CIBIL: లోన్ ప్రీ క్లోజ్ చేస్తే క్రెడిట్ స్కోర్ పెరుగుతుందా? తగ్గుతుందా? అలాగే ఉంటుందా?
రుణాన్ని ముందే చెల్లించడం వల్ల వడ్డీ భారం తగ్గి, ఆర్థికంగా ప్రయోజనకరంగా ఉంటుంది. అయితే, కొన్నిసార్లు ఇది క్రెడిట్ స్కోర్‌పై స్వల్ప ప్రభావం చూపవచ్చు. యాక్టివ్ లోన్ ఖాతాలు తగ్గడం, క్రెడిట్ మిక్స్ మారడం వంటివి దీనికి కారణం. అయినప్పటికీ, ఆర్థిక స్వేచ్ఛ, అప్పుల ఒత్తిడి తగ్గడం వంటి ప్రయోజనాలు ఎక్కువ.

రుణాన్ని గడువుకంటే ముందే పూర్తిగా చెల్లించడం చాలా మందికి మంచి ఆర్థిక నిర్ణయంగా కనిపిస్తుంది. వడ్డీ భారం తగ్గడం, నెలవారీ EMIల నుంచి ఉపశమనం కలగడం, అప్పుల ఒత్తిడి తగ్గడం వంటి ప్రయోజనాలు దీనివల్ల ఉంటాయి. అయితే చాలామందికి తెలియని విషయం ఏమిటంటే, ముందుగానే లోన్ క్లోజ్ చేయడం కొన్ని సందర్భాల్లో క్రెడిట్ స్కోర్‌పై స్వల్ప ప్రభావం చూపవచ్చు. సాధారణంగా క్రెడిట్ స్కోర్‌ను నిర్ణయించేటప్పుడు బ్యాంకులు, క్రెడిట్ బ్యూరోలు పలు అంశాలను పరిగణలోకి తీసుకుంటాయి. అందులో ముఖ్యమైనవి రుణ చరిత్ర వ్యవధి, చెల్లింపుల క్రమశిక్షణ, యాక్టివ్ లోన్ అకౌంట్ల సంఖ్య, క్రెడిట్ మిక్స్ వంటివి.
ఒక వ్యక్తి చాలా కాలంగా నిర్వహిస్తున్న రుణాన్ని అకస్మాత్తుగా పూర్తిగా మూసివేస్తే, అతని యాక్టివ్ క్రెడిట్ ఖాతాల సంఖ్య తగ్గిపోతుంది. దీంతో క్రెడిట్ హిస్టరీ సగటు వ్యవధి కూడా ప్రభావితమయ్యే అవకాశం ఉంటుంది. ఇంకా వ్యక్తి వద్ద గృహ రుణం, వాహన రుణం, క్రెడిట్ కార్డ్ వంటి విభిన్న రకాల రుణాలు ఉంటే దానిని క్రెడిట్ మిక్స్ గా పరిగణిస్తారు. ఇది మంచి ఆర్థిక నిర్వహణకు సూచికగా భావిస్తారు. అయితే ఒక రుణాన్ని ముందుగానే క్లోజ్ చేస్తే, ఆ క్రెడిట్ మిక్స్ తగ్గి స్కోర్‌లో చిన్న మార్పు కనిపించవచ్చు.
అదే సమయంలో లోన్ యాక్టివ్‌గా ఉన్నప్పుడు ప్రతి నెలా EMI చెల్లింపులు క్రెడిట్ రిపోర్ట్‌లో సానుకూల రికార్డులుగా చేరుతుంటాయి. రుణం ముగిసిన తర్వాత ఆ యాక్టివ్ రిపోర్టింగ్ ఆగిపోతుంది. దీంతో కొన్ని సందర్భాల్లో స్కోర్ తాత్కాలికంగా తగ్గే అవకాశం ఉంటుంది. అయితే నిపుణులు చెబుతున్నదేమిటంటే, ఇది పెద్ద నష్టం కాదు. ముందుగానే రుణం తీర్చడం వల్ల అప్పు భారం తగ్గడం, ఆర్థిక స్వేచ్ఛ పెరగడం వంటి ప్రయోజనాలు ఎక్కువగా ఉంటాయి. ముఖ్యంగా కొత్త రుణం కోసం త్వరలో దరఖాస్తు చేయాలనుకునే వారు మాత్రమే ముందస్తు చెల్లింపుల ప్రభావాన్ని ఒకసారి పరిశీలించడం మంచిదని సూచిస్తున్నారు.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
