UPI Scam: వెలుగులోకి నయా యూపీఐ స్కామ్.. హోటల్స్ వారే అసలు టార్గెట్
ఇటీవల కాలంలో భారతదేశంలో ఆన్‌లైన్ చెల్లింపులు పెరిగాయి. ముఖ్యంగా 2016లో నోట్ల రద్దు తర్వాత ఎన్‌పీసీఐ అందుబాటులోకి తీసుకొచ్చిన యూపీఐ సేవల ద్వారా చెల్లింపులు చేసే వారి సంఖ్య పెరిగింది. అయితే మంచి ఉన్న చోటే చెడు ఉంటుందన్న చందాన యూపీఐ ఆధారంగా చేసే మోసాల సంఖ్య కూడా పెరిగింది. తాజాగా హోటల్స్ రెస్టారెంట్ల వారిని టార్గెట్ చేస్తూ మోసగించే నయా స్కామ్ వెలుగులోకి వచ్చింది. ఈ యూపీఐ స్కామ్ గురించి మరిన్ని వివరాలను తెలుసుకుందాం.
యూపీఐ పేమెంట్ సిస్టమ్స్ ద్వారా రెస్టారెంట్లను టార్గెట్ చేస్తూ జరుగుతున్న స్కామ్ గురించి మంగళూరుకు చెందిన ఓ హెూటల్ వ్యాపారి సోషల్ మీడియాలో తన అనుభవాన్ని పంచుకున్నారు. తమ బిల్లు కంటే ఎక్కువ సొమ్ము పంపినట్టు చెప్పి తమ సొమ్మును రీఫండ్ చేయమని కోరతారు. సొమ్మును మళ్లీ యూపీఐ ద్వారానే రీఫండ్ చేయాలని మోసపూరిత క్యూఆర్ కోడ్స్‌ను పంపుతున్నారని ఆయన హెచ్చరించారు. మంగళూరు వ్యాపారి ఈ మోసం బారిన పడకుండా తృటిలో తప్పించుకున్నాడు. రద్దీ ఎక్కువగా ఉన్న సమయంలో హిందీ మాట్లాడే వ్యక్తి నుంచి కాల్ వచ్చిందని, అతను మొదట నూడుల్స్ అడిగాడు. కానీ మెనూలో అది లేదని నేను అతనికి తెలియజేయడంతో అతను ఐదు బిర్యానీలు ఆర్డర్ చేశాడు. అలాగే వాటర్ బాటిల్స్‌తో కలిపి అతని బిల్లు రూ. 1,760 అయ్యిందని చెప్పాను కాల్ చేసిన వ్యక్తి యూపీఐ ద్వారా తన సొమ్మున చెల్లిస్తానని చెప్పాడు. తన స్నేహితులు వచ్చి ఆర్డర్ తీసుకుంటారని స్పష్టం చేశాడు.
కొద్దిసేపటి తర్వాత అతను రూ. 1 బదిలీ చేసి నాకు అది వచ్చిందో లేదో ధృవీకరించమని అడిగాడు. నేను నా మెసేజ్ ను చెక్ చేసినప్పుడు, నా ఖాతాలో రూ. 1 జమ అయినట్లు నోటిఫికేషన్ వచ్చింది. అయితే ఈ లావాదేవీతోనే ఆ వ్యాపారికి అనుమానం వచ్చింది. లావాదేవీ సందేశంలో నా ఫోన్ నంబర్ కనిపించదని, కానీ అతను పంపిన స్క్రీన్ షాట్‌లో నెంబర్ కనిపించడంతో అలెర్ట్ అయ్యాడు. ఆ వ్యక్తి తర్వాత మళ్లీ ఫోన్ చేసి పొరపాటున రూ.11,760 ట్రాన్స్ ఫర్ చేశానని, అది రూ.10వేలు అదనపు చెల్లింపు అని పేర్కొన్నాడు. నేను నా సందేశాలను తనిఖీ చేసినప్పుడు, నా ఖాతాలో రూ. 11,760 జమ అయినట్లు నోటిఫికేషనన్ కనిపించిందని వ్యాపారి చెప్పారు.
ఆ వ్యక్తి రూ. 10,000 వాపసు చేయమని అడిగి, తన వాట్సాప్ నంబర్‌కు యూపీఐ క్యూార్ కోడ్‌ను పంపుతానని చెప్పాడు. దీంతో అనుమానం వచ్చిన వ్యాపారి బ్యాంకు ఖాతాకు లాగిన్ అయ్యి లావాదేవీ వివరాలను పరిశీలించగా 11,760కు సంబంధించిన లావాదేవీ ఏదీ కనిపించలేదు. దీంతో ఇదేదో పెద్ద స్కామ్ అని గ్రహించిన వ్యాపారి వెంటనే ఆ ఫోన్‌ను కట్ చేశాడు. తిరిగి ఆ నెంబర్‌కు కాల్ చేయాలని ప్రయత్నించగా నాట్ రీచబుల్ అని వచ్చింది. అయితే యూపీఐ చెల్లింపుల సమయంలో ఇలాంటి మోసాలు విస్తృతంగా జరుగుతున్నాయని డేటా సెక్యూరిటీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (డీఎస్‌సీ) సీనియర్ డైరెక్టర్ కె.వెంకటేష్ మూర్తి పేర్కొన్నారు. బ్యాంకుల లావాదేవీలకు సంబంధించిన వివరాలు ఎప్పటికప్పుడు వినియోగదారులకు అందిస్తే ఇలాంటి మోసాలను అరికట్టవచ్చని చెబుతున్నారు.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..