
డొనాల్డ్ ట్రంప్ గత పదవీకాలంలో హెచ్ 1బీ ఉద్యోగులకు జీతాలు, వీసా ఫీజులు పెరిగాయి. ఈ వ్యవధిలో ప్రస్తుతం 85,000కి పరిమితం చేసిన హెచ్1బీ వర్క్ వీసాల వార్షిక కేటాయింపును ట్రంప్ ప్రస్తుతం పునఃపరిశీలించవచ్చని నిపుణులు చెబుతున్నారు. గత ట్రంప్ పరిపాలనలో తిరస్కరణ రేట్లు ఆల్ టైమ్ గరిష్ట స్థాయి 24 శాతానికి కి చేరుకున్నందున, హెచ్1బీ అప్లికేషన్లు కఠినమైన పరిశీలనను ఎదుర్కోవాల్సి ఉంటుంది. ముఖ్యంగా అంతర్జాతీయ విద్యార్థుల కోసం ఆప్షనల్ ప్రాక్టికల్ ట్రైనింగ్ (ఓపీటీ) వ్యవధి, అర్హత కూడా సమీక్షలోకి రావచ్చని అంచనా వేస్తున్నారు. ఈ భయాలు భారతీయులను వేధిస్తున్నా భారతదేశ బెంచ్ మార్క్ స్టాక్ సూచీలపై టెక్ స్టాక్లు ర్యాలీని నడిపించడంతో భారత ఐటీ కంపెనీలు రిపబ్లికన్ విజయాన్ని సంబరాలు చేసుకున్నాయి.
డొనాల్డ్ ట్రంప్ రెండోసారి అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు చేపడతారని స్పష్టత రావడంతో బెంచ్ మార్క్ సూచీల్లో ర్యాలీకి ఆజ్యం పోసిన ఐటీ షేర్లు భారీగా పెరిగాయి. టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్) షేర్లు 4.21 శాతం, ఇన్ఫోసిస్ 4.02 శాతం, టెక్ మహీంద్రా 3.85 శాతం, హెచ్‌సీఎల్ టెక్నాలజీస్ 3.71 శాతం చొప్పున బీఎస్ఈలో పెరిగాయి. అలాగే పెర్సిస్టెంట్ సిస్టమ్స్ 5.86 శాతానికి చేరుకోగా, ఎల్‌టీఐ మైండ్ ట్రీ 4.75 శాతం, విప్రో 3.75 శాతం పురోగమించాయి. ఈ నేపథ్యంలో ట్రంప్ ప్రస్తుత పదవీ కాలంలో భారత ఐటీ రంగంతో పాటు ప్రపంచవ్యాప్తంగా ప్రభావితమయ్యే విషయాలను నిపుణులు అంచనా వేస్తున్నారు.
ఐటీ కంపెనీలు వడ్డీ రేట్లు, ద్రవ్యోల్బణం మొదలైన వాటి చుట్టూ సులభమైన ఫైనాన్స్ విధానాలను ఆశిస్తున్నాయి. ఇది యూసీ కంపెనీల ఐటీ బడ్జెట్లను సడలించడంలో సహాయపడవచ్చు. బలమైన డాలర్ భారతీయ ఔట్ సోర్సింగ్ పరిశ్రమకు ప్రయోజనం చేకూరుస్తుంది. మెజారిటీ ఐటీ సేవల కంపెనీలు యూఎస్‌ను కీలక వ్యాపార మార్కెట్గా అందజేస్తున్నాయి. తద్వారా ఐటీ రంగం వారి నిర్వహణ ఖర్చులు భారతీయ రూపాల్లో ఉన్నప్పటికీ యూఎస్ కరెన్సీలో వారి ఆదాయంలో అధిక భాగాన్ని పొందుతుంది.
ప్రభుత్వం, సెనేట్, కాంగ్రెస్‌లను రిపబ్లికన్లు నియంత్రిస్తున్నందున విధాన రూపకల్పనలో స్థిరత్వం ఉండే అవకాశం ఉంది.
కార్పొరేట్ పన్ను రేటును 21 శాతం నుంచి 15శాతానికి తగ్గించాలన్న డొనాల్డ్ ట్రంప్ ప్రతిపాదించిన విషయం తెలిసిందే. ఈ నిర్ణయం అమలైతే బడ్జెట్ ఒత్తిళ్లను తగ్గించడానికి, యూఎస్ కంపెనీల టెక్ ఖర్చులను విస్తరించడానికి, తద్వారా యూఎస్‌లో నమోదు చేసుకున్న భారతీయ స్టార్టప్లకు, టెక్నాలజీ కంపెనీలకు ప్రయోజనం చేకూర్చే అవకాశం ఉంది..
చైనాపై డొనాల్డ్ ట్రంప్ కఠినమైన వైఖరి అంటే భారతదేశానికి యూఎస్ నిధుల ప్రవాహం పెరుగుతుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. ముఖ్యంగా భారతదేశంలో ఏఐతో పాటు సెమీకండక్టర్ల వంటి అధునాతన సాంకేతికతలపై యూఎస్ పెట్టుబడులు పెరిగే అవకాశం ఉంది.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి