Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Gold: దమ్ముంటే పట్టుకోండి.. రూ.1 లక్ష వైపు రాకెట్ వేగంతో ‘కనక’మహాలక్ష్మి

రోజుకింత పెరిగిపోతున్న బంగారం ధరలు చూసి సామాన్యుడు దిగాలుపడుతున్నాడు. ఇంతకీ కనకమహాలక్ష్మి పరుగులకు కారణమేంటి? ఎవరు తరుముతున్నారు బంగారాన్ని? అమెరికాలో ట్రంప్‌ వచ్చాక.. పసిడి పరుగులుపెడుతోందంటున్నారు. నిజమే..! ట్రంప్‌ నిర్ణయాలతో, ట్రంప్ తీసుకుంటున్న చర్యలతో ఎల్లోమెటల్‌ కొనాలంటేనే బెంబేలెత్తుతున్నారు. ఇంతకీ.. ట్రంప్‌ ఏరకంగా గోల్డ్‌ రేట్లను ఎఫెక్ట్‌ చేస్తున్నారు.

Gold: దమ్ముంటే పట్టుకోండి.. రూ.1 లక్ష వైపు రాకెట్ వేగంతో ‘కనక’మహాలక్ష్మి
Gold Price
Follow us
Balaraju Goud

|

Updated on: Feb 11, 2025 | 9:28 PM

కొంగు బంగారం అంటుంటారు సాధారణంగా.. కాసో, అరకాసో.. కొంగుకు కట్టుకుని వెళ్లి తాకట్టు పెట్టుకుని ఇంటి అవసరాలు తీర్చుకునేది ఇల్లాలు. చేతిలో డబ్బులు మళ్లీ గలగలమన్నప్పుడు తిరిగి కొనుక్కునేది. బంగారం అంటే భారతీయ మహిళలకు పిచ్చి, మోజు అనుకుంటారు కొందరు విదేశీయులు. కాదు.. మరొకరి ముందు చేయి చాచి అడగాల్సిన పనిలేకుండా.. ఇంట్లో ఉండే బంగారాన్నే కొంగుకు ముడేసి.. దర్జాగా డబ్బు తెచ్చుకుని, పరిస్థితులు సర్దుకోగానే తిరిగి విడిపించుకునేది. ఇదో ఆర్థిక సూత్రం. అదే కొంగు బంగారం. బిజినెస్‌ మేనేజ్‌మెంట్‌ కోర్సులు చేయకుండానే అతివలు నేర్చుకున్న జ్ఞానం. అంతేగానీ.. పిచ్చీ కాదు మోజూ కాదు.

బంగారం అనేది భారతీయ అతివలకు ఓ భావోద్వేగ బంధం. మనదేశ సంస్కృతిలో ఓ చిహ్నం. బంగారం.. ఓ స్టేటస్‌ సింబల్ కూడా. కానీ ఇదంతా.. బంగారం ధర ఓ స్థాయిలో ఉన్నప్పుడు మాత్రమే. సామాన్యుడికి సైతం ధర అందుబాటులో ఉన్నప్పుడు.. బంగారంతో ఓ ఆటాడుకున్నాడు. కానీ ఇప్పుడు..! బంగారమే ఆటాడుకుంటోంది. ఒకవిధంగా పద్ధతులను, ఆచార వ్యవహారాలను కూడా మార్చే స్థాయికి ఎదిగిందీ పసిడి.

