Financial tips: ఉద్యోగం పోయినా టెన్షన్ వద్దు.. ఈ చిట్కాలతో ఆ సమస్య దూరం
చదువులు పూర్తి చేసుకున్న యువతీ యువకులందరూ తమ స్థాయికి అనుగుణంగా ఉద్యోగాల అన్వేషణలో పడతారు. వివిధ కంపెనీల్లో ఉద్యోగాలు సాధించి, కొత్త జీవితాన్ని ప్రారంభిస్తారు. ప్రతి నెలా వచ్చే జీతం ఆధారణంగా తమకు కావాల్సిన వసతులు సమకూర్చుకుంటారు. వాటిలో ప్రధానంగా నెలవారీ వాయిదాలు చెల్లించేలా ఫ్లాట్, కారు ను కొనుగోలు చేస్తుంటారు.

ఉద్యోగంలో ఉన్నంత సేపూ ప్రతి నెలా వచ్చే జీతంతో రుణ వాయిదాలు సక్రమంగా చెల్లించవచ్చు. కానీ అనుకోకుండా ఉద్యోగం కోల్పోయితే చాలా ఇబ్బందులు పడాలి. ముఖ్యంగా నెలవారీ ఈఎంఐలకు డబ్బులు ఉండవు. ఈ సమయంలో చాలా నిరాశకు, ఒత్తిడికి గురవుతారు. కొందరు ప్రమాదకర నిర్ణయాలు తీసుకుంటారు. అయితే తెలివిగా ఆలోచిస్తే ఈ సమస్యల నుంచి బయట పడవచ్చని కొందరు ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. ఆ విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.
ఆర్థిక పరిస్థితి
అనుకోకుండా ఉద్యోగాన్ని కోల్పోయితే కంగారు పడకూడదు. ముందుగా మీ ఆర్థిక పరిస్థితిని అంచనా వేసుకోవాలి. మీ ఆస్తులు, అప్పులు, నెలవారీ ఖర్చులు, ఆదాయ వనరులను లెక్కించాలి. అది మీకు చాలా స్పష్టంగా మీ ఆర్థిక పరిస్థితిని తెలియజేస్తుంది. తద్వాారా నిర్ణయాలు తీసుకోవడానికి ఉపయోగపడుతుంది.
ఖర్చులు
మీ ఖర్చులను ప్రణాళికాబద్దంగా విభవించుకోవడం చాలా అవసరం. ఇంటి అద్దె, యుటిలిటీలు, కిరాణా, మెడిసిన్స్ తదితర అత్యవసర ఖర్చులు తప్పవు. కానీ విలాసం, హోటళ్లలో భోజనం, వినోదం వంటి అనవసర ఖర్చులను తగ్గించుకోవాలి.
బడ్జెట్
నిరుద్యోగ సమయంలో ఆర్థిక ఇబ్బందుల నుంచి బయట పడాలంటే బడ్జెట్ ను రూపొందించుకోవడం చాాలా అవసరం. అవసరమైన ఖర్చులతో ప్రస్తుత ఆర్థిక పరిస్థితికి అనుగుణంగా ప్రణాళిక రూపొందించుకోవాలి.
అత్యవసర నిధి
ప్రతి ఒక్కరూ అత్యవసర నిధి కోసం ఎప్పుడు కొంత మొత్తం కేటాయించాలి. ఉద్యోగం లేని సమయంలో మీ అవసరాలకు ఇది చాలా ఉపయోగపడుతుంది. దీనిలో డబ్బులు కనీసం ఆరు నుంచి పన్నెండు నెలల అవసరాలకు సరిపోయేలా చూసుకోవాాలి. కొత్త ఉద్యోగం దొరికే వరకూ మీ అవసరాలకు చాలా బాగా ఉపయోగపడుతుంది.
పార్ట్ టైమ్
ఉద్యోగం పోయిన తర్వాత కొత్త ఉద్యోగం దొరకడానికి కొంత సమయం పడుతుంది. ఈ సమయంలో ఆదాయం కోసం ఫ్రీలాన్సింగ్, పార్ట్ టైమ్ ఉద్యోగాలను చేయండి. వీటి వల్ల వచ్చే ఆదాయం మీకు ఉపశమనం కలిగించవచ్చు. ముఖ్యంగా టీచింగ్, కన్సల్టింగ్ వంటిని ఎంపిక చేసుకోవచ్చు.
వాయిదా
ఉద్యోగం చేసే సమయంలో వస్తున్న ఆదాయానికి అనుగుణంగా మీరు కొన్ని లక్ష్యాలను పెట్టుకోవచ్చు. సెలవుల్లో సరదాగా గడపడం, విలువైన వస్తువులు కొనడం వాటిలో ఉండవచ్చు. అలాంటి వాటిని వాయిదా వేసుకోవడం వల్ల మీకు ఆర్థికంగా ఒత్తిడి ఉండదు.
క్రెడిట్ కార్డులు
కుటుంబం గడవటానికి క్రెడిట్ కార్డులు, వ్యక్తిగత రుణాలపై ఆధారపడకూడదు. అధిక వడ్డీతో అప్పులు చేస్తే మీకు మరిన్ని సమస్యలు తలెత్తవచ్చు. క్రెడిట్ వినియోగం కూడా పరిమితికి మించితే ఇబ్బందే. ఇవి మీ ఆర్థిక పరిస్థితిని మరింత దిగజార్చే అవకాశం ఉంటుంది.
సానుకూల ధోరణి
ఉద్యోగం కోల్పోయినా సానుకూల ధోరణితో వ్యవహరించాలి. నెట్ వర్కింగ్ కార్యకలాపాల్లో పాల్గొనడం, పరిశ్రమ కార్యక్రమాలకు హాజరు కావడం, లింక్డ్ ఇన్ వంటి ప్రొఫెషనల్ ప్లాట్ ఫాంలలో చురుగ్గా పాల్గొనడం చేయాలి. అలాగే మీ నైపుణ్యాలను పెంచుకోవడానికి సర్టిఫికెట్ కోర్సులు చేయవచ్చు.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి








