Gold Silver Price: 10 ఏళ్ల క్రితం బంగారం, వెండి ధరలు ఎంత? ఇప్పుడు చూస్తే కళ్లు బైర్లు కమ్మాల్సిందే!
Gold, Silver Prices: బంగారాన్ని సాధారణంగా ఆర్థిక అనిశ్చితి సమయంలో పెట్టుబడిదారులు సురక్షిత ఆస్తిగా చూస్తారు. అంతర్జాతీయ బంగారం ధరలు, అమెరికా వడ్డీ రేట్లు, డాలర్ విలువ, భౌగోళిక-రాజకీయ పరిస్థితులు, కేంద్ర బ్యాంకుల కొనుగోళ్లు, దేశీయ డిమాండ్ వంటి అంశాలు ధరలపై ప్రభావం..

Gold Silver Price: బంగారం, వెండి.. భారతీయులకు ఈ రెండు లోహాలతో ఉన్న అనుబంధం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. పెళ్లిళ్లు, పండుగలు, శుభకార్యాలతో పాటు పెట్టుబడి పరంగానూ బంగారం, వెండికి ఎప్పటి నుంచో ప్రత్యేక స్థానం ఉంది. అయితే గత కొన్నేళ్లుగా ఈ రెండు విలువైన లోహాల ధరలు భారీగా పెరుగుతున్నాయి.
ఇప్పుడు 2026లో బంగారం ధరలు లక్షన్నర రూపాయల మార్క్‌కు చేరువలో ఉండగా, వెండి ధర కూడా కిలోకు రూ.2 లక్షలకు పైగా ఉంది. మరి సరిగ్గా పదేళ్ల క్రితం అంటే 2016లో బంగారం, వెండి ధరలు ఎలా ఉండేవి? అప్పటి నుంచి ఇప్పటి వరకు ఎంత పెరిగాయి? లెక్కలు చూస్తే భారీ వ్యత్యాసం కనిపిస్తుంది.
2016లో బంగారం ధర ఎంత?
చారిత్రక ధరల ప్రకారం 2016 అక్టోబర్ 6న 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.29,608గా ఉంది. అంటే అప్పట్లో రూ.30 వేల లోపే 10 గ్రాముల స్వచ్ఛమైన బంగారం కొనుగోలు చేయగలిగేవారు. అదే 2016 అక్టోబర్ నెలలో బంగారం ధరలో కొంత హెచ్చుతగ్గులు కనిపించాయి. అక్టోబర్ 3న 24 క్యారెట్ల బంగారం 10 గ్రాములకు రూ.30,680 ఉండగా, అక్టోబర్ 14న అది రూ.29,590కి తగ్గింది. నెల చివర్లో మళ్లీ సుమారు రూ.30,057 వద్ద నమోదైంది.
మరి ఇప్పుడు బంగారం ధర ఎంత?
2026 అక్టోబర్ 6న 24 క్యారెట్ల బంగారం 10 గ్రాములకు రూ.1,49,935గా ఉంది. అంటే పదేళ్ల క్రితం ఉన్న రూ.29,608తో పోలిస్తే ప్రస్తుతం ధర దాదాపు ఐదు రెట్లు పెరిగింది.
బంగారం ధరలో ఎంత పెరుగుదల?
- 2016 అక్టోబర్ 6: రూ.29,608 / 10 గ్రాములు
- 2026 అక్టోబర్ 6: రూ.1,49,935 / 10 గ్రాములు
- పెరిగిన మొత్తం: రూ.1,20,327
- పెరుగుదల: సుమారు 406%
అంటే 2016లో రూ.1 లక్ష విలువైన 24 క్యారెట్ల బంగారం కొనుగోలు చేసి ఉంటే, అదే బంగారం 2026 ధరల ప్రకారం సుమారు రూ.5.06 లక్షల విలువను కలిగి ఉండేది. ఇది కేవలం ధరల ఆధారంగా చేసిన లెక్క మాత్రమే. ఆభరణాల తయారీ చార్జీలు, పన్నులు ఇందులో పరిగణనలోకి తీసుకోలేదు.
ఇక వెండి విషయానికి వస్తే..
బంగారంతో పోలిస్తే వెండి ధర తక్కువగా ఉన్నప్పటికీ, గత పదేళ్లలో వెండి కూడా భారీగా పెరిగింది. 2016 అక్టోబర్ 6న కిలో వెండి ధర రూ.41,417గా ఉంది. అంటే అప్పట్లో ఒక కిలో వెండి కొనాలంటే రూ.42 వేల లోపే ఖర్చయ్యేది. 2016లోనే వెండి ధరలో మంచి హెచ్చుతగ్గులు కనిపించాయి. ఉదాహరణకు అక్టోబర్ 3న కిలో వెండి ధర సుమారు రూ.45,339గా నమోదైంది. అక్టోబర్ 6 నాటికి అది రూ.41,417కి వచ్చింది.
2026లో వెండి ధర చూస్తే షాక్!
2026 అక్టోబర్ 6న కిలో వెండి ధర రూ.2,35,000గా ఉంది. అంటే పదేళ్ల క్రితం రూ.41,417గా ఉన్న ధర ఇప్పుడు రూ.2.35 లక్షలకు చేరింది.
వెండి ధరలో ఎంత పెరుగుదల?
- 2016 అక్టోబర్ 6: రూ.41,417 / కిలో
- 2026 అక్టోబర్ 6: రూ.2,35,000/ కిలో
- పెరిగిన మొత్తం: రూ.1,93,583
- పెరుగుదల: సుమారు 467.40%
2016లోనే బంగారం, వెండి కొనుంటే?
ఇక్కడే అసలు ఆసక్తికరమైన లెక్క ఉంది.
2016లో రూ.1 లక్షతో 24 క్యారెట్ల బంగారం కొనుగోలు చేసి ఉంటే, అప్పటి ధర ప్రకారం సుమారు 33.77 గ్రాముల బంగారం వచ్చేది. అదే బంగారం 2026 అక్టోబర్ 6 ధర ప్రకారం సుమారు రూ.5.06 లక్షల విలువ చేసేది. అదేవిధంగా 2016లో రూ.1 లక్షతో వెండి కొనుగోలు చేసి ఉంటే, దాదాపు 2.41 కిలోల వెండి వచ్చేది. 2026 ధర ప్రకారం దాని విలువ సుమారు రూ.5.46 లక్షలు అయ్యేది.
అయితే ఇవి ధరల ఆధారంగా చేసిన ఉదాహరణ లెక్కలు మాత్రమే. వాస్తవ పెట్టుబడి రాబడిలో GST, కొనుగోలు/అమ్మకం ధరల వ్యత్యాసం, మేకింగ్ ఛార్జీలు, ఇతర ఖర్చులు ప్రభావం చూపుతాయి.
వెండి ఎందుకు ఇంతగా పెరిగింది?
వెండికి కేవలం ఆభరణాల మార్కెట్లోనే కాకుండా పారిశ్రామిక రంగంలోనూ డిమాండ్ ఉంది. ఎలక్ట్రానిక్స్, సోలార్ ప్యానెల్స్, ఇతర పారిశ్రామిక అవసరాల్లో వెండిని ఉపయోగిస్తారు. దీంతో పారిశ్రామిక డిమాండ్, పెట్టుబడి డిమాండ్, అంతర్జాతీయ మార్కెట్ పరిస్థితులు వంటి అంశాలు వెండి ధరపై ప్రభావం చూపుతాయి. దీర్ఘకాలిక చారిత్రక డేటాలో కూడా వెండి ధరలో గణనీయమైన మార్పు కనిపిస్తుంది. ఉదాహరణకు 2015లో సుమారు రూ.37,825గా ఉన్న వార్షిక స్థాయి 2016లో సుమారు రూ.36,990గా ఉంది. ఆ తర్వాతి సంవత్సరాల్లో ధరలు మళ్లీ పెరుగుతూ వచ్చాయని బులియన్ మార్కెట్ నిపుణులు వెల్లడిస్తు్న్నారు.