పెళ్లిచూపుల్లో కట్నకానుకల గురించి మాట్లాడుకోవడం సహజం ఎక్కడైనా. ‘మాఇంట అడుగుపెట్టే ఆడపిల్లకి ఎన్ని కాసుల బంగారం పెడతారు’ అని అడుగుతారు అటువైపువాళ్లు. ‘పది కాసులో, ఇరవై కాసులో పెట్టి పంపిస్తాం వదిన’ అంటారు ఇటువైపు వాళ్లు. ఏ పెళ్లిచూపుల్లో అయినా బంగారం గురించి మాట్లాడకుండా మాట ముచ్చట ఉండదు. కాని, ఇప్పుడీ పద్దతి మారుతోంది. ఎన్ని కాసులు పెడతామో చెప్పడం లేదు. ఐదు లక్షలో పది లక్షలో.. అంత విలువైన బంగారం పెడతామని మాట్లాడుకుంటున్నారు. కానుకల గురించి ఇవాళ మాట్లాడుకుని ఓ రెణ్ణెళ్ల తరువాత ముహూర్తం అనుకుంటే.. ఈ రెండు నెలల్లోనే బంగారం ధర పెరిగిపోవచ్చు. ఒక్కోసారి స్థాయికి మించే ఖర్చు చేయాల్సి రావొచ్చు. అందుకే, ‘ఇన్ని కాసుల బంగారం ఇస్తాం’ అనే బదులు.. డబ్బులిస్తాం అనే దాకా వచ్చారు. కారణం.. అతి త్వరలోనే పది గ్రాముల పసిడి ధర లక్ష రూపాయలు చేరుకుంటుందనే ఊహాగానాలే..! ఇంతకీ.. బంగారం ఈ రేంజ్‌లో పరుగులు పెట్టడానికి కారణం ఏంటి? ఎక్కడో అమెరికాలో ఉండే ట్రంప్‌కు కోపమొస్తే.. కనకమహాలక్ష్మి ఎందుకని కంగారు పడుతోంది? నిజంగా.. రాబోయే రోజుల్లో పది గ్రాముల బంగారం ధర లక్ష రూపాయలకు చేరడాన్ని చూస్తామా? అన్నదీ సగటు భారతీయుడిని వేధిస్తున్న ప్రశ్న..!

అందనంత ఎత్తా తారా తీరం అని పాడుకుంటూ.. దాని అంతు చూడ్డానికి మానసికంగానైనా మనిషి సిద్ధమైపోతున్నాడు గానీ.. పెరిగిపోతున్న బంగారం ధరలు చూసి దాని అంతు తేలుద్దాం అని మనసులో కూడా అనుకునే సాహసం చేయడం లేదు. గోల్డ్‌ చైన్‌కు హుక్‌ ఉంటుంది కదా. పొరపాటున ఆ హుక్‌ ఎక్కడో పడిపోయింది.. ‘కొనివ్వండి డాడీ’ అని కూతురు వచ్చి అడిగినా సరే కొనివ్వలేని పరిస్థితి ఉందిప్పుడు. ఆ చిన్న హుక్‌కు కూడా ‘అమ్మో పదివేలు ఖర్చు పెట్టాలా ఇప్పుడు’ అని భయపడుతున్నాడు ఓ మధ్య తరగతి తండ్రి.

ఇక ఈ లెక్కన.. ఆడపిల్ల మెడలో బంగారు నెక్లెస్ వేయాలంటే..! కనీసం ఆర్నెళ్ల జీతాన్ని తీసి పక్కనపెట్టాలి. ఈ పరిస్థితిని తలుచుకునే తెగ ఫీల్‌ అవుతున్నారు పేద, మధ్యతరగతి వాళ్లు. రోజురోజుకు పెరిగిపోతున్న బంగారం ధరలు చూసి.. అదో ‘అందరాని కొమ్మ ఇది’ అని పాడుకుంటూ.. ఇంట్లో ఇల్లాలు బంగారం ఊసు ఎత్తగానే ‘మాటరాని మౌనమిది’ అనే పల్లవి అందుకుంటున్నాడు. అంతో ఇంతో ఎగువ మధ్య తరగతి వాళ్లే కాస్త గుండెధైర్యం తెచ్చుకుని బంగారం షాపుల గడప తొక్కుతున్నారు గానీ.. పేదవాళ్లైతే అసలు బంగారం షాపులు ఉండే వీధివైపు చూడ్డమే మానేశారు. అసలు ఆ సెక్షన్‌ మనది కాదు అని దూరందూరం జరిగిపోతున్నారు.

