Indusind bank: ఒక్కరోజులోనే కోట్ల రూపాయలు ఆవిరి.. ఆ ప్రైవేటు బ్యాంకుకు ఎంత నష్టమో తెలుసా..?
ప్రముఖ ప్రైవేటు రుణదాత అయిన ఇండస్ ఇండ్ బ్యాంకు కు కోలుకోలేని షాక్ తగిలింది. ఈ బ్యాంకు షేర్లు మార్చి 11వ తేదీన భారీగా పతనమయ్యాయి. దీంతో కేవలం ఒక్కరోజులోనే రూ.18 వేల కోట్లు ఆవిరైపోయాయి. ఈ బ్యాంకు క్యాపిటలైజేషన్ రూ.70.150 కోట్ల నుంచి రూ.52,168 కోట్లకు తగ్గిపోయింది. బ్యాంకులోని అకౌంటింగ్ సమస్యలు వెలుగులోకి వచ్చిన తర్వాత ఈ మార్పు చోటుచేసుకుంది. స్టాక్ విలువ 52 వారాల కనిష్ట స్థాయికి రూ.674.55కు చేరుకుంది. దీనికి గల కారణాలను ఇప్పుడు తెలుసుకుందాం.

ఇండస్ ఇండ్ బ్యాంకు తన డెరివేటివ్స్ పోర్టుపోలియో ఖాతాల నిర్వహణలో రూ.2100 కోట్ల మేర అంతరం నమోదైనట్టు తాజాగా ప్రకటించింది. అయితే తమ వద్ద రిజర్వులు, మూలధనం ఉండడంతో ఆ లోటును భర్తీ చేసుకోగలమని కూడా తెలిపింది. అయితే ఇన్వెస్టర్లలో తీవ్ర ఆందోళనలు నెలకొన్నాయి. ఫలితంగా ట్రేడింగ్ ప్రారంభంలోనే ఈ బ్యాంకు షేరు పతనమైంది. దీని ప్రభావం బ్యాంకు, దాని పెట్టుబడులపై బాగా పడుతుంది. డెరివేటివ్స్ ఖాతాలలో వ్యత్సాసాలను గతేడాది సెప్టెంబర్ – అక్టోబర్ లో గుర్తించినట్టు ఇండస్ ఇండ్ బ్యాంకు సీఈవో, ఎండీ సుమంత్ కథ్పాలియా తెలిపారు. దీనిపై రిజర్వ్ బ్యాంకుకు గత వారమే సమచారం ఇచ్చామన్నారు. తుది వివరాలు బయటి ఏజెన్సీలో చేయిస్తున్న ఆడిట్ ద్వారా వెల్లడవుతాయన్నారు. ఆ నివేదిక ఏప్రిల్ మొదటి వారంలో విడుదలవుతుందన్నారు. లాభదాయకత, మూలధన పటిష్టత కారణంగా ఈ ప్రభావాన్ని బ్యాంకు సర్దుబాటు చేసుకోగలదని వెల్లడించారు. 2024 ఏప్రిల్ ఒకటికి ముందు 5-7 ఏల్లుగా డెరివేటివ్ పోర్ పోలియో ఖాతాలో తేడా నమోదవుతూ వచ్చిందన్నారు.
ఇండస్ ఇండ్ బ్యాంకు స్టాక్ భారీగా క్షీణించడంతో పాటు భారతీయ బ్యాంకింగ్ రంగం కూడా స్వల్పంగా దెబ్బతింది. నిఫ్టీ బ్యాంక్ ఇండెక్స్ 0.7 శాతం పడిపోయింది. బ్యాంకింగ్ స్టాక్ లపై పెట్టుబడి దారుల విశ్వాసం, ముఖ్యంగా రిస్క్ మేనేజ్ మెంట్ పద్దతులకు సంబంధించి ప్రతికూలంగా మారింది. ఇండస్ ఇండ్ బ్యాంకు వాల్యూయేషన్ ఇప్పుడు అనేక మధ్యతరహా ప్రభుత్వ బ్యాంకులతో పోల్చదగిన స్థాయికి పడిపోయింది. గతంతో జరిగిన ఫారెక్స్ లావాదేవీల కారణంగా ఈ వ్యత్సాసాలు తలెత్తాయి. ఈ లావాదేవీలలో బ్యాంకు హెడ్డింగ్ ఖర్చులను చాలా తక్కువగా అంచనా వేసింది. ఫలితం ఖాతాలలో మూల్యాకనం తప్పుగా జరిగింది. డెరివేటివ్స్ పోర్టుపోలియోల నిర్వహణపై ఆర్బీఐ మార్గదర్శకాలను నవీకరించింది. దీంతో ఈ సమస్య ఉత్పన్నమైంది. ఈ సంక్షోభాన్ని దాటేందుకు ఇండస్ బ్యాంక్ అంతర్గత సమీక్షను ప్రారంభించింది.
ఇండస్ ఇండ్ బ్యాంకు సీఈవో సుమంత్ కథ్పాలియా పదవీ కాలాన్ని మరో మూడేళ్లకు పొడిగించాలని బోర్డు సిఫారసు చేసింది. కానీ రిజర్వ్ బ్యాంకు మాత్రం ఒక సంవత్సరం మాత్రమే పొడిగించడానికి ఆమోదించింది. దీనిపై ఆయన మాట్లాడుతూ తన నాయకత్వ నైపుణ్యాలపై ఆర్బీఐకి ఆందోళనలు ఉండవచ్చన్నారు. ఏదైనా ఆ నిర్ణయాన్ని గౌరవిస్తానని తెలిపారు. ఈ వ్యాఖ్యలు కూడా బ్యాంకు షేర్ పతనం కావడానికి కారణమైనట్టు మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. సీఈవో స్థాయి వ్యక్తే తన సామర్థ్యాలపై ఇలా వ్యాఖ్యలు చేయడంతో ఇన్వెస్టర్లలో ఆందోళన వ్యక్తమైందని అభిప్రాయపడుతున్నారు.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..