కుప్పలు తెప్పలుగా పాములు.. అంగన్‌వాడీ సెంటర్‌లో బయటపడ్డ 40 పాము పిల్లలు, రెండు తేళ్లు
మహబూబాబాద్ జిల్లాలో కుప్పలు తెప్పలుగా పాములు కనిపించి కలకలం సృష్టించాయి. అంగన్‌వాడీ కేంద్రంలో సోమవారం సుమారు 30 పాము పిల్లలు, రెండు తేళ్లు బయటపడ్డాయి.
Snake babies and scorpions: ఒక్క పామును చూస్తూనే ఎవరికైనా ప్రాణ భయం అలాంటిది ఒక్కసారిగి కుప్పలు తెప్పలుగా తాచు పాము పిల్లలు బయటపడి అటూ ఇటూ తిరుగుతుంటే ఇంకేమైనా ఉందా..! ప్రాణాలు గాలిలోకి వెళ్లాల్సిందే.. తాజాగా ఈ ఘటన మహబూబాబాద్ జిల్లాలో కుప్పలు తెప్పలుగా పాములు కనిపించి కలకలం సృష్టించాయి. నెల్లికుదురు మండలం బ్రాహ్మణకొత్తపల్లిలో గ్రామంలోని ఒకటో అంగన్‌వాడీ కేంద్రంలో సోమవారం సుమారు 30 పాము పిల్లలు, రెండు తేళ్లు బయటపడ్డాయి. దీంతో గ్రామంలో పాముల కలకలం రేగింది.
బ్రాహ్మణకొత్తపల్లిలోని అంగన్‌వాడీ సెంటర్ కార్యకర్త శ్రీజ్యోతి, ఆయా లచ్చమ్మ.. చిన్నారులతో పాటు గర్భిణులకు సరకులు పంచేందుకు భవనం తెరవగా రెండు, మూడు పాము పిల్లలు కనిపించడంతో స్థానికులకు సమాచారం ఇచ్చారు. అక్కడికి చేరుకున్న స్నేక్ క్యాచర్లు బండలను తొలగించడంతో పెద్ద సంఖ్యలో పాము పిల్లలు బయటపడ్డాయి. ప్రతిరోజు పిల్లలు కూర్చునే గదిలో బండల కింద 40పాము పిల్లలు ప్రత్యక్షమయ్యాయి. అంతేకాదు రెండు తేళ్లు కూడా బయటపడ్డాయి. దీంతో వాటిని స్థానికులు చంపివేశారు. సమయానికి ఆ గదిలో పిల్లలు లేకపోవడంతో పెద్ద పెను ముప్పు తప్పింది. దీంతో అంతా ఉపిరి పీల్చుకున్నారు.
ఇదిలావుంటే, అంగన్‌వాడీ కేంద్ర భవనం శిథిలావస్థకు చేరుకుందని.. నూతన భవనానికి నిధులు మంజూరు చేయాలని గ్రామస్థులు డిమాండ్ చేస్తున్నారు. పాత కాలం భవనాల్లో పాఠశాలను కొనసాగించడం వల్ల పిల్లల ప్రాణాలతో చెలగాటమాడటమేనని స్థానికులు అంటున్నారు.