
చాలామందికి ఒకటికంటే ఎక్కువ బ్యాంక్ అకౌంట్లు ఉంటుంటాయి. అయితే వీటిలో వాడకుండా వదిలేసిన అకౌంట్స్ కూడా ఉంటాయి. ఎప్పుడో ఓపెన్ చేసి కొంతకాలం తర్వాత అలా వదిలేస్తుంటారు. అలాంటి ఇన్ యాక్టివ్ బ్యాంక్ అకౌంట్స్ ను ఇప్పుడు సైబర్ నేరగాళ్లు వాళ్లకు అనువుగా వాడుకుంటున్నారు. వాడకంలో లేని అకౌంట్స్ ను హ్యాక్ చేసి నేరపూరితమైన ట్రాన్సాక్షన్స్ కోసం ఉపయోగించుకుంటున్నారు. ఈ స్కా్మ్ ఎలా ఉంటుందంటే..
తాజాగా వెలుగులోకి వచ్చిన కొన్ని కేసుల ప్రకారం స్కామర్లు బ్యాంక్ అకౌంట్ హోల్డర్ ను మభ్యపెట్టి అకౌంట్ ను హ్యాక్ చేశారు. ఇలా చేస్తే మీ అకౌంట్ లో డబ్బు పడుతుంది అని నమ్మించి కొన్ని వెబ్ సైట్స్ ద్వారా తక్కువ మొత్తంలో ఇన్వెస్ట్ చేయించారు. అలా వెబ్ సైట్ ద్వారా బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ ను హ్యాక్ చేసి.. ఆ తర్వాత అందులో కోటి రూపాయలకు పైగా డిపాజిట్ చేశారు. కొన్ని నిముషాల్లో వాటిని రూ. 300, రూ. 400 గా విభజించి.. కొన్ని వేల ట్రాన్సాక్షన్స్ రూపంలో ఇతర అకౌంట్లకు తరలించారు. ఇక మరో కేసులో ఒక మొబైల్ యాక్ససరీస్ డీలర్ అకౌంట్‌లో రూ.1.98 కోట్లు క్రెడిట్ అయింది. తర్వాత ఆ డబ్బు 38 వేర్వేరు అకౌంట్లకు ఆటోమెటిక్ గా ట్రాన్స్ ఫర్ అయింది. ఇలా వాడుకలో లేని బ్యాంక్ అకౌంట్లను టార్గెట్ చేస్తూ.. ఫ్రాడ్స్ చేస్తున్నారు.
ఇలాంటి స్కామ్స్ వల్ల అకౌంట్ హోల్డర్ లు లేనిపోని చిక్కుల్లో పడతారు. మీ ప్రమేయం లేకపోయినా మీరు విచారణ ఎదుర్కోవాల్సి ఉంటుంది. అసలు అలాంటి సమస్యల్లో ఇరుక్కోకూడదు అంటే.. ముందు వాడుకలో లేని అకౌంట్లను క్లోజ్ చేసేయాలి. ఎవరైనా ఫోన్ చేసి.. ‘మీరేం ఇన్వెస్ట్ చేయాల్సిన పని లేదు. మీ బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ చెప్తే అందులో డబ్బు పడుతుంది’ వంటి మాటలు చెప్తే.. వెంటనే జాగ్రత్త పడాలి. మీ గుర్తింపు కార్డులు ఎవరికీ ఇవ్వకుండా చూసుకోవాలి. ఏవైనా అనుమానాస్పద ట్రాన్సాక్షన్స్ జరిగితే వెంటనే పోలీసులకు తెలియజేయాలి.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం క్లిక్ చేయండి