కాసు బంగారం 50వేలు దాటినప్పుడే ఈ పరిస్థితి కనిపించింది. ఇప్పుడు ఏకంగా పది గ్రాములు 88వేల రూపాయలు పలుకుతోంది. రేప్పొద్దున లక్ష రూపాయలు అవుతుందని మార్కెట్లో టాక్. అక్కడితో ఆగుతుందా. లేదు.. లక్ష దాటడం ఆలస్యం.. లక్షా 25వేల నుంచి లక్షా 30వేల రూపాయల మధ్యకు వెళ్లి కూర్చుంటుందని చెప్పుకుంటున్నారు. అందుకే, కొన్నాళ్లుగా పెళ్లిచూపుల్లో.. డబ్బు, వీలైతే తాతముత్తాల ఆస్తి కొంత ఇస్తామంటున్నారు గానీ.. బంగారం మాటే ఎత్తొద్దని చెబుతున్నారు పేదింటి ఆడపిల్లల తల్లిదండ్రులు.

ఇక మధ్యతరగతికి ఎటొచ్చీ బంగారం కొనక తప్పదు. ఎందుకంటే.. అదో స్టేటస్‌ సింబల్ అయి కూర్చుంది కాబట్టి..! మిడిల్‌ క్లాస్‌ వాళ్లు అటు పేదల్లో పేదలు కాదు.. సంపన్నుల తరహాలో ఉన్నోళ్లూ కాదు. కాని, చుట్టుపక్కల వాళ్ల మధ్య మాత్రం ఆ దర్జా పోకూడదనుకుంటారు. సో, రేటు ఎంత పెరుగుతున్నా తప్పని పరిస్థితుల్లో బంగారం కొంటున్నారు. అందుకే.. దేశంలో బంగారం రేటు ఎక్కువగా ఉన్నా సరే కొనుగోళ్లు మాత్రం బాగానే ఉంటున్నాయి. దానికి కారణం.. మిడిల్‌ క్లాస్‌ వాళ్లే..! అలాగని ఒకప్పటిలా బంగారం కొంటున్నారని కాదు అర్థం. బంగారం కొనే పరిమాణం 10 శాతం తగ్గినా సరే.. విలువపరంగా అమ్మకాలు పెరుగుతున్నాయి. ఉదాహరణకు ఓ షాపు రోజుకు కిలో బంగారం అమ్మితే.. ఇప్పుడు అరకిలోనే అమ్మగలుగుతున్నారు. కాని, కిలో అమ్మినప్పుడు వచ్చే లాభమే.. అరకిలో అమ్మినప్పుడూ వస్తోంది. దీనికి కారణం.. మధ్యతరగతి వాళ్లు బంగారంపై ఉండే ఆ ఇష్టాన్ని, ఆ క్రేజ్‌ని వదులుకోకపోవడమే..!

ఇక బీరువాల్లో బోలెడు బంగారం ఉన్న వాళ్లైతే తెగ మురిసిపోతున్నారు. మున్ముందు బంగారం ధర పెరుగుతుందేమోనన్న ముందు జాగ్రత్తతో కొనిపెట్టుకున్న వాళ్ల సంబరమే సంబరం. రెండేళ్ల క్రితం పది గ్రాముల పసిడి 50-55 వేల రూపాయల మధ్య ఉంది. అప్పట్లో అది ఎక్కువ ధరే కావొచ్చు. కాని, ఇప్పుడు పెరిగిన ధరతో పోల్చితే మాత్రం ఏకంగా 30వేల రూపాయల లాభం తెచ్చిపెట్టింది. సో, బంగారం ధర పెరుగుతున్నకొద్దీ తాకట్టు విలువ కూడా పెరుగుతుందన్న ఆనందంలో ఉన్నారు వాళ్లంతా. ఒక విధంగా ఆలోచిస్తే.. ప్రస్తుతం పలుకుతున్న 88వేల రూపాయల పది గ్రాముల పసిడి కూడా చీపే. ఎలా అంటారా. మరో రెండేళ్లలో ఇదే పది గ్రాముల పసిడి లక్ష దాటి ఏ లక్షా పాతిక వేలకో చేరిందనుకోండి.. అప్పుడు ఈ 88వేల రూపాయల ధర తక్కువే అవుతుంది. ఇప్పటికిప్పుడు కాకపోయినా.. మరో ఏడాది ఏడాదిన్నరలో బంగారం ధర లక్ష రూపాయలకు చేరడం పక్కా అంటున్నారు బులియన్‌ అనలిస్టులు. ఆ లెక్కన చూసినా.. పది గ్రాములకు 12వేలు ఆదా చేసినట్టే లెక్క. కాకపోతే.. ఇలా ఆలోచించగలిగేది ఎగువ మధ్య తరగతి వాళ్లు, ఆపై తరగతి వాళ్లే తప్ప.. సామాన్యులైతే కాదు.

బంగారం ధరలు విపరీతంగా పెరుగుతుండడంతో షాపులకు వచ్చే వారి సంఖ్య తగ్గుతూ వస్తోంది. రేప్పొద్దున లకారం పలికితే.. కొనేవాళ్ల సంఖ్య ఇంకాస్త తగ్గిపోవచ్చు. అందుకే, రేటు పెరిగినా సరే.. కొన్ని డిఫరెంట్‌ ఆఫర్లు ప్రకటిస్తూ కస్టమర్స్‌ను ఆకర్షించే ప్రయత్నం చేస్తున్నారు. ‘డబ్బులు ఎవరికీ ఊరికే రావు’ అంటూ ఓ బ్రాండ్‌ క్రియేట్‌ చేసుకున్న జ్యువెలరీ షోరూమ్‌ కూడా.. ఈ పరిస్థితులను తనకు అనుకూలంగా మార్చుకునే ప్రయత్నం చేస్తోంది. పెరుగుతున్న బంగారం ధరలను చూసి సామాన్యుడు డీలాపడుతున్నాడు అని ఒప్పుకుంటూనే.. మన చేతిలో లేని దాన్ని పక్కనపెట్టి, ఏం చేయగలమో ఆలోచించండి అని సలహా ఇస్తున్నారు. ఇందుకోసం.. తరుగులో తగ్గింపు ప్రకటిస్తున్నారు. మార్కెట్లో ఎవరు ఎక్కువ తగ్గింపు ఇస్తున్నారో.. వాళ్ల కంటే ఒక శాతం ఎక్కువే తరుగులో తగ్గింపు ఇస్తాం అంటూ ధమాకా ఆఫర్‌ ప్రకటించారు. సో, మిగతా జ్యువెలర్స్‌ సైతం ఇదే దారిలో నడవక తప్పని పరిస్థితి ఎదురవుతోంది.

చరిత్ర చూస్తే బంగారం ధర పెరుగుతోందే తప్ప తగ్గిందైతే లేదు. ఏదో ఒకట్రెండు రోజులు తగ్గినట్టు కనిపించినా ఇయర్‌ ఆన్‌ ఇయర్‌ చూస్తే.. అంటే ఏటికేడాది చూస్తే మాత్రం బంగారం ధర పెరుగుతూనే ఉంది. 1925లో పది గ్రాముల బంగారం 18 రూపాయల 75 పైసలు ఉంది. దేశ స్వాతంత్రం నాటికి 88 రూపాయలకు చేరింది. 1959లో మొదటిసారి వంద రూపాయలు దాటింది. 1980లో ఫస్ట్‌టైమ్‌ పది గ్రాముల బంగారం వెయ్యి రూపాయలను టచ్‌ చేసింది. 2007 దాకా 10వేల రూపాయలే ఉండేది. కాని, 2011 నుంచి తడాఖా చూపించింది. చూస్తుండగానే 30వేలు టచ్ చేసింది. అందుకునే లోపు 40వేలు దాటింది. 2022లో 52వేలు పలికింది. ఈ రెండేళ్ల గ్యాప్‌లోనే ఏకంగా 30వేలు పెరిగి 80వేల మార్క్‌ను టచ్‌ చేసింది. సో, ఏ రకంగా చూసినా.. బంగారం పరుగులు ఆగవుగాక ఆగవు..!

