షూ కంపెనీ.. ఇప్పుడు AI కంపెనీగా..! ఆల్‌బర్డ్స్ సంచలన ప్రకటన
ప్రముఖ షూ బ్రాండ్ ఆల్‌బర్డ్స్, ఊహించని విధంగా AI రంగంలోకి ప్రవేశిస్తూ 'న్యూబర్డ్ AI'గా రీబ్రాండ్ అవుతున్నట్లు ప్రకటించింది. ఈ వార్తతో షేరు ధర 600% పెరిగింది. ఒకప్పుడు 4 బిలియన్ డాలర్ల విలువైన ఈ సంస్థ, ఆర్థిక సవాళ్ళ నేపథ్యంలో AI ఆధారిత క్లౌడ్ సేవలు, GPU-as-a-Serviceపై దృష్టి పెడుతోంది.

అమెరికాకు చెందిన ప్రముఖ షూ బ్రాండ్ ఆల్‌బర్డ్స్ ఆకస్మికంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగంలోకి ప్రవేశిస్తున్నట్లు ప్రకటించడం మార్కెట్లలో తీవ్ర చర్చకు దారితీసింది. స్నీకర్ల తయారీలో పేరుగాంచిన ఈ సంస్థ, ఇప్పుడు తన వ్యాపార దిశను పూర్తిగా మార్చుకుంటూ AI ఆధారిత మౌలిక సదుపాయాల అభివృద్ధిపై దృష్టి పెట్టనున్నట్లు తెలిపింది. ఈ ప్రకటన వెలువడిన కొద్ది గంటల్లోనే కంపెనీ షేరు ధర మధ్యాహ్నం ట్రేడింగ్‌లో దాదాపు 600 శాతం ఎగబాకడం, ప్రస్తుతం మార్కెట్లలో ఏఐపై ఉన్న ఉత్సాహాన్ని స్పష్టంగా ప్రతిబింబిస్తోంది.
కంపెనీ వెల్లడించిన వివరాల ప్రకారం తాము సుమారు 50 మిలియన్ డాలర్ల నిధులను సమీకరించి న్యూబర్డ్ AI పేరుతో రీబ్రాండింగ్ చేసుకునే యోచనలో ఉన్నారు. ఈ క్రమంలో GPU-as-a-Service ప్లాట్‌ఫామ్ అభివృద్ధి, అలాగే AI ఆధారిత క్లౌడ్ సేవల అందించడంపై దృష్టి సారించనున్నారు. వేగంగా విస్తరిస్తున్న ఏఐ వినియోగం కారణంగా అధిక పనితీరు గల కంప్యూటింగ్ మౌలిక సదుపాయాలకు డిమాండ్ పెరుగుతుండగా, ఆ అవసరాన్ని తీర్చడమే తమ లక్ష్యమని సంస్థ పేర్కొంది. ఈ నేపథ్యంలో క్లౌడ్ కంప్యూటింగ్ రంగంలో కూడా అడుగుపెట్టాలని భావిస్తోంది.
అయితే ఈ నిర్ణయం వెనుక సంస్థ ఎదుర్కొన్న ఆర్థిక సవాళ్లు కూడా కీలకంగా కనిపిస్తున్నాయి. ఒకప్పుడు సుమారు 4 బిలియన్ డాలర్ల మార్కెట్ విలువను అందుకున్న ఈ కంపెనీ, ఇటీవల కేవలం 39 మిలియన్ డాలర్లకు అమ్ముడవడానికి ఒప్పుకోవడం దాని పతనాన్ని తెలియజేస్తోంది. ఆ సమయంలో ఏఐ రంగంలోకి ప్రవేశించే ప్రస్తావన లేకపోవడం గమనార్హం. పర్యావరణ హిత ఉత్పత్తులతో గుర్తింపు పొందిన ఈ సంస్థ, ఇప్పుడు తన పాత వ్యూహాల నుండి పూర్తిగా వైదొలుగుతున్నట్లు సంకేతాలు ఇస్తోంది.
మార్కెట్లు ఈ ప్రకటనకు అత్యంత ఉత్సాహంగా స్పందించినప్పటికీ, విశ్లేషకులు జాగ్రత్త అవసరమని సూచిస్తున్నారు. ఏఐ, డేటా సెంటర్, GPU సరఫరా వంటి కీలక రంగాల్లో సంస్థకు అనుభవం లేకపోవడం, భవిష్యత్తులో సవాళ్లకు దారితీసే అవకాశం ఉంది. ఒక పాదరక్షల సంస్థ హఠాత్తుగా టెక్నాలజీ రంగంలోకి మారడం అరుదైన పరిణామం కాగా, దీర్ఘకాలంలో ఈ వ్యూహం ఎంతవరకు ఫలిస్తుందో చూడాల్సి ఉంది.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
