PF Withdrawal: పీఎఫ్ అకౌంట్ నుంచి ఎలాంటి సమయాల్లో ఎంత విత్‌డ్రా చేసుకోవచ్చు?
చాలా మంది ఉద్యోగులు ఇల్లు కొనుగోలు చేయడానికో.. లేదా కొత్త ఇంటి నిర్మాణం కోసమే, లేక విదేశాలకు చదువు నిమిత్తం వెళ్లేందుకు, ఇతర ఆర్థికపరమైన..

చాలా మంది ఉద్యోగులు ఇల్లు కొనుగోలు చేయడానికో.. లేదా కొత్త ఇంటి నిర్మాణం కోసమే, లేక విదేశాలకు చదువు నిమిత్తం వెళ్లేందుకు, ఇతర ఆర్థికపరమైన విషయాలలో ఇబ్బందులు పడుతుంటారు. సమయానికి బ్యాంకుల నుంచి రుణాలు అందక తికమక పడుతుంటారు. అలాంటి సమయంలో ఉద్యోగులు వారి పీఎఫ్ అకౌంట్ నుంచి డబ్బులను ఉపసంహరించుకునేందుకు అవకాశం ఉంటుంది. పీఎఫ్‌కు సంబంధించిన నిబంధనలు తెలియక ఇబ్బంది పడుతుంటారు. మీరు ఉద్యోగం చేస్తున్నట్లయితే అప్పుడు మీ మంత్లీ సాలరీ నుంచి పీఎఫ్ కట్ అవుతుంటుంది. భవిష్యత్తు భద్రత కోసం చేసే ఈ పొదుపు కష్ట సమయాల్లో కూడా ఉపయోగపడుతుంది. కరోనా వైరస్ మహమ్మారి గుర్తుందా? మహమ్మారి తర్వాత పీఎఫ్ గురించి మొత్తం ఆలోచనలు మారిపోయాయి.
ప్రతి ఒక్కరిలో అవగాహన ఏర్పడింది. మహమ్మారి ప్రజల పొదుపులపై తీవ్ర ప్రభావం చూపింది. ఇది మహమ్మారి సమయంలో ఉపయోగపడిన పీఎఫ్ ఖాతాలలో జమ చేసిన డబ్బు. ప్రభుత్వం కొత్త విత్‌డ్రా రూల్స్ కూడా తీసుకొచ్చింది. ఇప్పుడు మీరు పీఎఫ్ డబ్బును ఎప్పుడు విత్‌డ్రా చేసుకోవచ్చు అనే దానిపై అనేక పరిస్థితులు పరిగణలోకి తీసుకోవచ్చని గుర్తించుకోవాలి. ఉపసంహరణ పరిమితి వివిధ పరిస్థితులకు భిన్నంగా ఉంటుంది.
పీఎఫ్ నుంచి ఎప్పుడు ఎంత డబ్బు విత్‌డ్రా చేయవచ్చో తెలుసుకుందాం?
హోమ్ లోన్ రీపేమెంట్ కోసం ఈపీఎఫ్ ఖాతా 10 సంవత్సరాలు నిర్వహించాల్సి ఉంటుంది. అయితే గృహ రుణాల చెల్లింపు కోసం పీఎఫ్ బ్యాలెన్స్‌లో 90% వరకు విత్‌డ్రా చేసుకునేందుకు అనుమతి ఉంటుంది. అదే పిల్లల ఉన్నత విద్య కోసం ఉద్యోగి 7 సంవత్సరాలు పూర్తయితే అందులో నుంచి 50% వరకు విత్‌డ్రా చేసుకునేందుకు అనుమతి ఉంటుంది. చందాదారుల మొత్తం సేవా వ్యవధిలో మూడు సార్లు విత్‌డ్రా చేసుకునేందుకు అవకాశం ఉంటుందని గమనించాలి. వివాహం కోసం అయితే వ్యక్తి 7 సంవత్సరాల సేవను పూర్తి చేసినట్లయితే ఉద్యోగి వివాహం లేదా తన పిల్లలు, సోదరి వివాహం కోసం 50 శాతం వరకు విత్‌డ్రాకు అనుమతి ఉంటుంది. ఒక వేళ ఉద్యోగం కోల్పోతే పీఎఫ్ ఖాతాలో జమ చేసిన మొత్తం మొత్తాన్ని విత్‌డ్రా చేసుకోవచ్చు.




ఇక మొత్తం ఒకేసారి డబ్బులు అందవు. ఒక వ్యక్తి ఒక నెలపాటు నిరుద్యోగిగా ఉంటే అతను పీఎఫ్ బ్యాలెన్స్‌లో 75% వరకు విత్‌డ్రా చేసుకోవచ్చు. అతను రెండు నెలలు నిరుద్యోగిగా ఉంటే అతను మిగిలిన 25% కూడా విత్‌డ్రా చేసుకోవచ్చు. ఉద్యోగానికి రాజీనామా చేసిన తర్వాత కూడా ఈ సౌకర్యం అందుబాటులో ఉంటుంది. వ్యక్తి ఉద్యోగం చేసి ఆరు నెలల కంటే తక్కువ ఉంటే అప్పుడు, పీఎఫ్ డబ్బును మాత్రమే విత్‌డ్రా చేసుకోవచ్చు. ఉద్యోగి పెన్షన్ ఖాతాలో జమ చేసిన మొత్తం తిరిగి విత్‌డ్రా చేసుకోలేరు.
