2026: న్యూ ఇయర్‌లో మొబైల్ యూజర్లకు భారీ షాక్ తప్పదా? అసలు టెలికామ్ సంస్థలు ఏం ప్లాన్ చేస్తున్నాయి?
2026లో మొబైల్ రీఛార్జ్ ప్లాన్‌లు దేశవ్యాప్తంగా 20 శాతం వరకు పెరగనున్నాయి. జియో, ఎయిర్‌టెల్, వొడాఫోన్ ఐడియా తమ ARPU పెంచుకోవడానికి ధరలు పెంచే అవకాశం ఉందని మోర్గాన్ స్టాన్లీ నివేదించింది. ఇది సాధారణ వినియోగదారులపై, ముఖ్యంగా 5G వినియోగదారులపై ఆర్థిక భారం మోపుతుంది.

రాబోయే కొత్త సంవత్సరంలో దేశవ్యాప్తంగా మొబైల్ వినియోగదారులకు గట్టి షాక్ ఖాయంగా కనిపిస్తోంది. ఎందుకంటే 2026లో మొబైల్ రీఛార్జ్ ప్లాన్‌లు మరోసారి ఖరీదైనవి కావచ్చు. నివేదికల ప్రకారం.. రిలయన్స్ జియో, ఎయిర్‌టెల్, వొడాఫోన్ ఐడియా తమ ప్రీపెయిడ్, పోస్ట్‌పెయిడ్ ప్లాన్‌ల ధరలను 20 శాతం వరకు పెంచవచ్చు. ఎంపిక చేసిన అనేక ప్లాన్‌లలో టారిఫ్ పెంపు గురించి సమాచారాన్ని కంపెనీ అధికారులకు సమర్పించారు. టెలికాం కంపెనీలు గత నెల రోజులుగా తమ ప్లాన్‌లను సవరిస్తున్నాయి. ఇది సాధారణ వినియోగదారులను నేరుగా ప్రభావితం చేస్తుంది. ముఖ్యంగా 5G వినియోగదారులపై ఎక్కువ భారం పడనుంది.
పరిశోధనా సంస్థ మోర్గాన్ స్టాన్లీ నివేదిక ప్రకారం.. భారతీయ టెలికాం కంపెనీలు 2026 లో తమ రేట్లను 16 నుండి 20 శాతం పెంచవచ్చు. కంపెనీల సగటు వినియోగదారు ఆదాయం (ARPU) పెంచడమే దీని లక్ష్యం. చివరి రేటు పెంపు జూలై 2024లో ధరలు పెంచాయి. మళ్లీ ఇప్పుడు అలాంటి సీన్ రిపీట్ కానుంది. అంటే రెండు సంవత్సరాల తర్వాత ధరలు మళ్ళీ భారీగా పెరగనున్నాయి.
ఎయిర్‌టెల్ 28-రోజుల అన్‌లిమిటెడ్ 5G ప్లాన్ రూ.319 నుండి రూ.419కి పెరగవచ్చు. అదే సమయంలో 1.5GB రోజువారీ డేటాతో Jio రూ.299 ప్లాన్ రూ.359 కి చేరుకోవచ్చు. అంతేకాకుండా రూ.349 28-రోజుల 5G ప్లాన్ రూ.429 కి పెరగవచ్చు. దీని అర్థం వినియోగదారులు నెలకు రూ.80 నుండి 100 వరకు ఎక్కువ ఖర్చు చేయాల్సి రావచ్చు. Vi 28 రోజుల 1GB రోజువారీ డేటా ప్లాన్ రూ.340 నుండి రూ.419కి పెరగవచ్చు. 56 రోజుల చెల్లుబాటుతో 2GB రోజువారీ డేటా ప్లాన్ రూ.579 నుండి రూ.699కి పెరగవచ్చు.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి




