
ప్రతి ఒక్కరికీ సొంతిల్లు అనేది అత్యంత అవసరం. మన జీవితం సాఫీగా ముందుకు సాగడానికి, ఆర్థిక ప్రగతి సాధించడానికి కీలకంగా మారుతుంది. ఈ నేపథ్యంలో సొంతింటిని సమకూర్చుకోవాలని అందరూ కలలు కంటారు. దీన్ని సాకారం చేసుకోవడానికి బ్యాంకులు, వివిధ సంస్థలు అందించే హోమ్ లోన్ల పై ఆధారపడతారు. ఈ పద్దతిల కొన్నిసార్లు మీ దరఖాస్తు తిరస్కరణకు గురికావచ్చు. ఇంటి రుణం ఇవ్వడానికి బ్యాంకులు సముఖంగా లేకపోవచ్చు. దీనికి అనేక కారణాలు ఉంటాయి. మన దరఖాస్తు తిరస్కరణకు గురైతే నిరుత్సాహ పడకూడదు. దానికి గల కారణాలను తెలుసుకోవాలి. ప్రత్యామ్నాయ విధానంలో రుణాలను పొందడానికి ప్రయత్నించాలి. దాని కోసం ఈ కింద తెలిపిన చిట్కాలను ఫాలో అయితే ఎంతో ప్రయోజనం కలుగుతుంది.
హోమ్ లోన్ కోసం మీరు దరఖాస్తు అందించిన తర్వాత బ్యాంకులు మీ క్రెడిట్ స్కోర్ ను పరిశీలిస్తాయి. రుణం మంజూరు చేయడానికి ఆ స్కోర్ చాలా కీలకం. మీ స్కోర్ 700 కంటే తక్కువగా ఉంటే రుణం మంజూరు చేయడాన్ని రిస్క్ గా భావిస్తారు. దానివల్ల మీ దరఖాస్తును తిరస్కరిస్తారు. ఎందుకంటే మీ ఆర్థిక క్రమశిక్షణకు క్రెడిట్ స్కోర్ నిదర్శనంగా నిలుస్తుంది.
నాన్-బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీలు (ఎన్ బీఎఫ్ సీలు) కూడా హోమ్ లోన్లను మంజూరు చేస్తాయి. బ్యాంకులు మీ దరఖాస్తును తిరస్కరిస్తే ఇవి ప్రత్యామ్నాయంగా మారతాయి. మీ క్రెడిట్ స్కోర్ తక్కువగా ఉన్నా రుణాలను మంజూరు చేస్తాయి. అయితే వడ్డీరేటు కొంచెం ఎక్కువగా ఉంటుంది. ఎన్ బీఎఫ్ సీల నిబంధనలను పరిశీలించి రుణం తీసుకోవచ్చు.
మీ ఆర్థిక పరిస్థితి సక్రమంగా లేక రుణ దరఖాస్తు తిరస్కరణకు గురైతే మరో అవకాశం ఉంది. సహ దరఖాస్తుదారుడు, లేదా గ్యారంటర్‌తో లోన్ తీసుకోవచ్చు. వీరిలో మీ జీవిత భాగస్వామి, కుటుంబ సభ్యుడు ఉండవచ్చు. మీ రుణ చెల్లింపు వారు బాధ్యతను పంచుకుంటారు కాబట్టి సులువుగా రుణం మంజూరవుతుంది.
పేదల సొంతింటి కలను సాకారం చేయడానికి ప్రభుత్వాలు అనేక పథకాలను అమలు చేస్తున్నాయి. ముఖ్యంగా తక్కువ ఆదాయ వర్గాలకు ఇవి వర్తిస్తాయి. ప్రధాన్ మంత్రి ఆవాస్ యోజన (పీఎంఏవై) పథకం ద్వారా క్రెడిట్ లింక్డ్ సబ్సిడీలు అందుతాయి. మీకు అర్హత ఉంటే దరఖాస్తు చేసుకోవచ్చు.
డౌన్ పేమెంట్ పెంచడం వల్ల కూడా హోమ్ లోన్లు సులువుగా పొందేందుకు అవకాశం ఉంటుంది. దీనివల్ల బ్యాంకులు, ఎన్ బీఎఫ్ సీలు మీకు రుణం మంజూరు చేయడానికి ఆసక్తి చూపుతారు.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..