Union Budget: బడ్జెట్‌లో రైతులకు కేంద్రం అదిరిపోయే గుడ్‌న్యూస్.. కొత్తగా మరో పథకం.. ప్రతీఒక్క రైతుకు బెనిఫిట్
బడ్జెట్‌లో రైతులకు కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ అందించేందుకు సిద్దమవుతోంది. కొత్తగా ప్రధానమంత్రి కుసుమ్ యోజన 2.0 పథకాన్ని ప్రారంభించనుంది. ఈ పథకం ద్వారా రైతులకు తక్కువ ధరకే సౌర పంపులు, సౌర విద్యుత్ అందించనుంది. దీనికి భారీగా కేటాయింపులు చేయనున్నారు.

కేంద్ర బడ్జెట్‌కు సర్వం సిద్దమైంది. ఫిబ్రవరి 1న ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంట్‌లో ప్రవేశపెట్టనున్న బడ్జెట్ కోసం దేశ ప్రజలందరూ ఎదురుచూస్తున్నారు. బడ్జెట్‌లో ఎలాంటి ప్రకటనలు, నిర్ణయాలు ఉంటాయనేది ఆసక్తికరంగా మారింది. త్వరలో పశ్చిమబెంగాల్, తమిళనాడు లాంటి పలు పెద్ద రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న క్రమంలో బడ్జెట్ ఎలా ఉంటుందనేది చర్చనీయాంశంగా మారింది. ఇక కొత్త పథకాల అమలు, ట్యాక్స్ మినహాయింపులు, ఇప్పటికే ఉన్న పథకాల విస్తరణ, జీఎస్టీ తగ్గింపులపై నిర్ణయాలు ఉంటాయని అందరూ ఊహిస్తున్నారు. ఇక పలు రాష్ట్రాల్లో ఎన్నికలు రానున్న క్రమంలో రైతులకు ఉపయోగపడే విధంగా పలు కొత్త పథకాలు బడ్జెట్‌లో ఉంటాయని తెలుస్తోంది.
పీఎం కుసుమ్ 2.0
పీఎం కుసుమ్ పథకంకు సంబంధించి రెండో దశ 2.0పై బడ్జెట్‌లో ప్రకటన ఉంటుందని తెలుస్తోంది. రైతులకు దీని ద్వారా తక్కువ, సరసమైన ధరలకే స్వచ్చమైన సౌర విద్యుత్ అందనుంది. ఈ పథకాన్ని మరింత విస్తరించడంలో భాగంగా పీఎం కుసుమ్ 2.0 స్కీమ్‌ను ప్రవేశపెట్టనుంది. దీని ద్వారా గ్రామీణ ప్రాంతాలతో పాటు వ్యవసాయ రంగాలకు అత్యంత తక్కువ ధరకే సౌరశక్తిని అందించనుంది. రైతుల ఆదాయం పెంచడం, డీజిల్‌పై ఆధారపడటాన్ని తగ్గించేందుకు ఈ పథకం సహాయపడనుంది. పర్యావరణాన్ని పరిరక్షించడంలో కూడా ఇది ప్రధాన పాత్ర పోషిస్తుంది.
మార్చిలో ముగుస్తున్న పథకం
ప్రస్తుతం అమలవుతున్న పీఎం కుసుమ్ పథకం గడువు మార్చి 2026లో ముగుస్తుంది. దీంతో 2.0 పేరుతో కొత్త పథకాన్ని తీసుకొస్తుంది. దీనిపై ఆర్థికశాఖకు ఇంధన మంత్రిత్వశాఖ ప్రతిపాదనలు సమర్పించింది. రైతులు సోలార్ విద్యుత్ పొందటానికి, సౌర ప్రాజెక్టులను ప్రోత్సహించడానికి ఈ పథకం ఉపయోగపడుతుంది. ఈ బడ్జెట్‌లో ప్రవేశపెట్టనున్న ఈ పథకానికి దాదాపు రూ.50 వేల కోట్ల కేటాయింపులు చేయవచ్చని సమాచారం. మొదటి దశ పథకానికి రూ.32,400 కోట్లు కేటాయించింది. కొత్త పథకంలో సోలార్ ప్యానెల్స్ ఏర్పాటుకు రైతులకు మరిన్ని ప్రోత్సాహకాలు ఇవ్వడంతో పాటు అత్యాధునిక సాంకేతిక ఉపయోగించుకోవడంపై దృష్టి పెట్టనుంది.
రైతులకు రెండు ప్రయోజనాలు
పీఎం కుసుమ్ పథకంలో సౌర విద్యుద్‌ను ఉపయోగించుకునేందుకు బ్యాటరీ నిల్వ టెక్నాలజీని ప్రవేశపెట్టనుంది. ఇది రైతులు పగలు, రాత్రులు విద్యుత్ పొందటంతో ఉపయోగపడుతుంది. అలాగే విద్యుత్ సరఫరాను మరింత నమ్మదగినదిగా చేస్తుంది. కాగా 2019 మార్చిలో ప్రధానమంత్రి కుసుమ్ యోజన పథకం ప్రారంభించారు. రైతులకు సౌర పంపులు, సౌర విద్యుత్ అందించడంమే ఈ పథకం లక్ష్యం. జనవరి 2024లో ఈ పథకాన్ని మరింత విస్తరించారు. రైతులకు విద్యుత్, నీళ్లు రెండింటినీ ఈ పథకం అందిస్తుంది.
