Parliament Budget Session : ఇవాళ్టి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు.. రాష్ట్రపతి ప్రసంగానికి విపక్ష పార్టీలు గైర్హాజరు..!
పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ఇవాళ్టి నుంచి ప్రారంభం కానున్నాయి. కరోనా నిబంధనలు పాటిస్తూ... గత పార్లమెంట్ సమావేశాల తరహాలోనే ఈసారి కూడా సభలను నిర్వహిస్తున్నారు. ఉదయం రాజ్యసభ, సాయంత్రం లోక్‌సభ

Parliament Budget Session : పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ఇవాళ్టి నుంచి ప్రారంభం కానున్నాయి. కరోనా నిబంధనలు పాటిస్తూ… గత పార్లమెంట్ సమావేశాల తరహాలోనే ఈసారి కూడా సభలను నిర్వహిస్తున్నారు. ఉదయం రాజ్యసభ, సాయంత్రం లోక్‌సభ సమావేశాలు జరుగుతాయి. ఉభయసభలను ఉద్దేశించి రాష్ట్రపతి చేసే ప్రసంగానికి విపక్ష పార్టీలు గైర్హాజరు కానున్నాయి. ఇలాంటి సమయంలో నూతన వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలన్న విపక్షాల డిమాండ్‌తో.. సమావేశాలు సజావుగా సాగుతాయా లేదా అన్నది ప్రశ్నార్థకంగా మారింది. ఇప్పటికే జారీ చేసిన వివిధ ఆర్డినెన్స్‌లను చట్టాలుగా మార్చేందుకు.. సంబంధిత బిల్లులను ఇరు సభల ముందుకు తీసుకురానుంది కేంద్రం.
ఉభయసభలను ఉద్దేశించి రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ చేసే ప్రసంగంతో బడ్జెట్ సమావేశాలు ప్రారంభమవుతాయి. ఇదే రోజున ఆర్థిక సర్వేను సభ ముందు ఉంచనుంది. అయితే, సాగుచట్టాలపై పోరాటం చేస్తున్న అన్నదాతలకు సంఘీభావంగా రాష్ట్రపతి ప్రసంగాన్ని బహిష్కరిస్తున్నట్టు 16 విపక్ష పార్టీలు ప్రకటించాయి. గణతంత్ర దినోత్సవం రోజు జరిగిన హింసాకాండపై విచారణ జరిపించాలని డిమాండ్ చేశాయి.
ఇదిలావుంటే.. బహిష్కరణపై పునరాలోచించుకోవాలని విపక్షాలను కేంద్రం కోరింది. రాష్ట్రపతి ప్రసంగాన్ని బహిష్కరించడం మంచి పరిణామం కాదని తెలిపింది. సమావేశాల తొలి భాగంలో బిల్లులు తీసుకురావట్లేదని ప్రభుత్వం వెల్లడించింది. బడ్జెట్ ప్రవేశపెట్టిన వెంటనే ధన్యవాదాల తీర్మానంపై చర్చ ఉంటుందని వెల్లడించింది. బడ్జెట్ సమావేశాల్లో 4 ఆర్డినెన్స్‌లను ఆమోదించేందుకు సిద్ధమైంది.
పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలను రెండు భాగాలుగా కేంద్రం విభజించింది. శుక్రవారం మొదలయ్యే సమావేశాలు వచ్చే నెల 15తో ముగుస్తాయి. అనంతరం పార్లమెంట్ మార్చి 8న తిరిగి సమావేశం కానుంది. కరోనా కారణంగా ఈ ఏడాది పేపర్ లెస్ బడ్జెట్‌ను ప్రవేశ పెట్టాలని కేంద్రం నిర్ణయించింది. దీంతో సభ ముందుకు బడ్జెట్ ప్రతులు, ఆర్థిక సర్వే డాక్యుమెంట్లు వచ్చిన అనంతరం.. వాటిని ఆన్లైన్లో అందుబాటులో ఉంచనున్నారు.