ఆధార్ కార్డ్‌లో పేరు మార్చడం ఇప్పుడంతా ఈజీ కాదు! రూల్స్ మారిపోయాయి.. నేమ్ అప్డేట్ చేయాలంటే?
UIDAI ఆధార్ కార్డు పేరు మార్పు నిబంధనలను కఠినతరం చేసింది. పూర్తి పేరు లేదా ఇంటిపేరు మార్పునకు కేవలం అఫిడవిట్ కాకుండా, గెజిట్ నోటిఫికేషన్ తప్పనిసరి. చిన్న స్పెల్లింగ్ తప్పులకు అవసరం లేదు. మోసాలను నిరోధించడానికి ఈ నూతన నియమాలు అమలులోకి వచ్చాయి.

ఆధార్ కార్డ్‌లో పేరు, అడ్రస్ లేదా ఏదైనా అప్డేట్ చేయాలంటే.. చాలా మంది అదెంత సేపు చిటికెలో అయిపోతుందని అనుకుంటారు. అనేక ఆధార్ కార్డుల్లో తప్పులు దొర్లడంతో ప్రభుత్వం చాలా సులువుగా కార్డ్‌ను అప్డేట్ చేసేందుకు అనేక అవకాశాలు ఇచ్చింది. కానీ ఇకపై ఆధార్ కార్డులో పేరు మార్చుకోవడం అంత ఈజీ కాదు. భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ (UIDAI) రూల్స్‌ను కఠినతరం చేసింది. ఇప్పుడు పేరు మార్పుకు కేవలం అఫిడవిట్ సరిపోదు. దీని కోసం మీరు గెజిట్ నోటిఫికేషన్, సుదీర్ఘ ప్రక్రియ అవసరం అవుతుంది.
గతంలో స్థానిక కౌన్సిలర్ నుండి ఒక లేఖ లేదా నోటరీ చేయబడిన సాధారణ అఫిడవిట్ సరిపోయేది, ఇప్పుడు మీరు మీ పేరులో మార్పులు చేస్తుంటే (మీ పూర్తి పేరును మార్చడం లేదా ఇంటిపేరును జోడించడం/తొలగించడం వంటివి), UIDAIకి కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన గెజిట్ నోటిఫికేషన్ అవసరం కావచ్చు. గుర్తింపు మోసాన్ని నిరోధించడానికి, పత్రాల ప్రామాణికతను నిర్ధారించడానికి ఈ కఠినమైన నియమాలు రూపొందించారు.
అయితే మీ పేరులో స్వల్ప స్పెల్లింగ్ దిద్దుబాటు మాత్రమే ఉంటే, మీకు గెజిట్ అవసరం ఉండకపోవచ్చు. మీరు మీ పేరును పూర్తిగా మారుస్తుంటే, లేదా వివాహం తర్వాత మీ ఇంటిపేరును మారుస్తుంటే, మీ వద్ద ఎటువంటి దృఢమైన రుజువు లేకపోతే, గెజిట్ నోటిఫికేషన్ అవసరం. ఈ ప్రక్రియలో మీరు మొదట ఒక అఫిడవిట్ సిద్ధం చేయాలి. తరువాత, మీరు మీ పేరు మార్పును రెండు వార్తాపత్రికలలో (ఒకటి ఆంగ్లంలో, మరొకటి స్థానిక భాషలో) ప్రకటించాలి. చివరగా ఈ అన్ని పత్రాలు, ఫొటోలు, దరఖాస్తును భారత ప్రభుత్వ ప్రచురణ విభాగానికి పంపాలి. మీ కొత్త పేరు అధికారిక గెజిట్‌లో ప్రచురించబడిన తర్వాత అది చట్టబద్ధంగా చెల్లుబాటు అవుతుంది.
కొన్నిసార్లు గెజిట్ నోటిఫికేషన్ ఉన్నప్పటికీ సిస్టమ్ అప్డేట్‌ను అంగీకరించడంలో విఫలమవుతుంది. అటువంటి పరిస్థితిలో మీరు నేరుగా UIDAI హెల్ప్‌లైన్ నంబర్ 1947 కు కాల్ చేయవచ్చు లేదా help@uidai.net.in కు ఇమెయిల్ చేయవచ్చు. గెజిట్ నోటిఫికేషన్ అనేది ఏ ప్రభుత్వ శాఖ కూడా విస్మరించలేని శక్తివంతమైన ఆయుధం.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
