Money Management:ఈ 7 డబ్బు సూత్రాలు పాటిస్తే.. లక్ష్మీదేవి మీ ఇంట పరుగులు పెడుతుంది..
డబ్బు సంపాదించడం ఎంత ముఖ్యమో, దాన్ని తెలివిగా నిర్వహించుకోవడం కూడా అంతే అవసరం. ఆర్థిక క్రమశిక్షణ లేకపోతే ఎంత సంపాదించినా ప్రయోజనం ఉండదు. వ్యక్తిగత ఆర్థిక నిర్వహణ చాలామందికి సంక్లిష్టంగా అనిపించినా, కొన్ని సరళమైన సూత్రాలను పాటిస్తే ఎవరైనా ఆర్థికంగా స్థిరపడగలరు. జీవితంలో ఆర్థిక భద్రతను సాధించడానికి, సంపదను పెంపొందించడానికి ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సిన ఏడు స్వర్ణ నియమాలు ఇప్పుడు చూద్దాం.

ఆర్థిక స్థిరత్వం అనేది స్థిరమైన జీవనానికి ఆధారం. అయితే, చాలామందికి డబ్బులను మేనేజ్ చేయడం ఒక సవాలుగా అనిపిస్తుంది. వచ్చిన జీతాన్ని ఎలా ఖర్చు పెట్టాలో తెలియక.. తెలిసేలోపే అవి ఖర్చయిపోయి ఇబ్బుందులు పడుతుంటారు. ఈ సమస్యను సులభతరం చేసేందుకు, మెరుగైన డబ్బు నిర్వహణ, దీర్ఘకాలిక ఆర్థిక భద్రతకు మార్గనిర్దేశం చేసే ఏడు గోల్డెన్ నియమాలు ఇక్కడ ఉన్నాయి.
1. మొదటి ప్రయారిటీ మీరే..
ఏ ఇతర ఖర్చులకైనా ముందు, మీ ఆదాయంలో కనీసం 20 శాతం పొదుపు లేదా పెట్టుబడుల కోసం పక్కన పెట్టండి. దీనిని ఆటోమేట్ చేయండి. మీ జీతం రాగానే, మీ బ్యాంక్ ఖాతా నుండి పొదుపు లేదా పెట్టుబడి ఖాతాకు ఆటోమేటిక్ గా బదిలీ అయ్యేలా సెట్ చేయండి. ఇది మీ ఆర్థిక లక్ష్యాలకు ప్రాధాన్యత ఇస్తుంది, పొదుపును సులభతరం చేస్తుంది.
2. 50:30:20 నియమం పాటించండి..
ఈ బడ్జెట్ నియమం మీ డబ్బును కాపాడుకునే స్పష్టమైన మార్గాన్ని ఇస్తుంది. మీ ఆదాయంలో 50 శాతం అవసరాలకు (అద్దె, బిల్లులు, నిత్యావసరాలు), 30 శాతం కోరికలకు (బయట తినడం, వినోదం, హాబీలు), 20 శాతం పొదుపు, అప్పుల చెల్లింపులకు కేటాయించండి. ఈ మార్గదర్శకం ఆర్థిక క్రమశిక్షణ పాటించడానికి సహాయపడుతుంది.
3. అత్యవసర నిధిని ఏర్పాటు చేయండి
జీవితంలో ఊహించని సంఘటనలు ఎదురవుతాయి. ఉద్యోగం పోవడం లేదా ఆరోగ్య అత్యవసరాల వంటి వాటిని ఎదుర్కోవడానికి, అత్యవసర నిధిని ఏర్పాటు చేయడం చాలా ముఖ్యం. 6-9 నెలల ఖర్చులకు సరిపడా డబ్బును లిక్విడ్ ఫండ్ లేదా సేవింగ్స్ ఖాతాలో ఉంచుకోండి. ఈ నిధి ఆర్థిక భద్రతను అందిస్తుంది.
4. అప్పులకు దూరంగా ఉండండి
అధిక వడ్డీ రుణాలతో పాటు, క్రెడిట్ కార్డ్ బకాయిలు మీ ఆర్థిక స్థితిని దెబ్బతీస్తాయి. క్రెడిట్ కార్డ్ బిల్లులను ప్రతి నెలా పూర్తిగా చెల్లించండి. అలాగే, భవిష్యత్తులో విలువ పెరగని వాటి కోసం లేదా జీవనశైలి ఖర్చుల కోసం అప్పులు చేయకుండా ఉండటం తెలివైన పని.
5. ముందుగానే పెట్టుబడి ప్రారంభించండి
కంపౌండింగ్ శక్తి వల్ల మీరు ఎంత త్వరగా పెట్టుబడి పెడితే, మీ డబ్బు అంత ఎక్కువగా పెరుగుతుంది. నెలకు కేవలం రూ. 500 SIP (సిస్టమాటిక్ ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్) తో ప్రారంభించినా, దశాబ్దాల తర్వాత అది గణనీయమైన మొత్తంగా మారవచ్చు. పెట్టుబడిలో సమయం మీ అతిపెద్ద ఆస్తి, కాబట్టి ఆలస్యం చేయకండి.
6. బీమాతో రక్షణ కల్పించండి
ఆరోగ్యం, టర్మ్ లైఫ్ బీమా మీ కుటుంబానికి, మీరు కూడబెట్టిన సంపదకు రక్షణ కవచం. ఆరోగ్య బీమా వైద్య అత్యవసర ఖర్చులను కవర్ చేస్తుంది. టర్మ్ లైఫ్ బీమా మీకు ఏదైనా జరిగితే మీ కుటుంబానికి ఆర్థిక భద్రతను ఇస్తుంది. బీమా తీసుకోవడాన్ని ఆలస్యం చేయకండి, వయస్సు పెరిగే కొద్దీ ప్రీమియం పెరుగుతుంది.
7. క్రమం తప్పకుండా రివ్యూ చేయండి
మీ ఆర్థిక పరిస్థితి, లక్ష్యాలు, జీవిత పరిస్థితులు కాలక్రమేణా మారుతాయి. సంవత్సరానికి కనీసం ఒకసారి మీ ఆర్థిక విషయాలను సమీక్షించడం చాలా ముఖ్యం. మీ పెట్టుబడులు మీ లక్ష్యాలకు అనుగుణంగా ఉన్నాయో లేదో తనిఖీ చేయండి. అవసరమైతే మీ పొదుపును, పోర్ట్‌ఫోలియోను సర్దుబాటు చేయండి. ఇది మీ ఆర్థిక ప్రణాళికను సరికొత్తగా ఉంచుతుంది.