బంగారం ధర పెరగడానికి కారణాలేంటి?
బంగారాన్ని సాధారణంగా ఆర్థిక అనిశ్చితి సమయంలో పెట్టుబడిదారులు సురక్షిత ఆస్తిగా చూస్తారు. అంతర్జాతీయ బంగారం ధరలు, అమెరికా వడ్డీ రేట్లు, డాలర్ విలువ, భౌగోళిక-రాజకీయ పరిస్థితులు, కేంద్ర బ్యాంకుల కొనుగోళ్లు, దేశీయ డిమాండ్ వంటి అంశాలు ధరలపై ప్రభావం చూపుతాయి. అందుకే బంగారం ధరలు ఒకే దిశలో నిరంతరం పెరుగుతాయని చెప్పలేం. మధ్యలో భారీగా పెరగడం, తగ్గడం కూడా జరుగుతుంది.
అప్పటితో పోలిస్తే ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారిపోయింది
2016లో 10 గ్రాముల బంగారం ధర రూ.30 వేల లోపే ఉండగా.. 2026లో అదే పరిమాణం దాదాపు రూ.1.50 లక్షలకు చేరింది. ఇక కిలో వెండి రూ.41 వేల స్థాయి నుంచి రూ.2.26 లక్షలకు చేరింది. అంటే పదేళ్ల కాలంలో బంగారం, వెండి రెండూ పెట్టుబడిదారులకు భారీ ధరల పెరుగుదలను చూపించాయి. అయితే గతంలో ధరలు పెరిగినంత మాత్రాన భవిష్యత్తులో కూడా అదే వేగంతో పెరుగుతాయని మాత్రం చెప్పలేం.
మొత్తంగా చూస్తే.. 2016లో రూ.30 వేల దగ్గర ఉన్న 10 గ్రాముల బంగారం.. 2026లో రూ.1.50 లక్షలకు చేరువైంది. అదే సమయంలో రూ.41 వేల దగ్గర ఉన్న కిలో వెండి.. ఇప్పుడు రూ.2.35 లక్షలకు చేరింది. ఈ పదేళ్ల ధరల ప్రయాణం చూస్తే బంగారం, వెండి మార్కెట్లలో ఎంత పెద్ద మార్పు వచ్చిందో స్పష్టంగా అర్థమవుతుంది.
గమనిక: నగలు కొనుగోలు చేసే సమయంలో పై బంగారం రేటుకు మేకింగ్ ఛార్జీలు, GST తదితరాలు అదనంగా ఉండవచ్చు. నగరం, విక్రేత, మార్కెట్ ఆధారంగా రిటైల్ ధరలు కూడా మారవచ్చు. అయితే గత పదేళ్ల లెక్కలు వివిధ వెబ్ సైట్లు, ఇతర నివేదికల ఆధారంగా అందించాము.
ఇది కూడా చదవండి: Flight Emergency Landing: విమానానికి ప్రమాద సంకేతం వస్తే పైలట్ ఏం చేస్తారు? విమానం జర్నీలో ఇంత టెక్నాలజీ ఉంటుందా?
ఇది కూడా చదవండి: Jio: మ్యాచ్ మధ్యలో డేటా అయిపోందా? నో టెన్షన్.. రూ. 50 లోపు 5 ఉత్తమ డేటా బూస్టర్ ప్లాన్‌లు!
ఇది కూడా చదవండి: JBL నుంచి అదిరిపోయే PartyBox స్పీకర్లు.. పవర్‌ఫుల్ సౌండ్‌తో కొత్త మోడల్స్ లాంచ్!
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
