38 ఏళ్ల ఓ అంబులెన్స్ డ్రైవర్.. అతని సంస్థ ఇచ్చిన నివేదిక ప్రకంపనలు సృష్టిస్తోంది. భారత స్టాక్ మార్కెట్లు వణికిపోతున్నాయి. కేవలం రెండు ట్రేడింగ్ సెషన్లలో 10లక్షల కోట్లకు పైగా ఇన్వెస్టర్ల సంపద ఆవిరైపోయింది. ప్రపంచంలోనే అతి పెద్ద కుబేరుడైన గౌతమ్ అదానీ సామ్రాజ్యం.. ఆ రిపోర్ట్ దెబ్బకు కుప్పకూలిపోతోంది.
భారత స్టాక్ మార్కెట్లు కుదేలవుతున్నాయి. గత రెండు సెషన్లలో భారీగా కుప్పకూలిపోయాయి. రూ.10 లక్షల కోట్లకుపైగా ఇన్వెస్టర్ల సంపద ఆవిరైంది. ప్రపంచ కుబేరుల జాబితాలో టాప్‌లో ఉన్న అదానీ గ్రూప్‌కు కోలుకోలేని దెబ్బ తగిలింది. అమెరికా షార్ట్ సెల్లింగ్ సంస్థ హిండెన్‌బర్గ్ రిపోర్ట్‌తో..అదానీ గ్రూప్ షేర్లు రెండ్రోజుల్లోనే 5-నుంచి 20శాతం పతనమయ్యాయి. దీంతో సుమారు 4 లక్షల కోట్లకు పైగా మార్కెట్ విలువ పడిపోయింది. ప్రపంచ కుబేరుల లిస్ట్‌లో మూడో స్థానం నుంచి ఏడుకు పడిపోయారు అదానీ.
అదానీ గ్రూప్ లో ఏ లెక్క సరిగా లేదంటూ ఆరోపించింది హిండెన్ బర్గ్ రీసెర్చ్ సంస్థ. దశాబ్దాలుగా భారత స్టాక్ మార్కెట్లో అకౌంటింగ్ మోసాలు చేస్తోందని, స్టాక్ మానిపులేషన్‌కు పాల్పడుతోందని, అడ్డగోలుగా షేర్లను పెంచుకుంటోందని సంచలన ప్రకటన చేసింది.
హిండెన్ బర్గ్ రిపోర్ట్‌తో అదానీ మాత్రమే కాదు.. ఆ గ్రూప్‌లో పెట్టుబడులు పెట్టిన రిటైల్ ఇన్వెస్టర్లకు కూడా భారీ నష్టం వాటిల్లింది. ఆయనకు అప్పులిచ్చిన ఎస్‌బిఐ, పెట్టుబడులు పెట్టిన ఎల్ఐసీ కూడా ఇప్పుడు వణికిపోతున్నాయి. వరుసగా 2 రోజులు ఆ షేర్లు పడిపోవడంతో ఎల్ఐసీ కి సుమారు రూ.16 వేల కోట్లకుపైగా నష్టం వాటిల్లింది. మరోవైపు అదానీ గ్రూప్ షేర్ల నష్టాలతో ఎస్‌బిఐ స్టాక్ కూడా రెండు రోజులుగా భారీగా పతనమైంది. దీంతో ఈ ప్రభుత్వ సంస్థల్లో డిపాజిట్లు చేసిన ప్రజలు ఆందోళన చెందుతున్నారు.
ఇంతటి ఆర్థిక ప్రకంపనలకు కారణం హిండెన్‌బర్గ్ రీసెర్చ్ సంస్థ ఇచ్చిన నివేదిక. అమెరికాలో షార్ట్ సెల్లింగ్ సంస్థగా కార్యకలాపాలు నిర్వహిస్తోంది. న్యూయార్క్ కేంద్రంగా పనిచేస్తోన్న ఈ సంస్థ..ఆయా కంపెనీలపై రీసెర్చ్ చేస్తుంది. నాథన్ అండర్సన్ 2017లో ఈ సంస్థను స్థాపించాడు. అప్పటి నుంచి సంచలనాలకు కేంద్ర బిందువుగా మారింది హిండెన్‌బర్గ్.
నాథన్ ఆండర్సన్ కనెక్టికట్ విశ్వ విద్యాలయం నుండి ఇంటర్నేషనల్ బిజినెస్‌లో చదివాడు. ఆ తర్వాత ఇజ్రాయెల్ లో అంబులెన్స్ డ్రైవర్ గా పని చేశాడు. తిరిగి అమెరికా వచ్చి ఫాక్ట్ సెట్ రీసెర్చ్ సంస్థలో పని చేశాడు. హారీ మార్కోపోలోస్‌తో కలిసి ప్లాటినం పార్ట్‌నర్స్ అనే సంస్థపై దర్యాప్తు కోసం పనిచేశాడు. 2017 నుంచి ఇప్పటివరకు 16 కంపెనీల్లో జరుగుతున్న మోసాలను బయట పెట్టాడు నాథన్ అండర్సన్. తాజాగా హిండెన్‌బర్గ్ సంస్థ ఇచ్చిన రిపోర్ట్ దెబ్బకు అదానీ సామ్రాజ్యం షేక్ అవుతోంది.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..