
ఫిక్స్‌డ్ డిపాజిట్ (FD)లను చాలా మంది సురక్షితమైన పెట్టుబడిగా భావిస్తారు. ఒకసారి డబ్బు పెట్టి, మెచ్యూరిటీ అయ్యే వరకు అలాగే ఉంచితే స్థిరమైన వడ్డీ వస్తుందని నమ్ముతారు. కానీ అనూహ్య పరిస్థితులు వచ్చినప్పుడు చాలామంది మధ్యలోనే FDలను బ్రేక్ చేయాల్సి వస్తోంది. వైద్య ఖర్చులు, ఇంటి మరమ్మత్తులు, పిల్లల చదువు, లేదా ఆకస్మిక నగదు అవసరాల కారణంగా ముందస్తు ఉపసంహరణలు పెరుగుతున్నాయి. అయితే FDని మెచ్యూరిటీకి ముందే రద్దు చేస్తే బ్యాంకులు ఎలా వడ్డీ కోత విధిస్తాయో చాలామందికి పూర్తిగా తెలియదు.
సాధారణంగా చాలా మంది భావించేది ఏమిటంటే బ్యాంకు ఒక చిన్న జరిమానా మాత్రమే తీసుకుని మిగతా మొత్తం తిరిగి ఇస్తుందని. కానీ వాస్తవానికి పరిస్థితి భిన్నంగా ఉంటుంది. బ్యాంకులు ముందుగా అసలు వడ్డీ లెక్కింపునే మార్చేస్తాయి. ఉదాహరణకు, ఐదేళ్ల కాలపరిమితితో FD పెట్టి, ఒక సంవత్సరం తర్వాత డబ్బు తీసుకుంటే, ఐదేళ్ల వడ్డీ రేటు వర్తించదు. బదులుగా, ఒక సంవత్సరం FDకు అప్పట్లో ఉన్న వడ్డీ రేటును మాత్రమే వర్తింపజేస్తారు. దానిపై అదనంగా 0.5 శాతం నుంచి 1 శాతం వరకు జరిమానా కూడా విధించవచ్చు. దీంతో తుది రాబడి గణనీయంగా తగ్గిపోతుంది.
వివిధ బ్యాంకుల్లో ఈ నియమాలు వేర్వేరుగా ఉంటాయి. కొన్ని బ్యాంకులు చిన్న మొత్తాల రిటైల్ FDలపై తక్కువ జరిమానాలు విధిస్తే, మరికొన్ని ప్రత్యేక పెనాల్టీ ఫ్రీ FDలను అందిస్తున్నాయి. అయితే అలాంటి FDలపై ప్రారంభ వడ్డీ రేట్లు తక్కువగా ఉండే అవకాశం ఉంది. కొందరు పెట్టుబడిదారులు ఈ సమస్యను తగ్గించేందుకు ఒక పెద్ద FD బదులుగా చిన్న చిన్న FDలను ఏర్పాటు చేస్తున్నారు. అవసరమైనప్పుడు ఒక్క FD మాత్రమే బ్రేక్ చేయాల్సి రావడం వల్ల నష్టాన్ని తగ్గించుకోవచ్చు. నిపుణుల అభిప్రాయం ప్రకారం అత్యవసర నిధులను పూర్తిగా దీర్ఘకాలిక FDల్లో పెట్టడం కంటే, కొంత మొత్తాన్ని సేవింగ్స్ అకౌంట్లు లేదా స్వీప్-ఇన్ సదుపాయాల్లో ఉంచడం మంచిది. ఎందుకంటే FDను బ్రేక్ చేయడం ఎప్పుడూ తప్పు నిర్ణయం కాకపోయినా, భవిష్యత్తు నగదు అవసరాలను ముందుగానే అంచనా వేసుకుని పెట్టుబడులు ప్లాన్ చేసుకోవడం అత్యంత కీలకం.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి