AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

అమెరికా బెదిరింపును లెక్కచేయని ఇరాన్‌! హార్ముజ్‌పై నెక్ట్స్‌ ఏం జరగబోతుందంటే?

ఇస్లామాబాద్‌లో అమెరికా, ఇరాన్‌ల శాంతి చర్చలు విఫలమవడం ప్రపంచ ఉద్రిక్తతలను పెంచింది. ఇరాన్ అణు కార్యక్రమం, హార్ముజ్ జలసంధి నియంత్రణపై విభేదాలు ప్రధాన కారణం. ఇరాన్ హార్ముజ్ నియంత్రణ ప్రకటించడంతో చమురు రవాణా, గ్లోబల్ సరఫరా గొలుసులకు ఆటంకం కలిగే ప్రమాదం ఏర్పడింది.

అమెరికా బెదిరింపును లెక్కచేయని ఇరాన్‌! హార్ముజ్‌పై నెక్ట్స్‌ ఏం జరగబోతుందంటే?
Strait Of Hormuz
SN Pasha
|

Updated on: Apr 13, 2026 | 5:50 AM

Share

పాకిస్థాన్ రాజధాని ఇస్లామాబాద్‌లో అమెరికా, ఇరాన్‌ మధ్య జరిగిన శాంతి చర్చలు పూర్తిగా విఫలమవడం అంతర్జాతీయ స్థాయిలో ఉద్రిక్తతలను మరింత పెంచింది. ఈ విషయాన్ని అమెరికా ఉపాధ్యక్షుడు జెడీ వాన్స్‌ అధికారికంగా ధృవీకరించడంతో, ప్రపంచ మార్కెట్లు, వాణిజ్య వర్గాల్లో ఆందోళనలు పెరిగాయి. ముఖ్యంగా ఇరాన్ అణు కార్యక్రమం, అలాగే స్ట్రెయిట్‌ ఆఫ్‌ హార్ముజ్‌ నియంత్రణపై ఉన్న విభేదాలే ఈ చర్చల విఫలానికి ప్రధాన కారణాలుగా కనిపిస్తున్నాయి. చర్చలు విఫలమైన వెంటనే, ఇరు దేశాల మధ్య మాటల యుద్ధం తీవ్రరూపం దాల్చింది. దీనికి తోడు, హోర్ముజ్ జలసంధిపై తన నియంత్రణను బలపరుస్తున్నట్లు ఇరాన్ ప్రకటించడం మరింత ఆందోళన కలిగిస్తోంది.

ప్రపంచంలో అత్యంత కీలకమైన చమురు, గ్యాస్ రవాణా మార్గాల్లో ఒకటైన ఈ జలసంధి గుండా నౌకల రాకపోకలను తీవ్రంగా పరిమితం చేస్తామని ఇరాన్ స్పష్టం చేసింది. ప్రతిరోజూ కేవలం పది నౌకలను మాత్రమే అనుమతించడంతో పాటు, ప్రతి వాణిజ్య నౌకపై సుమారు 2 మిలియన్ డాలర్ల భారీ రుసుమును విధించడం అంతర్జాతీయ రవాణా ఖర్చులను అమాంతం పెంచే అవకాశముంది. ఈ పరిణామాలపై ప్రపంచ వ్యాప్తంగా తీవ్ర ప్రతిస్పందనలు వ్యక్తమవుతున్నాయి. యూఏఈకు చెందిన ADNOC అధిపతి సుల్తాన్‌ అహ్మద్‌ అల్‌ జబీర్‌ ఇరాన్ చర్యలను ఖండిస్తూ, హోర్ముజ్ జలసంధిపై ఏకపక్ష నియంత్రణ సాధ్యం కాదని స్పష్టం చేశారు. ఈ కీలక మార్గానికి అంతరాయం కలిగితే, ప్రపంచ చమురు, గ్యాస్ సరఫరా గొలుసుపై తీవ్ర ప్రభావం పడటంతో పాటు, ఆహారం, ఆరోగ్య సరఫరాలు కూడా దెబ్బతింటాయని ఆయన హెచ్చరించారు.

ఇస్లామాబాద్ చర్చలు ఎందుకు విఫలమయ్యాయనే దానిపై ఇరాన్ పార్లమెంట్ స్పీకర్ మొహమ్మద్ బఘేర్ ఘాలిబాఫ్ స్పందిస్తూ, అమెరికా ప్రతినిధులు నమ్మకాన్ని కల్పించడంలో విఫలమయ్యారని ఆరోపించారు. గత యుద్ధాల అనుభవాల కారణంగా అమెరికాపై నమ్మకం తగ్గిపోయిందని ఆయన పేర్కొన్నారు. ఈ నమ్మకరాహిత్యం శాంతి ప్రయత్నాలకు పెద్ద అడ్డంకిగా మారింది. మొత్తం మీద ఈ దౌత్య వైఫల్యం ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై తీవ్రమైన ప్రభావం చూపే సూచనలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా చమురు ధరలు పెరగడం, రవాణా ఖర్చులు అధికమవడం, గ్లోబల్ సరఫరా గొలుసులో అంతరాయాలు ఏర్పడటం వంటి పరిణామాలు సమీప భవిష్యత్తులో ప్రపంచాన్ని ప్రభావితం చేసే అవకాశముంది.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us