Chinese Apps: భారత్‌లో గుట్టుచప్పుడు కాకుండా విస్తరిస్తున్న చైనా యాప్స్‌.. మూలాలు తెలియకుండా జాగ్రత్త..!

Subhash Goud

Subhash Goud |

Updated on: Aug 31, 2021 | 11:23 AM

Chinese Apps: భారత్‌కు భద్రత విషయంలో ముప్పు పొంచివున్న కారణంగా కేంద్ర ప్రభుత్వం చైనాకు చెందిన పలు యాప్స్‌ను నిషేధించిన విషయం తెలిసిందే..

Chinese Apps: భారత్‌లో గుట్టుచప్పుడు కాకుండా విస్తరిస్తున్న చైనా యాప్స్‌.. మూలాలు తెలియకుండా జాగ్రత్త..!

Follow us on

Chinese Apps: భారత్‌కు భద్రత విషయంలో ముప్పు పొంచివున్న కారణంగా కేంద్ర ప్రభుత్వం చైనాకు చెందిన పలు యాప్స్‌ను నిషేధించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో డ్రాగన్‌ కంపెనీలు కొత్త మార్గాలను ఎంచుకుంటున్నాయి. వివిధ యాప్‌లకు యాజమాన్య సంస్థగా వేరే కంపెనీని ముందు పెట్టి తెర వెనుక కార్యకలాపాలు సాగిస్తున్నట్లు తెలుస్తోంది. దీంతో భారత మార్కెట్లో గుట్టుచప్పుడు కాకుండా విస్తరిస్తున్నాయి. గత సంవత్సరం నిషేధానికి గురైన ఆలీబాబా, బైట్‌డ్యాన్స్‌ వంటి కంపెనీలే ఈ యాప్‌లను వెనుక నుంచి నడిపిస్తున్నట్లు సమాచారం. ఈ కంపెనీలు తమ యాప్‌లను కొత్త సంస్థల పేర్లతో లిస్ట్‌ చేస్తున్నాయి.

అయితే ఆయా యాప్స్‌ యాజమాన్యం గురించి బయటపడకుండా చైనా మూలాల గురించి తెలియకుండా జాగ్రత్తపడుతున్నాయి. దేశీయంగా టాప్‌ 60 యాప్‌ల్లో 8 చైనాకి చెందినవి ఉన్నట్లుగా ఒక పరిశోధనలో తేలింది. వీటికి ప్రతి నెలా సగటున 21.1 కోట్ల మంది యూజర్లు ఉంటున్నారు. చైనా యాప్‌లను గతేడాది జూలైలో నిషేధించినప్పుడు ఇవే యాప్‌ల యూజర్ల సంఖ్య 9.6 కోట్లే. కానీ గడిచిన 13 నెలల్లో ఈ సంఖ్య ఏకంగా 11.5 కోట్ల మేరకు పెరిగింది. నిషేధం ఉన్నా చైనా యాప్‌లు ఎంత వేగంగా వృద్ధి చెందుతున్నాయో దీని బట్టి తెలిసిపోతోంది. చైనాతో సరిహద్దుల్లోనూ, దౌత్యపరంగాను ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో భారత ప్రభుత్వం గతేడాది చైనా యాప్‌లపై కొరడా ఝళిపించిన విషయం తెలిసిందే. కేంద్ర ప్రభుత్వం ఏకంగా 267 చైనా యాప్‌లను నిషేధించింది. టిక్‌టాక్, యూసీ బ్రౌజర్, పబ్‌జీ, హెలో, అలీఎక్స్‌ప్రెస్, లైకీ, షేర్‌ఇట్, మి కమ్యూనిటీ, వుయ్‌చాట్, బైదు సెర్చి, క్యామ్‌స్కానర్, వీబో, బిగో లైవ్‌తో పాటు షావోమీ సంస్థకు చెందిన కొన్ని యాప్‌లు వీటిలో ఉన్నాయి. దేశ ప్రజలు, వారి డేటా భద్రత కారణాల రీత్యా హోం శాఖ సిఫార్సుల మేరకు వీటిపై నిషేధం విధించినట్లు కేంద్రం అప్పట్లో వెల్లడించింది. అయితే, దాదాపు అదే తరహా యాప్‌లు కొత్త అవతారంలో నిశ్శబ్దంగా చాప కింద నీరులాగా విస్తరిస్తుండటం గమనార్హం.

ఎక్కువగా మీడియా, వినోద రంగానికి చెందినవే..

కాగా, గుట్టుచప్పుడు కాకుండా కొత్తగా పుట్టుకొస్తున్న యాప్స్‌ల్లో అధికంగా మీడియా, వినోద రంగానికి చెందినవే ఉన్నట్లు తెలుస్తోంది. 2020లో నిషేధం వేటు పడిన టిక్‌టాక్‌ (యాజమాన్య సంస్థ బైట్‌డ్యాన్స్‌), శ్నాక్‌వీడియో (క్వాయ్‌షో) వంటి సంస్థలు ఇదే విభాగంలో హవా కొనసాగించడం గమనార్హం. ఈ విభాగంలో పెద్ద సంఖ్యలో యూజర్లకు త్వరితగతిన చేరువ కావడానికి వీలుంటుంది కాబట్టి మీడియా, వినోద రంగాలనే చైనా కంపెనీలు ఎక్కువగా ఎంచుకుంటున్నాయని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. అందుకు తగినట్లుగానే వాటిలో కొన్ని యాప్‌లు కేవలం నెలల వ్యవధిలోనే లక్షల కొద్దీ యూజర్లను నమోదు చేసుకోవడం ఈ వాదనలకు ఊతమిస్తోంది.

ఇతర కంపెనీల పేర్లతో గూగుల్‌ ప్లే స్టోర్‌లో..

గూగుల్‌ ప్లే స్టోర్‌లో పలు చైనా యాప్‌లు అసలు యాజమాన్య సంస్థ పేరుతో కాకుండా వేరే కంపెనీ పేరుతో జాబిత అయి ఉంటున్నాయి. ఫలితంగా వెనుక ఉండి నడిపిస్తున్న అసలు సంస్థ ఆనవాళ్లు కనుగొనడం కష్టసాధ్యంగా మారుతోంది.

లింక్డ్‌ఇన్‌ వివరాల ప్రకారం..

చాలా సందర్భాల్లో నిషేధించిన యాప్‌ల ఉద్యోగులనే కొత్త యాప్‌లకు ఆయా కంపెనీలు మారుస్తున్నట్లు లింక్డ్‌ఇన్‌ డేటా బట్టి చూస్తే అర్థమవుతుంది. భారత ప్రభుత్వం నిషేధించిన టిక్‌టాక్‌ యాప్‌ మాజీ హెడ్‌ .. ఈ ఏడాది జూలైలో బైట్‌డ్యాన్స్‌లో మరో విభాగానికి మారినట్లుగా లింక్డ్‌ఇన్‌ వివరాలు చూపడం ఇందుకు నిదర్శనంగా చెప్పవచ్చు. మరోవైపు, భద్రత ఏజెన్సీలు ఏవైనా హెచ్చరికలు, సిఫార్సులు చేసిన తర్వాతే ఆయా యాప్‌లపై కేంద్రం చర్యలు తీసుకుంటుందని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. గతేడాది కూడా దేశభద్రత కారణాలతో హోం శాఖ సిఫార్సుల మేరకే కేంద్ర ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ శాఖ పలు యాప్‌ల నిషేధానికి ఆదేశాలిచ్చింది.

ఇవీ కూడా చదవండి:

బాదుడే.. బాదుడు.. క్రెడిట్‌ కార్డుదారులకు ఆ బ్యాంకు షాకింగ్‌ న్యూస్‌.. సెప్టెంబర్‌ 15 నుంచి కొత్త నిబంధనలు.!

SBI Offer: మీరు హోమ్‌ లోన్‌ తీసుకుంటున్నారా..? ఈ ఆఫర్‌ ఆగస్టు 31తో ముగియనుంది..!

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu