Gift tax rules: దీపావళికి బహుమతులు తీసుకుంటున్నారా.. పన్ను బాదుడు తప్పదంతే..!

|

Oct 27, 2024 | 7:15 PM

భారతీయ సంప్రదాయంలో పండుగలకు అత్యంత ప్రాధాన్యం ఉంది. ప్రతి ఒక్కరూ తమ కుటుంబ సభ్యులు, బంధువులు, స్నేహితులతో కలిసి సంతోషంగా సంబరాలు చేసుకుంటారు. అలాగే ఇంటికి వచ్చిన అతిథులకు బహుమతులు ఇవ్వడం కూడా చాలా ముఖ్యం. తమ ఆర్థిక పరిస్థితికి అనుగుణంగా అందరూ వీటిని అందజేస్తుంటారు.

Gift tax rules: దీపావళికి బహుమతులు తీసుకుంటున్నారా.. పన్ను బాదుడు తప్పదంతే..!
Diwali Gift Ideas
Follow us on

వెలుగుల పండగ దీపావళి త్వరలో వచ్చేస్తోంది. ఈ సందర్భంగా ఇంటికి వచ్చే స్నేహితులు, బంధువులకు బహుమతులు ఇవ్వడానికి అందరూ బిజీగా షాపింగ్ చేస్తున్నారు. అయితే ఈ బహుమతుల విలువ నిర్ణీత పరిధి దాటితే ఆదాయపు పన్ను విధిస్తారు. బహుమతుల పన్ను నిబంధనలు, మినహాయింపులను ఇప్పుడు తెలుసుకుందాం. మన దేశంలో 1958లో బహుమతుల పన్ను చట్టం అమల్లోకి వచ్చింది. దాని కింద పన్నులను వసూలు చేసేవారు. అయితే 1998లో ఆ చట్టాన్ని ప్రభుత్వం రద్దు చేసింది. కానీ ఆదాయపు పన్ను చట్టం ప్రకారం బహుమతులకు సంబంధించిన పన్ను విధింపులపై 2004లో కొన్ని నిబంధనలను అమలు చేశారు. వీటి ప్రకారం ఒక వ్యక్తి లేదా హిందూ అభిభాజ్య కుటుంబం (హెచ్యూఎఫ్) నిర్ణీత విలువను మించిన బహుమతులు పొందితే పన్ను విధిస్తారు.

ఆదాయపు పన్నుచట్టంలోని 56(2)(ఎక్స్) సెక్షన్ ప్రకారం బహుమతులపై నిబంధనల మేరకు పన్ను విధిస్తారు. దీపావళితో పాటు అన్నిపండగలకు అందుకున్న వాటితో సహా అన్ని రకాల బహుమతులు దీని కిందకు వస్తాయి. బహుమతి విలువ రూ.50 వేల కంటే ఎక్కువగా ఉన్నప్పుడు పన్ను విధిస్తారు. నగదు, చెక్కులు, బ్యాంకు ద్వారా బదిలీలు, నగలు, షేర్లు, సెక్యూరిటీలు, బులియన్, కళాఖండాలు, భూమి, భవనాలు, స్థిరాస్తి తదితర వాటిపై పన్నును విధిస్తారు. బహుమతుల విలువ రూ.50 వేలు దాటినప్పటికీ కొన్ని ప్రత్యేక సమయంలో పన్ను నుంచి మినహాయింపులు లభిస్తాయి. ముఖ్యంగా బంధువుల నుంచి స్వీకరించిన వాటికి ఈ మినహాయింపు వర్తిస్తుంది. జీవిత భాగస్వామి, తోబుట్టువులు, తల్లిదండ్రులు, తాతలు, పిల్లలు, జీవిత భాగస్వామి తోబుట్టువులు, వారి తల్లిదండ్రులు ఇచ్చిన బహుమతులకు మినహాయింపు ఉంటుంది. ఆదాయపు పన్నుచట్టం ప్రకారం పైన తెలిపిన వారందరూ బంధువులుగా పరిగణిాంచబడతారు.

వివాహం సందర్భంగా స్వీకరించే కానుకలకు పన్ను నుంచి మినహాయింపు లభిస్తుంది. ఇది కేవలం పెళ్లికి మాత్రమే వర్తిస్తుంది. పుట్టిన రోజు, పెళ్లి వార్షికోత్సవం, పండగల సమయంలో ఇచ్చిన బహుమతులకు పన్ను కట్టాల్సిందే. వారసత్వం, వీలునామా ద్వారా వచ్చిన ఆస్తి, డబ్బును పన్ను నుంచి మినహాయిస్తారు. తరతరాలుగా పూర్వీకుల నుంచి వచ్చిన ఆస్తి దీనిలో ఉంటుంది. స్వచ్ఛంద సంస్థలు, ట్రస్టులకు ఇచ్చిన బహుమతులకు పన్ను విధించరు. పైగా దాతలకు ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ 80జీ కింద పన్ను మినహాయింపు ఉంటుంది. దీపావళి సందర్భంగా యజమాని తన ఉద్యోగులకు బోనస్ లు, వోచర్లు, గాడ్జెట్ లను బహుమతులుగా ఇస్తూ ఉంటారు. వీటిపై వివిధ రకాలుగా పన్ను విధిస్తారు. ఉద్యోగికి నగదు రూపంలో ఇస్తే, దానిపై జీతంలో భాగంగా పన్ను విధిస్తారు. నగదు రహిత బహుమతుల విలువ రూ.5 వేలు దాటితే పన్ను కట్టాలి.

ఇవి కూడా చదవండి

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి