Edible Oil Price: ప్రస్తుతం పెట్రోల్, డీజిల్ ధరలతో పాటు నిత్యవసర సరుకుల ధరలు మండిపోతున్నాయి. ఇక వంటల్లో ముఖ్యమైన నూనె ధరలు కూడా విపరీతంగా పెరిగిపోయాయి. రష్యా-ఉక్రెయిన్‌ల మధ్య జరుగుతున్న యుద్ధాల కారణంగా అమాంతంగా పెరిగిపోయాయి వంటనూనెధరలు. అప్పటి నుంచి కేంద్రం చర్యలు చేపట్టింది. ధరల నుంచి ఉపశమనం కలిగించేందుకు చర్యలు ముమ్మరం చేసింది. ఇక తాజాగా కేంద్రం ఆయిల్ కంపెనీలు, ఏజన్సీలతో సమావేశం నిర్వహించింది. రానున్న కాలంలో ఎడిబుల్ ఆయిల్ ధరల్లో మరింత ఉపశమనం లభించే అవకాశం ఉంది. రిటైల్ మార్కెట్‌లో ఎడిబుల్ ఆయిల్ ధరలను తగ్గించాలని ప్రభుత్వం కంపెనీలను ఆదేశించింది . ఆహార మరియు ప్రజా పంపిణీ శాఖ ఒక వారంలో ఉత్పత్తుల ధరలను తగ్గించాలని ఎడిబుల్ ఆయిల్ కంపెనీలను కోరింది. ప్రభుత్వం వివరాల ప్రకారం.. ఎడిబుల్ ఆయిల్ ధరలలో 10 నుండి 15 శాతం తగ్గింపుకు ఇంకా చోటు ఉంది.
గత నెలలోనే కంపెనీలు ఎడిబుల్ ఆయిల్ ధరలను లీటరుకు రూ.10 నుంచి 15 వరకు తగ్గించాయి. అయితే, ప్రభుత్వం ఈ తగ్గింపు సరిపోతుందని భావించలేదు. చమురు ధరలను అదుపులోకి తీసుకురావడానికి ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంటోంది. ధరల తగ్గింపు విషయంలో కేంద్ర అధికారులు బడా కంపెనీలతో బుధవారం నిర్వహించిన సమావేశంలో ఈ నిర్ణయం తీసుకుంది.
ప్రస్తుతం ఎడిబుల్ ఆయిల్స్ హోల్‌సేల్ ధరలు తగ్గుముఖం పట్టాయి. విదేశాల్లో ఎడిబుల్ ఆయిల్స్ ధరల్లో చరిత్రాత్మక పతనం చోటుచేసుకుందని పీటీఐ వర్గాలు పేర్కొన్నాయి. ఈ తగ్గుదల మధ్య, ముడి పామాయిల్, పామోలిన్ ధరలు తగ్గాయి. విదేశీ మార్కెట్లు పడిపోవడం, ప్రభుత్వం సంవత్సరానికి 2 మిలియన్ టన్నుల సోయాబీ, 2 మిలియన్ టన్నుల సన్‌ఫ్లవర్ ఆయిల్ దిగుమతి కోటాను రిఫైనింగ్ కంపెనీలకు విడుదల చేయడంతో సోయాబీన్ నూనె ధరలు కూడా పడిపోయాయి.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి