2023-24 వార్షిక బడ్దెట్ ఫిబ్రవరి 1న ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ లోక్ సభలో ప్రవేశపెట్టనున్నారు. ఇప్పటికే వివిధ వర్గాల వారితో సమావేశమై.. బడ్జెట్ కూర్పుపై చేసిన కసరత్తు ముగిసింది. ఇక బడ్జెట్ కాపీలు ముద్రణకు సిద్ధమవుతున్నాయి. ఈ నేపథ్యంలో బడ్జెట్‌కు ముందు ఆర్థిక శాఖ కార్యాలయంలో హల్వా వేడుక జరుపుకోవడం ఆనవాయితీగా వస్తోంది. ఈ హల్వా వేడుకలో మంత్రి నిర్మలా సీతారామన్ పాల్గొంటారు. కేంద్ర బడ్జెట్‌కు సన్నాహకంగా చేసే సంప్రదాయ హల్వా వేడుకను ఢిల్లీలోని ఆర్థిక శాఖ కార్యాలయంలో ఘనంగా నిర్వహిస్తుంటారు. ఈ వేడుక జనవరి 26న నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా నిర్మలా సీతారామన్ హల్వా కలిపి ముద్రణా పనుల్లో పాల్గొనే ఉద్యోగులందరికీ అందిస్తారు. బడ్జె్‌ట్‌కు ముందు నోరు తీపి చేసుకోవడం ఆనాది నుంచి వస్తున్న సాంప్రదాయం.
ఇదిలా ఉంటే ఏటా బడ్జెట్‌కు ముందు సంప్రదాయం ప్రకారం కేంద్ర ఆర్థిక శాఖ కార్యాలయంలో హల్వా వేడుక నిర్వహిస్తారు. దీని వెనుక ఉన్న కారణం చూస్తే ప్రతి ఏటా బడ్జెట్ ప్రతులకు సంబంధించిన ముద్రణ వ్యవహరాన్ని కేంద్ర ఆర్థిక శాఖ అత్యంత గోప్యంగా ఉంచుతుంది. బడ్జెట్ ప్రతుల ముద్రణలో పాల్గొనే సిబ్బంది మొత్తం, ముద్రణ పూర్తి అయి, పార్లమెంటులో బడ్జెట్ ప్రవేశ పెట్టే వరకూ వారంతా ఆర్థిక శాఖ కార్యాలయంలోని నార్త్ బ్లాక్ లోనే ఉంటారు. ఆ సమయంలో వారు ఇంటికి కూడా వెళ్లారు. వారు బయటి ప్రపంచంతో సంప్రదించేందుకు ఫోన్ కూడా అందుబాటులో ఉండదు. అయితే ముద్రణ పనిలో ఆర్థిక శాఖ సిబ్బంది నిమగ్నం కావడానికి ముందు వారికి తీపి తినిపించాలనే ఉద్దేశంతో హల్వా చేయడం ఆచారంగా వస్తోంది. హల్వాను భారతీయ ప్రత్యేక వంటకంగా పరిగణిస్తారు. అందుకే హల్వా తయారీతో బడ్జెట్ ప్రతుల ముద్రణ ప్రారంభిస్తారు.
అయితే గతేడాది కోవిడ్ కారణంగా హల్వా వేడుక జరగలేదు కానీ ఈ ఏడాది జనవరి 26న అంటే గురువారం హల్వా వేడుకను నిర్వహించనున్నారు. ఇది మాత్రమే కాదు జనవరి 26 నుండి ఫిబ్రవరి 1 వరకు బడ్జెట్‌కు సంబంధించిన అధికారులందరూ ఆర్థిక మంత్రిత్వ శాఖలోనే ఉంటారు. బడ్జెట్ ప్రవేశపెట్టే రోజు ఉదయం 11 గంటలకు ఆర్థికమంత్రి పార్లమెంటుకు బడ్జెట్‌ను సమర్పిస్తారు. సభలో ప్రవేశపెట్టేముందు రాష్ట్రపతి, ప్రధానమంత్రికి బడ్జెట్ గురించి పూర్తిగా వివరిస్తారు.
లాక్-ఇన్ పీరియడ్ ప్రారంభమైన తర్వాత బయటి వ్యక్తి ఆర్థిక మంత్రిత్వ శాఖలోకి ప్రవేశించలేరు. మొబైల్ నెట్‌వర్క్ పనిచేయదు. ఇంటర్నెట్ వాడకంపై నిషేధం ఉంది. ల్యాండ్‌లైన్ ద్వారా మాత్రమే మాట్లాడేందుకు సాధ్యమవుతుంది. బడ్జెట్ పత్రాలు లీక్ కాకుండా చర్యలు చేపడుతుంటారు. బడ్జెట్ పత్రం ఉన్న కంప్యూటర్‌లు ఇంటర్నెట్, ఎన్‌ఐసీ సర్వర్‌ల నుండి వేరు చేస్తారు. ఇవి కంప్యూటర్లు, ప్రింటర్లు, ప్రింటింగ్ మెషీన్లకు మాత్రమే అనుసంధానించబడి ఉంటాయి.
పరీక్ష పేపర్లే కాదు.. బడ్జెట్ పేపర్లు కూడా లీకైన సంఘటన 1950లో చోటుచేసుకుంది. అప్పట్లో బడ్జెట్ పత్రాల్ని రాష్ట్రపతి భవన్‌లో ముద్రించేవారు. 1950లో ఈ పత్రాలు లీక్ కావడంతో అప్పటి నుంచి మింట్‌రోడ్‌లోని సెక్యూరిటీ ప్రెస్‌కు వేదికను మార్చారు. 1980 నుంచి ఢిల్లీలోని నార్త్ బ్లాక్‌లో బడ్జెట్ పత్రాల్ని ముద్రిస్తున్నారు. ఇందుకోసం ప్రత్యేకంగా ప్రింటింగ్ ప్రెస్‌ను ఏర్పాటు చేశారు.
ముద్రణ విభాగంలో పనిచేసే సిబ్బంది ఎవరైనా అత్యవసరంగా బయటకు వెళ్లాల్సిన పరిస్థితి వస్తే.. సదరు వ్యక్తి వెంట ఓ ఇంటెలిజెన్స్ అధికారి, ఓ పోలీసు ఉంటారు. వారు అనుక్షణం ఆయనను నీడలా అనుసరిస్తారు. అత్యవసరం అయితే తప్పా బయటకు ఎవ్వరిని పంపించరు. సిబ్బందిపై ఇంటెలిజెన్స్ అధికారులు ప్రత్యేక నిఘా ఉంచుతారు
మరిన్ని బడ్జెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి