లించాల్సి ఉంటుంది. త‌ల్లిదండ్రులు, పిల్లల నుంచి బ‌హుమ‌తిగా బంగారం స్వీక‌రిస్తే, ఆ బంగారంపై ప‌న్ను వ‌ర్తించ‌దు. కానీ బ‌హుమ‌తిగా పొందిన బంగారం విలువ రూ.50వేల కంటే ఎక్కువ ఉంటే వారికి వ‌ర్తించే వ్యక్తిగత ప‌న్ను స్లాబ్ ప్రకారం ప‌న్ను చెల్లించాల్సి ఉంటుంది. ఒక వేళ బంగారం విలువ రూ.50వేల కంటే త‌క్కువ ఉంటే ఎటువంటి ప‌న్ను చెల్లించాల్సిన అవ‌స‌రమూ లేదు.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..