మీరు మీ స్వంత ఇంటిని నిర్మించుకోవాలనుకుంటే లేదా ప్లాట్ కొనాలనుకుంటే మీరు ఇంటి కోసం ప్లాట్ కొనడానికి నెలవారీ జీతం కంటే 24 రెట్లు వరకు విత్‌డ్రా చేసుకోవచ్చు. ఇల్లు కొనడానికి నిర్మించడానికి మీరు 36 సార్లు విత్‌డ్రా చేసుకోవచ్చు. మరమ్మతు పనులకు అయ్యే ఖర్చుల కోసం నెలవారీ జీతం 12 రెట్లు వరకు విత్‌డ్రా చేసుకోవచ్చు. ఇందులో ఓ కండిషన్ ఉంది. అందేంటంటే ఐదేళ్ల సర్వీస్ పూర్తయిన తర్వాత ఈ సదుపాయం ఉంటుంది.
మీరు ఉద్యోగానికి రాజీనామా చేసిన వెంటనే పీఎఫ్ విత్‌డ్రా చేసుకునేందుకు ప్రభుత్వం రెండు ఆప్షన్లను ఇచ్చింది. మొదటిది ఒక మహిళా ఉద్యోగి వివాహం తర్వాత మరొక నగరానికి మారినట్లయితే ఆమె మొత్తాన్ని విత్‌డ్రా చేసుకోవచ్చు. అదేవిధంగా శాశ్వతంగా విదేశాలకు వెళుతున్నట్లయితే వెంటనే రాజీనామా చేసి పీఎఫ్ విత్ డ్రా చేసుకోవచ్చు. మీరు ఎప్పుడైనా మీ పీఎఫ్ ఖాతా నుంచి డబ్బును విత్‌డ్రా చేసుకునే సందర్భాలు మరికొన్ని ఉన్నాయి. ఉదాహరణకు మీకు తీవ్రమైన అనారోగ్యం, శాశ్వత వైకల్యం, చికిత్స కోసం ఎప్పుడైనా డబ్బును విత్‌డ్రా చేసుకోవచ్చు. అటువంటి సందర్భాలలో ఉద్యోగం వ్యవధి పరిగణలోకి తీసుకోరు. ప్రకృతి వైపరీత్యాలు, శారీరక వైకల్యం సంభవించినప్పుడు పరికరాలను కొనుగోలు చేయడానికి పీఎఫ్ ఉపసంహరణ కోసం కనీస వ్యవధి అంటూ ఏమి ఉండదు.
పదవీ విరమణకు ముందు:
పదవీ విరమణకు రెండేళ్ల ముందు 90 శాతం మొత్తాన్ని పీఎఫ్ ఖాతా నుంచి విత్‌డ్రా చేసుకోవచ్చు. దీనికి ప్రత్యేకంగా కారణం చెప్పాల్సిన అవసరం లేదు. ఈపీఎఫ్‌ఓ నిబంధనల ప్రకారం.. పదవీ విరమణ వయస్సు 58 సంవత్సరాలు. దీని తర్వాత మీరు మీ సౌలభ్యం ప్రకారం ఎప్పుడైనా డబ్బును విత్‌డ్రా చేసుకోవచ్చు.
మీరు మీ పీఎఫ్ అకౌంట్ నుంచి డబ్బును ఎలా ఉపసంహరించుకోవచ్చు..?
మీరు ఆన్‌లైన్, ఆఫ్‌లైన్ పద్ధతుల ద్వారా మీ పీఎఫ్ అకౌంట్ నుంచి డబ్బు విత్‌డ్రా కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. దీన్ని చేయడానికి మీ యూఏఎన్, ఆధార్‌ను లింక్ చేయాలి. డబ్బును ఉపసంహరించుకోవడానికి యజమాని నుంచి అనుమతి పొందవలసిన అవసరం లేదు. మీరు పీఎఫ్ అడ్వాన్స్ క్లెయిమ్ ఫారమ్‌ను పూరించి అందించాలి. అలాగే విత్‌డ్రా కారణాన్ని తెలియజేయాలి. ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకుంటే ఏడు రోజుల్లోగా డబ్బులు అందుతాయి. అలాగే ఆఫ్‌లైన్‌లో దరఖాస్తు చేస్తే రెండు వారాల సమయం పట్టవచ్చు. అయినప్పటికీ మీ పీఎఫ్ ఖాతా నుంచి డబ్బును ఉపసంహరించుకోవడానికి అనేక ఆప్షన్స్ ఉన్నాయి. ప్రతి ఒక్క అవసరానికి డబ్బు విత్ డ్రా చేసుకోవాలని కాదు. పీఎఫ్ అనేది పదవీ విరమణ ప్రణాళిక. మీరు పదవీ విరమణకు ముందు ఏదైనా ముఖ్యమైన పనుల విషయంలో మాత్రమే మీరు డబ్బును విత్‌డ్రా చేసుకోవచ్చు. ఉదాహరణకు ఇంటి నిర్మాణాన్ని పూర్తి చేయాల్సి వచ్చింది. ఎందుకంటే నిర్మాణ పనులు సగం వరకైనా పూర్తి కాలేదు. ఇలాంటి సమయంలో ఆర్థిక పరిస్థితల దృష్ట్యా విత్‌డ్రా చేసుకోవచ్చు.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి