Health Insurance: ఆరోగ్య బీమాతో ప్రయోజనాలెన్నో.. చిన్న టిప్స్‌తో ప్రీమియం తగ్గింపు
ఆరోగ్యమే మహాభాగ్యం అనే మాటను మనం తరచూ వింటూ ఉంటాం. అన్నింటి కన్నా గొప్పది ఆరోగ్యమేనని దీని అర్థం. ఇది అక్షరాలా నూటికి నూరుశాతం నిజం. నేటి కాలంలో చిన్న వయసులోనే రోగాలు దాడి చేస్తున్నాయి. మారిన జీవన శైలి, ఆహారపు అలవాట్లు, రాత్రి పూట పనులు, ఒత్తిడి, కాలుష్యం.. ఇలా చెప్పుకుంటూపోతే అనేక కారణాలు కనిపిస్తాయి. రోగాల బారిన పడి ఆస్పత్రిలో చేరితే చికిత్సకు రూ.లక్షల్లో బిల్లు అవుతుంది. దీంతో ఆరోగ్య బీమా పాలసీలకు ఆదరణ బాగా పెరిగింది. కానీ వీటి ప్రీమియాలు చాాలా ఎక్కువగా ఉంటున్నాయి.

ముఖ్యంగా సీనియర్ సిటిజన్ల విషయంలో బీమా ప్రీమియం ఎక్కువగా ఉంటుంది. అయితే ఓ చిన్న పద్ధతిని పాటించి బీమా ప్రీమియం మొత్తాన్ని తగ్గించుకోవచ్చు. దాని వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం. ఆరోగ్య బీమా పాలసీ తీసుకున్నప్పుడు కో పే (సహ చెల్లింపు) అనే విధానాన్ని ఎంచుకోవాలి. దీని వల్ల పాలసీకి కట్టే ప్రీమియం తగ్గుతుంది. ఉద్యోగ విరమణ తర్వాత పరిమిత ఆదాయం పొందే సీనియర్ సిటిజన్లకు చాలా ఉపయోగం కలుగుతుంది. కో పే లేదా కో కవర్ అంటే బీమా కంపెనీ కవర్ చేసే వైద్య ఖర్చుల నుంచి కొంత మొత్తాన్ని పాలసీదారుడు భరిస్తాడు. పాలసీని కొనుగోలు చేసిన సమయంలోనే పాలసీదారుడు ఎంత శాతం చెల్లించాలో స్పష్టంగా చెబుతారు. సాధారణంగా ఇది పది నుంచి ముప్పై శాతం ఉంటుంది. వీటిని సీనియర్ సిటిజన్ల పాలసీలకు ఎక్కువగా అమలు చేస్తారు. మరికొన్ని పాలసీలకు ఇన్ బిల్ట్ గా అమలవుతుంది. దీని వల్ల బీమా పాలసీ ప్రీమియం తగ్గుతుంది. నిబంధనల ప్రకారం వైద్య ఖర్చులో కో పే మొత్తాన్ని పాలసీదారుడు చెల్లించిన తర్వాతే బీమా సంస్థ మిగిలిన మొత్తాన్ని అందజేస్తుంది.
బీమా పాలసీలో కో కవర్ (సహ చెల్లింపులు)ను ఎంపిక చేసుకోవడం వల్ల కొన్ని ప్రయోజనాలు కలుగుతాయి. వైద్య ఖర్చులో 70 నుంచి 80 శాతం మాత్రమే బీమా సంస్థలు చెల్లిస్తాయి కాబట్టి, పాలసీ ప్రీమియం బాగా తగ్గిపోతుంది. సీనియర్ సిటిజన్లు తక్కువ ధరకు కొనుగోలు చేసే అవకాశం ఉంటుంది. తమ ఆరోగ్య అవసరాలు, ఆర్థిక సామర్థ్యానికి అనుగుణంగా పాలసీని రూపొందించుకోవడానికి అవకాశం ఉంటుంది. ప్రీమియం తగ్గడం వల్ల వారి పొదుపు పెరుగుతుంది. ఆస్పత్రిలో తరచూ చేరే అవసరం లేని వారికి, ఖరీదైన చికిత్సలు అవసరం లేని వారికి కో కవర్ విధానం చాలా ఉపయోగపడుతుంది.
ఉదాహరణకు ఒక వ్యక్తి 20 శాతం కో కవర్ విధానంలో ఆరోగ్య బీమా పాలసీ తీసుకున్నాడు. అతడికి ఆస్పత్రిలో వైద్య ఖర్చు రూ.లక్ష అయ్యింది. కో కవర్ నిబంధన ప్రకారం.. అతడు రూ.20 వేలు చెల్లించాలి. మిగిలిన మొత్తం బీమా సంస్థ అందజేస్తుంది. అన్ని వ్యాధులు, సేవలకు కాకుండా నిర్థిష్ట వ్యాధులకు మాత్రమే కో కవర్ తీసుకోవచ్చు. అలాగే ఇన్స్యూరర్, నెట్ వర్క్ ఆస్పత్రుల్లో కాకుండా ఇతర ఆసుపత్రుల్లో చికిత్స తీసుకున్నప్పుడు వర్తించవచ్చు. కాబట్టి కో కవర్ తీసుకునే ముందు ఆరోగ్య పరిస్థితిని అంచనా వేసుకోవాలి.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి








