AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఎమర్జెన్సీ ఫండ్‌ ఎలా క్రియేట్‌ చేసుకోవాలి? స్మార్ట్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ ప్లాన్‌!

అత్యవసర నిధి ప్రతి కుటుంబానికి ఆర్థిక భద్రత కల్పించే ముఖ్యమైన రక్షణగా మారుతోంది. ఉద్యోగం కోల్పోవడం, వైద్య ఖర్చులు లేదా ఆకస్మిక ఆర్థిక సమస్యలు వచ్చినప్పుడు ఈ నిధి ఉపయోగపడుతుంది. అయితే ఆ డబ్బును ఎక్కడ ఉంచాలి అనే విషయంలో చాలామంది గందరగోళానికి గురవుతున్నారు.

ఎమర్జెన్సీ ఫండ్‌ ఎలా క్రియేట్‌ చేసుకోవాలి? స్మార్ట్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ ప్లాన్‌!
Emergency Fund
SN Pasha
|

Updated on: May 22, 2026 | 8:31 PM

Share

అత్యవసర పరిస్థితులు ఎప్పుడు వస్తాయో ఎవరికీ ముందుగా తెలియదు. ఉద్యోగం కోల్పోవడం, ఆకస్మిక వైద్య ఖర్చులు, కుటుంబ అవసరాలు లేదా ఆదాయం తాత్కాలికంగా తగ్గిపోవడం వంటి పరిస్థితుల్లో ఆర్థికంగా నిలబడేందుకు అత్యవసర నిధి కీలక పాత్ర పోషిస్తుంది. అయితే చాలామంది ఈ నిధిని ఎక్కడ ఉంచాలి అనే విషయంలో సరైన అవగాహన లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కొందరు మొత్తం డబ్బును సేవింగ్స్ ఖాతాలో ఉంచుతుంటే, మరికొందరు దీర్ఘకాలిక ఫిక్స్‌డ్ డిపాజిట్లలో పెట్టి అవసరమైన సమయంలో వెంటనే నగదు పొందలేక ఇబ్బంది పడుతున్నారు.

ఆర్థిక నిపుణుల అభిప్రాయం ప్రకారం అత్యవసర నిధి విషయంలో ప్రధానంగా మూడు అంశాలు ముఖ్యం. అవి భద్రత, లిక్విడిటీ, స్థిరత్వం. అంటే డబ్బు సురక్షితంగా ఉండాలి, అవసరమైన సమయంలో వెంటనే అందుబాటులోకి రావాలి, అలాగే కొంతమేర రాబడిని కూడా ఇవ్వాలి. అందుకే మొత్తం నిధిని ఒకేచోట ఉంచడం కంటే, వివిధ మార్గాల్లో విభజించడం మంచిదని సూచిస్తున్నారు. సాధారణ సేవింగ్స్ ఖాతా అత్యవసర పరిస్థితుల్లో వెంటనే డబ్బు తీసుకునేందుకు ఉపయోగపడుతుంది. అయితే దీర్ఘకాలంగా పెద్ద మొత్తాన్ని అక్కడే ఉంచితే తక్కువ వడ్డీ కారణంగా ద్రవ్యోల్బణ ప్రభావం పడుతుంది. ఈ కారణంగా ప్రస్తుతం చాలా మంది స్వీప్-ఇన్ ఖాతాల వైపు మొగ్గు చూపుతున్నారు.

ఈ విధానంలో ఖాతాలో ఒక నిర్దిష్ట మొత్తానికి మించిన డబ్బు ఆటోమేటిక్‌గా ఫిక్స్‌డ్ డిపాజిట్ తరహా పథకాల్లోకి మారుతుంది. అవసరమైనప్పుడు తిరిగి సులభంగా ఉపయోగించుకోవచ్చు. ఇక కొంతమంది తమ అత్యవసర నిధిని చిన్న చిన్న స్వల్పకాలిక ఫిక్స్‌డ్ డిపాజిట్లుగా విభజిస్తున్నారు. దీనివల్ల మొత్తం డిపాజిట్‌ను బ్రేక్ చేయకుండా అవసరమైనంత మొత్తాన్ని మాత్రమే ఉపయోగించుకోవచ్చు.

మార్కెట్‌పై కొంత అవగాహన ఉన్నవారు లిక్విడ్ మ్యూచువల్ ఫండ్లను కూడా ఎంచుకుంటున్నారు. ఇవి తక్కువ రిస్క్‌తో స్వల్పకాలిక రుణ సాధనాల్లో పెట్టుబడి పెడతాయి. అత్యవసర నిధిని సాధారణ ఖర్చుల కోసం ఉపయోగించకుండా వేరుగా ఉంచుకోవాలని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ నిధి కేవలం డబ్బు భద్రత మాత్రమే కాదు, అనూహ్య పరిస్థితుల్లో మానసిక ధైర్యాన్ని కూడా ఇస్తుందని వారు చెబుతున్నారు.

మరిన్ని బిజినెస్‌ వార్తల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి

Follow Us