ఇంటి నిర్మాణానికి సూపర్‌వుడ్.. ఈ చెక్క ఉక్కు కంటే బలమైంది.. పాడయ్యే ప్రసక్తే లేదు..!
నిర్మాణ పరిశ్రమలో విప్లవాత్మక మార్పులు తీసుకురాగల కొత్త ఆవిష్కరణ ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా తీవ్ర చర్చానీయాంశంగా మారింది. అమెరికన్ శాస్త్రవేత్తలు 'సూపర్‌వుడ్' అనే ప్రత్యేక కలపను అభివృద్ధి చేశారు. ఇది ఉక్కు కంటే 10 రెట్లు బలంగా ఉంటుంది. ఇది నిర్మాణ విధానాన్ని మార్చే సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది.

నిర్మాణ పరిశ్రమలో విప్లవాత్మక మార్పులు తీసుకురాగల కొత్త ఆవిష్కరణ ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా తీవ్ర చర్చానీయాంశంగా మారింది. అమెరికన్ శాస్త్రవేత్తలు ‘సూపర్‌వుడ్’ అనే ప్రత్యేక కలపను అభివృద్ధి చేశారు. ఇది ఉక్కు కంటే 10 రెట్లు బలంగా ఉంటుంది. ఇది నిర్మాణ విధానాన్ని మార్చే సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది. ఈ ‘సూపర్‌వుడ్’ తేలికైనది. పర్యావరణ అనుకూలమైనది. ప్రొఫెసర్ లియాంగ్‌బింగ్ హు దశాబ్దాల పరిశోధన ఫలితంగా ఇది ఇప్పుడు వాణిజ్య ఉపయోగం కోసం అందుబాటులోకి వచ్చింది.
సూపర్‌వుడ్ అంటే ఏమిటి?
సూపర్‌వుడ్ అనేది సాంప్రదాయ కలప కంటే బలంగా, మన్నికగా ఉండటానికి ప్రత్యేకంగా తయారు చేసిన కలప. శాస్త్రవేత్త లియాంగ్‌బింగ్ హు, అతని బృందం రసాయన ప్రక్రియల ద్వారా కలపలోని సహజ సెల్యులోజ్‌ను బలోపేతం చేశారు. ఆ రసాన్ని ఒక నిర్దిష్ట రసాయన ద్రావణంలో మరిగించి, వేడి ఒత్తిడికి గురిచేస్తారు. ఇది కలప సెల్యులోజ్ నిర్మాణాన్ని గట్టిపరుస్తుంది. దాని సాంద్రతను పెంచుతుంది. ఈ ప్రక్రియ పూర్తి కావడానికి దాదాపు ఒక వారం పడుతుంది. నేచర్ జర్నల్‌లో ప్రచురితమైన 2017 అధ్యయనం ప్రకారం దాని బలం-బరువు నిష్పత్తి చాలా లోహాల కంటే ఎక్కువగా ఉంది.
ఇన్వెంట్‌వుడ్ అనే కంపెనీ సూపర్‌వుడ్ ను వాణిజ్య ఉత్పత్తిగా ప్రారంభించింది. కంపెనీ CEO అలెక్స్ లావు ప్రకారం, ఇది సాధారణ కలపలా కనిపిస్తుంది. కానీ నాణ్యతలో అద్భుతమైనది. దీని తక్కువ బరువు భవనాలను నాలుగు రెట్లు తేలికగా చేయగలదని చెప్పారు. ఇది భూకంప నిరోధకతను పెంచుతుంది. పునాదిపై భారాన్ని తగ్గిస్తుందని వివరించారు. అంతేకాదు.. ఈ కలపతో ఇంటి నిర్మాణం చాలా వేగంగా, సులభంగా పూర్తి చేసుకోవచ్చునని చెబుతున్నారు.
సూపర్‌వుడ్ ప్రస్తుతం సాధారణ కలప కంటే ఖరీదైనది. అయితే, దీని ప్రధాన ఉద్దేశ్యం ఉక్కుకు ప్రత్యామ్నాయంగా ఉండటమే. ఇది ఉక్కు ఉత్పత్తి కంటే 90శాతం తక్కువ కార్బన్ ఉద్గారాలను కలిగి ఉంది. సూపర్‌వుడ్‌తో శిలీంధ్రాలు, కీటకాల బెడద ఉండదు. ఫైర్ సెఫ్టీగా కూడా పనిచేస్తుంది. ఎందుకంటే.. ఈ కలప అగ్ని నిరోధకంగా ఉంటుంది. ఈ ప్రయోగం 19 వేర్వేరు చెట్ల జాతులపై, వెదురుపై ప్రయత్నించగా విజయవంతమైందని చెబుతున్నారు. ఈ కలపతో భవిష్యత్తును నిర్మించే దిశగా కొత్త అడుగు పడిందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.
సిడ్నీలోని న్యూ సౌత్ వేల్స్ విశ్వవిద్యాలయంలో ఆర్కిటెక్చర్ ప్రొఫెసర్ అయిన ఫిలిప్ ఓల్డ్‌ఫీల్డ్ ప్రకారం, కలప వంటి నిర్మాణ వస్తువులు పర్యావరణానికి మంచివి. కలప కార్బన్‌ను నిల్వ చేస్తుంది. సూపర్‌వుడ్ వంటి వినూత్న ఉత్పత్తులు భవన నిర్మాణ పరిశ్రమలో కలప వినియోగాన్ని పెంచడంలో సహాయపడతాయి. అయితే, ఈ కొత్త సాంకేతికతను స్వీకరించడానికి పరిశ్రమకు మరిన్ని విద్య, నియంత్రణ సంస్కరణలు అవసరం అంటున్నారు.
మొత్తంమీద సూపర్‌వుడ్ భవన నిర్మాణ భవిష్యత్తులో ఆశావాద మార్పులను తీసుకురాగలదు. సూపర్‌వుడ్ అనేది నిర్మాణ రంగానికి కొత్త దిశానిర్దేశం చేసే విప్లవాత్మక ఆవిష్కరణ అంటున్నారు. ఉక్కు కంటే బలమైనది, తేలికైనది. పర్యావరణ అనుకూలమైనది. ఇది భవిష్యత్ భవనాలను సురక్షితంగా, మరింత స్థిరంగా, ఖర్చును తగ్గించేదిగా ఉంటుంది. ఇది కేవలం చెక్క మాత్రమే కాదు, భవిష్యత్ నిర్మాణ కలలకు కొత్త పునాది.
మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..