మరి.. ఇక ఎప్పటికీ బంగారం ధరలు తగ్గవా? పసిడి పరుగులు ఇలాగే కొనసాగుతాయా? కేంద్రం ఎలాంటి చర్యలూ తీసుకోదా? ఏం చేసినా సరే.. కొద్దికాలం మాత్రమే ధరలో తగ్గుదల ఉంటుంది తప్ప ఎప్పటికీ అవే స్థాయిలో బంగారం ధరలు ఉండిపోవు. ఇది ఫిక్స్‌..! గతేడాది జులైలో బంగారంపై దిగుమతి సుంకాన్ని తగ్గిస్తూ ఓ సంచలన నిర్ణయం తీసుకుంది కేంద్ర ప్రభుత్వం. ఆ చర్యతో పది గ్రాముల బంగారంపై ఏకంగా 6వేల రూపాయల వరకు ధర తగ్గింది. ఆ సమయంలో చాలామంది మురిసిపోయారు కూడా. కాని, ఆ మరుసటి నెల నుంచే బంగారం ధర మళ్లీ పెరగడం మొదలుపెట్టింది. గతేడాది ఆగస్ట్‌ నుంచి పెరుగుతూ పెరుగుతూ వెళ్లి అక్టోబర్‌లో ఏకంగా ఆల్‌టైం గరిష్టస్థాయిని తాకింది. ఎప్పుడో ఓసారి బంగారం ధరలు తగ్గడంలాంటి అద్భుతాలు జరిగినా.. మళ్లీ యథావిధిగానే రేట్లు పెరుగుతాయి. అందుకే, గోల్డ్‌ జర్నీని ఓసారి పరిశీలించి.. దాని చరిత్రను ఓసారి గమనించి.. ఇప్పుడున్న 88వేల రూపాయల ధరే చీప్ అని మనకు మనం సర్దుకుపోవాలి తప్ప చేయగలిగిందేమీ లేదు. తీరా ఏ లక్షో దాటిన తరువాత వెనుతిరిగి చూసుకుని.. 88వేలు ఉన్నప్పుడే కొనుక్కుంటే బాగుండేది అనుకోవడం వృథా ప్రయాసే అవుతుంది..!

మంగళవారం నాడు స్టాక్‌ మార్కెట్లు కుప్పకూలాయి. దలాల్ స్ట్రీట్‌లో 9 లక్షల కోట్ల రూపాయల ఇన్వెస్టర్ల సొమ్ము ఆవిరైంది. కారణం.. ట్రంప్. సుంకాలను ఎడాపెడా పెంచుతూ నిర్ణయాలు తీసుకుంటున్నారు అమెరికా అధ్యక్షుడు. మొన్నటికి మొన్న మెక్సికో, కెనడా, చైనా ఉత్పత్తులపై సుంకాలు పెంచారు. ఇప్పుడు.. అమెరికాలోకి వచ్చే స్టీల్‌ అండ్‌ అల్యూమినియంపైనా 25 శాతం సుంకాలు పెంచుతున్నట్టు ప్రకటించారు. దీనివల్ల దేశాల మధ్య ట్రేడ్‌ వార్‌ మొదలవుతుంది. ‘నువ్వు పెంచితే చూస్తూ ఊరుకుంటానా, మీ దేశపు వస్తువులపైనా సుంకాలు పెంచుతాం’ అంటున్నాయి ఇతర దేశాలు. దీనివల్ల ప్రపంచవ్యాప్తంగా ఓ అనిశ్చితి ఏర్పడుతుంది.

ఎప్పుడైనా సరే ఒకటి గుర్తుకోవాలిక్కడ. భయం పెరిగినప్పుడే సేఫ్టీ గురించి ఆలోచిస్తారు. మనిషి నైజం అది. స్టాక్‌మార్కెట్లో భయం పెరిగినప్పుడల్లా.. ఇన్వెస్టర్లందరూ సేఫ్టీ ఉండే ఇన్వెస్ట్‌మెంట్స్‌ వైపు మొగ్గుచూపుతారు. ఇంతకీ సేఫ్టీ ఇన్వెస్ట్‌మెంట్‌ అంటే ఏంటి? ఇంకేంటి.. డెఫినెట్‌గా బంగారమే..! సో, షేర్ల హెచ్చుతగ్గులు, ఆ పతనం తట్టుకోలేని వాళ్లంతా బంగారంపై పెట్టుబడులు మళ్లిస్తారు. ప్రస్తుతం స్టాక్‌మార్కెట్లో మహిళలు కూడా గొప్పగా రాణిస్తున్నారు. ట్రేడింగ్‌పై పూర్తి పట్టు సాధిస్తున్నారు. అలా ఇన్వెస్ట్‌మెంట్స్‌ చేస్తున్న మహిళలు.. షేర్ల బదులు బంగారం కొంటున్నారు. ఫోన్‌పే, గూగుల్‌పే లాంటి వాటిల్లో గ్రాము బంగారం కొనే వెసులుబాటు కూడా ఉంది. లేదా.. వెయ్యి, 2వేలకు ఎంత బంగారం వస్తే అంతా కొనొచ్చు. ఆ ఫెసిలిటీ ఉంది. ఇదంతా డిజిటల్‌ గోల్డ్. సో, ఈరకంగా కూడా బంగారానికి డిమాండ్‌ పెరుగుతూ వస్తోంది.

అంతేకాదు.. భయం కేవలం ఇన్వెస్టర్లకు మాత్రమే ఉండదు. దేశాలకు కూడా ఉంటుంది. ఎప్పుడు యుద్ధం పుట్టుకొస్తుందో తెలియని పరిస్థితులు ఉన్నాయిప్పుడు. సేఫ్టీగా ప్రపంచ దేశాల రిజర్వ్‌ బ్యాంకులు బంగారాన్ని కొనిపెట్టుకుంటుంటాయి. ఈమధ్య బంగారం ఆర్డర్లు కూడా పెరిగాయి. తెలిసిందేగా.. డిమాండ్‌ పెరిగితే ఆటోమేటిక్‌గా ధర కూడా పెరుగుతుంది. ఇప్పుడు బంగారం ధర పెరగడానికి కారణం కూడా ఇలా డిమాండ్‌ పెరగడమే. ఉన్నట్టుండి డిమాండ్‌ పెరగడానికి కారణం.. భయం. ట్రంప్‌ చూపిస్తున్న ఆ భయం కారణంగానే ఎల్లోమెటల్‌ రేట్‌ పెరిగిపోతోంది.

అందులోనూ.. భారత్‌లో బంగారానికి డిమాండ్ పెరిగే సీజన్‌ ఇది. మాఘ మాసం అంటే పెళ్లిళ్లు, ఇతర ముహూర్తాలకు అనుకూలమైన కాలం. పైగా బంగారం లేకుండా శుభకార్యాలను ఊహించలేని సమాజం మనది. పెళ్లి-పేరంటం-పండుగల పేరు చెప్పి బంగారం కొనేది స్టేటస్‌ కోసమో, దర్జా కోసమో అయి ఉండొచ్చు గానీ.. అల్టిమేట్‌గా బంగారం సురక్షితమైన, నమ్మదగిన పెట్టుబడిగా కనిపించడం వల్లే దాన్ని కొంటున్నారు. స్టేటస్‌ చూపించుకోవాలంటే, దర్జాగా కనిపించాలంటే ఇంకేదైనా వస్తువునో కొనొచ్చు. కాని, బంగారమే ఎందుకు కొంటారంటే.. ఏదైనా అనుకోని కష్టకాలం వస్తే.. ఆర్థిక భద్రత, భరోసా ఇస్తుందన్న నమ్మకం కాబట్టి. ఆర్థిక అవసరం వచ్చినప్పుడు అప్పటికప్పుడు ఇల్లు అమ్ముకోలేకపోవచ్చు, కార్లు, ఇంట్లో వస్తువులు అమ్ముకోలేకపోవచ్చు. కాని, బంగారం విషయంలో అలా కాదు. పది నిమిషాల్లోనే తాకట్టు పెట్టేయొచ్చు లేదా అమ్ముకోవచ్చు.

