
కారును కొనుగోలు చేయడం సులభమే. కానీ దాన్ని నిర్వహణకు మాత్రం పూర్తిస్థాయిలో శ్రద్ధ చూపాలి. లేకపోతే మరమ్మతులకు అధిక మొత్తంలో డబ్బులు ఖర్చు చేయాల్సి వస్తుంది. కారులోని అన్ని భాగాల్లో ఇంజిన్ అత్యంత ప్రధానమైంది. దాన్ని సక్రమంగా చూసుకుంటే కారు ఎప్పుడూ కొత్తదానిలా పరుగులు తీస్తుంది. ఈ కింద తెలిపిన ఐదు పద్ధతులు పాటిస్తే ఇంజిన్ చక్కగా పనిచేస్తుంది.
నిర్ణీత సమయానికి ఇంజిన్ ఆయిల్, ఫిల్టర్లను తప్పకుండా మార్చాలి. దీని వల్ల ఇంజిన్ వేడెక్కకుండా ఉంటుంది. తద్వారా దానిలో కదిలే భాగాలు చక్కగా పనిచేస్తాయి. కారు వేగంగా పరుగులు తీస్తుంది. వాటిపై నిర్లక్ష్యం చూపితే ఇంజిన్ లోని ముఖ్యమైన భాగాలు అరిగిపోతాయి. ఫలితంగా మరమ్మత్తులకు ఖర్చు ఎక్కువ అవుతుంది. ఒక్కోసారి ఇంజిన్ ను మార్చే అవసరం కూడా ఏర్పడవచ్చు.
ఓటర్ హీటింగ్ ను గమనించకుంటే ఇంజిన్ చెడిపోయే ప్రమాదం ఉంది. ప్రస్తుతం ఎండలు విపరీతంగా కాస్తున్నాయి. ఈ సమయంలో ఇంజిన్ వేడెక్కడం సర్వసాధారణం. అయితే కొన్నిసార్లు కూలెంట్ లీక్ అవ్వడం, థర్మోస్టాట్లు పనిచేయక పోవడం వల్ల కూడా ఓవర్ హీటింగ్ ఏర్పడవచ్చు. దీనివల్ల సిలిండర్ హెడ్, పిస్టన్లు వంటి ముఖ్యమైన భాగాలకు నష్టం కలుగుతుంది. వీటి మరమ్మతులకు ఖర్చు ఎక్కువవుతుంది. కాబట్టి ఓవర్ హీటింగ్ సమస్య వస్తే వెంటే అప్రమత్తమవ్వాలి.
ఇంజిన్ స్టార్ట్ అయిన వెంటనే ఇంజిన్ ఆయిల్ సర్క్యూలేట్ కావడానికి కొంచెం సమయం పడుతుంది. కాబట్టి స్టార్ట్ చేసిన తర్వాత కొంచెం సేపు ఆగాలి. ఇంజిన్ చల్లగా ఉన్నప్పుడు రివేవ్ చేయడం వల్ల పిస్టన్ రింగులు, సిలిండర్ గోడలు అరిగేపోయే ప్రమాదముంది. ఇంజిన్ ఎక్కువ కాలం పనిచేయాలంటే వేగాన్ని క్రమంగా పెంచడం, అవసరమైనప్పుడు తగ్గించడం చాలా అవసరం.
కారు సాధారణ నిర్వహణను నిర్లక్ష్యం చేస్తే కొంత కాలానికి భారీ మూల్యం చెల్లించుకుంటారు. ముఖ్యంగా ఇంజిన్ సమస్యలు ఎక్కువవుతాయి. ఎయిర్ ఫిల్టర్లు తనిఖీ చేయడం, అవసరమైనప్పుడు మార్చడం, ఇంజిన్ ఆయిల్, స్పార్క్ ప్లగ్ లు, టైమింగ్ బోల్టులను నిర్ణీత సమయానికి మార్చు చేయాలి. దీని వల్ల ఇంజిన్ మన్నిక ఎక్కువవుతుంది.
వాహనంలోని క్లచ్ పెడల్ పై కాలు ఉంచి డ్రైవింగ్ చేయడాన్ని క్లచ్ రైడింగ్ అంటారు. దీని వల్ల అనేక నష్టాలు కలుగుతాయి. క్లచ్ తొందరగా అరిగిపోవడంతో పాటు మైలేజీ తగ్గిపోతుంది. ఫలితంగా క్లచ్ జారడం, పనితీరు తగ్గడం తదితర సమస్యలు ఏర్పడతాయి. వీటిని మరమ్మతు చేసుకోవడానికి ఎక్కువ ఖర్చయ్యే అవకాశం ఉంది.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి