SIR Status: ఎస్‌ఐఆర్‌లో మీ పేరు నమోదైందా..? లేదా? ఈ నెంబర్‌కు ఒకే ఒక్క మెస్సేజ్ చేస్తే సెకన్లలోనే స్టేటస్..
మీ ఓటు ఎస్ఐఆర్‌లో నమోదు అయిందా.. లేదా అనేది సులువుగా తెలుసుకోవచ్చు. జస్ట్ ఒక్క మెస్సేజ్ పంపితే చాలు వివరాలు అన్నీ వచ్చేస్తాయి. ఈ మేరకు ఈసీ కొత్త సదుపాయం అమల్లోకి తీసుకొచ్చింది. అయితే మెస్సేజ్ ఎంలా పంపాల అనే వివరాలు ఇప్పుడు చూద్దాం.

తెలుగు రాష్ట్రాల్లో ఓటర్ల జాబితా సమగ్ర సవరణ(ఎస్‌ఐఆర్) జోరుగా సాగుతోంది. బీఎల్‌ఓలు ఇంటింటికి తిరుగతూ ఈ ప్రక్రియ వేగవంతంగా పూర్తి చేసేలా ప్రయత్నాలు చేస్తున్నారు. ఇక ఓటర్లు కూడా స్వచ్చంధంగా ముందుకొచ్చి ఎస్‌ఐఆర్‌లో పాల్గొంటున్నారు. బీఎల్ఓలు ఇచ్చిన ఎమ్యూనరేషన్ ఫారం నింపి ఓటర్లు తిరిగి అందిస్తున్నారు. ఈ ఫారాలను బీఎల్‌ఓలు ఈసీ డేటాబేస్‌లో అప్ లోడ్ చేస్తున్నారు. ఏ రోజు సేకరించిన ఫారాంలను ఆ రోజే అప్‌లోడ్ చేయాలి. ఇలా చేస్తేనే ఓటర్ల ఎస్‌ఐఆర్ ప్రక్రియ పూర్తయినట్లు లెక్క. ఎస్ఐఆర్‌లో పాల్గొనకపోతే ప్రజలు తమ ఓటు హక్కు కోల్పోతారు. దీంతో ప్రతీఒక్కరూ తప్పనిసరిగా ఇందులో పాల్గొనాలి. అయితే చాలామందిలో ఓ భయం ఉంది. తమ పేరు ఎస్‌ఐఆర్‌లో నమోదైందా.. లేదా అనేది తెలుసుకోవడం ఎలా అనే సందేహాం ఉంది. అయితే ఒక్క మెస్సేజ్‌తో మీరు దీనిని సులువుగా తెలుసుకోవచ్చు. అదెలా అనేది చూద్దాం.
ఈ నెంబర్‌కు మెస్సేజ్ చేస్తే చాలు..
ఎస్ఐఆర్‌లో మీ పేరు నమోదు కాకపోతే ఓటు హక్కు కోల్పోతారు. దీంతో ప్రజలు తమ ఎస్ఐఆర్ పూర్తయిందా.. లేదా అనేది సులభంగా తెలుసుకోవచ్చు. జస్ట్ ఒక ఎస్ఎంఎస్ పంపడం ద్వారా ఎస్ఐఆర్ స్టేటస్ తెలుసుకోవచ్చు. ఈ మేరకు ఈసీ ఏర్పాట్లు చేసింది. ఎస్ఎంఎస్ ద్వారా తెలుసుకోవాలంటే.. ECI అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి ఆ తర్వాత మీ ఓటర్ ఐడీ నంబర్ నమోదు చేయాలి. అనంతరం 1950 నంబర్‌కు మెస్సేజ్ పంపించాలి. మీరు మెస్సేజ్ పంపగానే సెకన్లలోనే ఈసీ నుంచి మెస్సేజ్ వస్తుంది. అందులో మీ పేరు, సీరియల్ నెంబర్, పోలింగ్ కేంద్రం, పార్ట్ నెంబర్, నియోజకవర్గం వివరాలు ఉంటాయి. ఈ వివరాలు వస్తే మీ పేరు ఎస్ఐఆర్‌లో నమోదయినట్లు అర్థం చేసుకోవచ్చు. ఈ మెస్సేజ్‌లో మీ వివరాలు తప్పుగా ఉన్నా లేదా మెస్సేజ్ రాకపోయినా బూత్ లెవర్ ఆఫీస్ లేదా ఎన్నికల అధికారులను సంప్రదించండి.
ఆన్‌లైన్‌లోనే ఎస్ఆర్ ప్రక్రియ
అయితే ఎస్ఐఆర్ ప్రక్రియ ముగిసిన తర్వాత ఓటర్ల ప్రాధమిక తుది జాబితాను ఈసీ విడుదల చేయనుంది. ఇందులో మీ పేరు ఉందో లేదో చూసుకోవచ్చు. అలాగే వివరాల్లో తప్పులు ఉంటే సవరణలు చేసుకునేందకు ఈసీ అవకాశం కల్పించనుంది. ఎన్నికల సమయంలో ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొకుండా ఉండాలంటే ఇప్పుడు మీ వివరాలు చెక్ చేసుకోండి. ఇక ఎమ్యూనరేషన్ ఫారం ఆన్‌లైన్‌లో ఫిల్ చేసే అవకాశం కూడా ఈసీ కల్పిస్తోంది. ఈసీ వెబ్ సైట్లోకి వెళ్లి ఆన్‌లైన్లో నింపవచ్చు. అనంతరం బీఎల్‌ఓకు అందిస్తే సరిపోతుంది.