ఆ సౌలభ్యం ఉంది కాబట్టే బంగారాన్ని జాగ్రత్తగా దాచుకోవడం, వీలైనంత బంగారాన్ని కొనిపెట్టుకోవడం మన దగ్గర ఓ సంప్రదాయంగా మారింది. ఎంత పేద ఇల్లాలు అయినా సరే.. రెండుకాసుల బంగారాన్ని మెడలో వేసుకోవాలనే కోరుకుంటుంది. అది ఆర్థికంగా ఒక భరోసాను కల్పిస్తుంది కూడా. అందుకే బంగారం పట్ల భారతీయులకు అంత ఇష్టం ఏర్పడింది. ఆ ఇష్టమే.. భారతదేశ ఆర్థిక స్థిరత్వానికి మూలస్తంభంగా నిలిచింది. సగటు భారతీయ స్త్రీకి బంగారం పట్ల ఇష్టం ఉన్నంత వరకు భారతదేశం ఆర్థికంగా చితికిపోవడం, దివాలా తీయడం ఎన్నటికీ జరగదు అనేది ఆర్థికవేత్తల మాట. బంగారం పట్ల సగటు భారతీయ ఇల్లాలికి ఉండే ఇష్టమే దేశ ఆర్థిక వ్యవస్థకు, ఆర్థిక భద్రతకు పునాది రాళ్లు కూడా. అందుకే, పెళ్లిళ్ల పేరు చెప్పి నగలు, నాణేలు, కడ్డీలు కొనిపెట్టుకుంటారు. ప్రస్తుతం మ్యారేజ్‌ సీజన్‌ ఉండడంతో.. జ్యువెలరీస్‌ నుంచి స్టాకిస్టుల నుంచి బంగారానికి గిరాకీ పెరుగుతోంది. దీనివల్ల విదేశాల నుంచి ఎక్కువ బంగారం దిగుమతి చేసుకోవాల్సి వస్తోంది. అందుకే, ప్రపంచంలోనే బంగారాన్ని దిగుమతి చేసుకుంటున్న దేశాల్లో రెండోస్థానంలో ఉంది భారత్.

బంగారం ధర పెరగడానికి మన రూపాయి కూడా ఓ కారణం. ఇందాక.. బంగారాన్ని విదేశాల నుంచి దిగుమతి చేసుకుంటున్నాం అని చెప్పుకున్నాం కదా..! ఇలా.. విదేశాల నుంచి బంగారాన్ని దిగుమతి చేసుకోవాలంటే.. డాలర్లు ఖర్చు పెట్టాలి. ప్రస్తుతం అటు ఇటుగా 87 రూపాయలు ఇస్తే గానీ ఒక్క డాలర్‌ రావడం లేదు. నిన్న మొన్నటి వరకు డాలర్‌కు అటు ఇటుగా 80 రూపాయలు ఇస్తే సరిపోయేది. ఇప్పుడు డాలర్‌ విలువ భారీగా పెరిగింది. దీంతో దిగుమతి చేసుకుంటున్న బంగారానికి డాలర్లు ఇవ్వాలంటే.. మన రూపాయలు మరిన్ని ఎక్కువగా ఇవ్వాలి. దీనివల్ల కూడా బంగారం ధర పెరిగిపోతోంది.

ఒక్క బంగారమేంటి.. వెండి కూడా పరుగులు తీస్తోంది. కిలో వెండి ధర గతేడాది అక్టోబర్‌లోనే లక్ష రూపాయలు దాటేసింది. కాకపోతే.. హెచ్చుతగ్గుల కారణంగా తెలుగు రాష్ట్రాల్లో కిలో 98వేలు పలుకుతోంది గానీ.. వెండి కూడా ఇకపై లక్ష రూపాయలు పెడితేనే దొరుకుతుంది. ఈ మధ్య ఎలక్ట్రిక్‌ వెహికల్స్‌ వాడకం పెరిగిపోవడంతో.. వెండి ధరలు కూడా పెరుగుతున్నాయి. అటు సోలార్‌ ప్యానెల్స్‌ తయారీలోనూ వెండి వాడకం తప్పనిసరి. ఒక విధంగా సిల్వర్‌ను పట్టీలుగా, పల్లేలుగా కొనుక్కోవడం కంటే.. పారిశ్రామికంగానే ఎక్కువగా వాడుతుంటారు. సిల్వర్‌ ఇన్‌స్టిట్యూట్‌ డేటా ప్రకారం.. 2025 నాటికి 1.33 టెరావాట్‌ సోలార్‌ ఎనర్జీ ఉత్పత్తి చేయాలంటే.. సుమారు 95 లక్షల కిలోల వెండి అవసరం అవుతుంది. దానికి తోడు భూమి పొరల నుంచి వెండిని చాలా వేగంగా తవ్వేస్తున్నారు. ఎప్పుడో అప్పుడు సిల్వర్‌ సప్లై తగ్గి.. డిమాండ్‌ విపరీతంగా పెరుగుతుంది. అదే జరిగితే.. ఇవాళ్టి వెండి.. రేపటి బంగారం అవుతుంది. భవిష్యత్తులో వెండి ధర బంగారాన్ని మించినా ఆశ్చర్యం లేదంటున్నారు. కాకపోతే.. దానికి చాలా కాలం పడుతుంది.

