Gold Rate: ఆకాశమే హద్దుగా దూసుకుపోతున్న గోల్డ్ రేటు.. ఈ పదిరోజుల్లోనే ఏకంగా 4 వేలు పైకి
అవును... గోల్డెన్ ఫియర్స్. వణుకు పుట్టిస్తున్నాయి పసిడి ధరలు. కంచు మోగినట్టు కనకంబు మోగునా... అంటారు. కానీ... కనకంబు మోగినట్టు కంచు కూడా మోగేటట్టు లేదు.

ఇప్పుడు మండుతున్న బంగారం ధరల్ని చూస్తే… కన్జ్యూమర్ గుండెలు గుభేల్‌మంటున్నాయి. ప్రతిరోజూ కనీసం 500 రూపాయలు పెరుగుతూ ఆకాశమే హద్దు అనేంతగా దూకుడు మీదుంది. గత పదిరోజుల్లోనే ఏకంగా 4 వేలు పెరిగిందంటే.. అర్థం చేసుకోవచ్చు గోల్డ్ ప్రైస్ ఏ రేంజ్‌లో రంకెలేస్తోందో…! రికార్డుల్లో నా పేరుండడం కాదు.. నా పేరు మీదే రికార్డులుంటాయ్…అని హూంకరిస్తోంది బులియన్ మార్కెట్. ఇవాళ 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర 60 వేలు పైనే పలుకుతోంది. 22 క్యారెట్ల ఆర్నమెంట్ బంగారం ధర ఒకేరోజు 1500 మేర పెరిగింది. 55 వేలకు పైనే ఉంది. అంతర్జాతీయ మార్కెట్లో 2 వేల డాలర్లున్న ఔన్స్ ధర 3 వేల డాలర్లు కావొచ్చని నిపుుణులంటున్నారు
ఒక్క వారంలో గ్రాముకి 500 పెరిగిన బంగారం ధర వినియోగదారుల్ని వణికిస్తోంది. బంగారం కొనేందుకు భయపడుతున్నామని, బంగారం మీద మక్కువను చంపుకోవాల్సి వస్తోందని వాపోతున్నారు. పెళ్లిళ్ల సీజన్ అవడంతో బంగారం కొనేందుకు వస్తున్న కస్టమర్స్ ధరలు చూసి గుటకలు మింగుతున్నారు. బంగారం ధర ఇలా జెట్ స్పీడుతో పరుగు పెట్టడానికి కారణం ఏంటంటే చాలానే చెప్పకొస్తారు ఎక్స్‌పర్ట్‌లు. అమెరికా డాలర్ బలహీనపడటం, సిలికాన్ వ్యాలీ బ్యాంక్ పతనం లాంటి పరిణామాలు కీలకం. దీంతో అంతర్జాతీయ మార్కెట్లో ఔన్స్ బంగారం ధర చుక్కల్ని తాకేసింది.
అమెరికన్ బ్యాంక్స్ కొలాప్స్ కావడం ఈ గోల్డ్ క్రైసిస్‌కి ప్రధాన కారణంగా చెబుతున్నారు. అటు.. దేశీయ, అంతర్జాతీయ స్టాక్‌మార్కెట్లు కూడా నానాటికీ పడిపోతున్నాయి. క్రిప్టో కరెన్సీ ఎప్పుడో మూల బడింది. ఇప్పుడు కొత్తగా బాండ్ మార్కెట్లు కూడా పతనమౌతున్నాయి. ఇదే క్రైసిస్ కనీసం మరో మూడునెలలు కంటిన్యూ అవుతుంది గనుక… 10 గ్రాముల బంగారం 90 వేలకు చేరుకోడానికి ఎంతో టైమ్ పట్టదన్నది బెంబేలెత్తిస్తున్న వార్త.
గత పదిరోజుల్లో హైదరాబాద్‌లో బంగారం ధరల్ని పరిశీలిస్తే… పెరుగుదల ఎంత ర్యాపిడ్‌గా జరిగిందో అర్థమవుతుంది. ఈ పదిరోజుల్లోనే ఏకంగా 4 వేలు పెరిగింది బంగారం ధర. ఒక్క 15వ తేదీ మాత్రమే 110 రూపాయలు తగ్గింది తప్ప మిగతా రోజుల్లో పైపైకే చూసింది పసిడి ధర.
గత పదిరోజుల్లో 24 క్యారెట్ల బంగారం ధరలు:
- 18 మార్చి 60,320
- 17 మార్చి 58,690
- 16 మార్చి 58,420
- 15 మార్చి 57,870
- 14 మార్చి 57,980
- 13 మార్చి 57,220
- 11, 12 మార్చి 56,890
- 10 మార్చి 56,070
ఏడేళ్ల వెనక్కెళ్తే ఇటువంటి సర్‌ప్రైజెస్ చాలానే కనిపిస్తాయ్. గత నెలరోజుల్లోనే నాలుగు వేలు పెరిగింది. రెండేళ్ల కిందట ఏడాది పాటు స్థిమితంగా ఉన్నప్పటికీ… ఆ తర్వాతే వేగం పుంజుకుంది. అంతకుముందయితే.. ఏటా సగటున 3 వేల చొప్పున పెరుగుతూనే ఉంది.
గోల్డ్ రేట్స్… ఫ్లాష్‌బ్యాక్…
- నెల రోజుల కిందట… 56,572
- ఏడాది కిందట… 53,052
- రెండేళ్ల కిందట… 50,982
- మూడేళ్ల కిందట… 50,683
- నాలుగేళ్ల కిందట… 47,901
- ఐదేళ్ల కిందట… 44,995
- ఆరేళ్ల కిందట… 42,752
- ఏడేళ్ల కిందట… 41,303
ఒకప్పుడు లక్ష పెడితే వచ్చే బంగారానికి ఇప్పుడు పది లక్షల దాకా పెట్టాల్సి వస్తోంది…. అంటూ వాపోతున్నారు విజయవాడలో వినియోగదారులు. ఈ ఏడాది చివరికల్లా 75 వేల రూపాయలకు చేరుకుంటుందని ఇంకాస్త భయపెడుతున్నారు వ్యాపారస్థులు. ప్రస్తుతం ఆర్థిక సంక్షోభం అంచుల్లో ఉంది ప్రపంచం. ఇటువంటి క్లిష్ట పరిస్థితుల్లో హెడ్జింగ్ టూల్‌గా పనికొచ్చేది బంగారమే. దానివల్ల… బులియన్ మార్కెట్లో పెట్టుబడులు పెరిగే అవకాశం కూడా లేకపోలేదు. పైగా… ఏప్రిల్ 1 నుంచి బంగారం విక్రయాలకు హాల్‌మార్కింగ్ నిబంధన అమల్లోకి వచ్చేస్తోంది. దీంతో షాపుల వాళ్లిచ్చే డిస్కౌంట్లు, ఆఫర్లు కట్టయిపోతాయ్.. దాని వల్ల కూడా ధర పెరగొచ్చు. ఏదేమైనా… రాబోయేరోజుల్లో బంగారం కొనేవాళ్లకు పెనుభారం… తప్పదన్నది క్లియర్.
మరిన్ని బిజినెస్ న్యూస్ కోసం