ఫైనల్‌గా.. బంగారం, వెండి ధరలకు అడ్డూ అదుపు ఉండకపోవచ్చు. సాధారణంగా ఫ్యాక్టరీల్లో తయారుచేసే వస్తువే అయి ఉంటే గనక.. ప్రొడక్షన్‌ పెంచి రేటు తగ్గించుకునే వాళ్లం. కాని, బంగారం, వెండి అనేవి భూమి పొరల్లో దొరికే మెటల్స్‌. వజ్రాలు తయారు చేసినట్టు బంగారం, వెండిని కృత్రిమంగా తయారుచేయలేం. పైగా గనుల్లో ఉన్న బంగారం, వెండి నిల్వలు ఎప్పుడో అప్పుడు అయిపోక తప్పదు. ఈ విషయం తెలుసు కాబట్టే.. గోల్డ్‌, సిల్వర్‌కు అంత డిమాండ్‌. ఇకపై పది గ్రాముల బంగారం కొనాలంటే మాత్రం లక్ష పక్కనపెట్టుకోండి.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

సినిమాలపై నటి హేమ సంచలన నిర్ణయం.. అదే కారణమా?
సినిమాలపై నటి హేమ సంచలన నిర్ణయం.. అదే కారణమా?
బెట్టింగ్‌ యాప్స్ ప్రమోట్ చేస్తే వణకాల్సిందే.. పరారీలో ఆ ఇద్దరు..
బెట్టింగ్‌ యాప్స్ ప్రమోట్ చేస్తే వణకాల్సిందే.. పరారీలో ఆ ఇద్దరు..
సునీత విలియమ్స్ సాహస యాత్రపై మెగాస్టార్ రియాక్షన్
సునీత విలియమ్స్ సాహస యాత్రపై మెగాస్టార్ రియాక్షన్
సునీతాను భూమిపైకి తీసుకొచ్చేందుకు అన్ని కోట్లు ఖర్చు చేశారా?
సునీతాను భూమిపైకి తీసుకొచ్చేందుకు అన్ని కోట్లు ఖర్చు చేశారా?
రూ. 50 లక్షలతో ఢిల్లీ క్యాపిటల్స్‌కు 'ట్రంప్ కార్డ్'?
రూ. 50 లక్షలతో ఢిల్లీ క్యాపిటల్స్‌కు 'ట్రంప్ కార్డ్'?
మెకానికల్ ఇంజనీరింగ్‌లో మాస్టర్స్..ఇప్పుడు తెలుగులో ఫేమస్ యాక్టర్
మెకానికల్ ఇంజనీరింగ్‌లో మాస్టర్స్..ఇప్పుడు తెలుగులో ఫేమస్ యాక్టర్
అక్షరధామ్‌‌ను సందర్శించిన న్యూజిలాండ్ ప్రధాని క్రిస్టోఫర్ లక్సన్
అక్షరధామ్‌‌ను సందర్శించిన న్యూజిలాండ్ ప్రధాని క్రిస్టోఫర్ లక్సన్
శబరిమలలో మమ్ముట్టి కోసం మోహన్ లాల్ ప్రత్యేక పూజలు..
శబరిమలలో మమ్ముట్టి కోసం మోహన్ లాల్ ప్రత్యేక పూజలు..
కొలువుల కల్పవల్లికి ఒకేసారి 3 ప్రభుత్వ ఉద్యోగాలు.. సక్సెస్ జర్నీ
కొలువుల కల్పవల్లికి ఒకేసారి 3 ప్రభుత్వ ఉద్యోగాలు.. సక్సెస్ జర్నీ
ఇన్ని రికార్డులా..! సునీతమ్మా.. నీకు వందనం!
ఇన్ని రికార్డులా..! సునీతమ్మా.. నీకు వందనం!