నా అవసరం ఉందంటే తప్పుకుండా తిరిగొస్తా: రాజన్
దేశానికి తన అవసరం ఉందంటే తప్పకుండా తిరిగొస్తానని ఆర్బీఐ మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్ తెలిపారు. తన పని విషయంలో ప్రస్తుతం సంతోషంగా ఉన్నప్పటికీ తన అవసరం ఉన్నచోట పనిచేయడం గొప్ప అవకాశంగా భావిస్తానని ఆయన వ్యాఖ్యానించారు. ఓ ఆంగ్లమీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో రాజన్ పలు వ్యాఖ్యలు చేశారు. రానున్న ఎన్నికల్లో మహాకూటమి అధికారంలోకి వస్తే రాజన్ ఆర్థిక మంత్రిగా బాధ్యతలు స్వీకరించే అవకాశం ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. దీనిపై రాజన్‌ను ప్రశ్నించగా ‘‘ఈ విషయంపై ఇప్పుడే […]
దేశానికి తన అవసరం ఉందంటే తప్పకుండా తిరిగొస్తానని ఆర్బీఐ మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్ తెలిపారు. తన పని విషయంలో ప్రస్తుతం సంతోషంగా ఉన్నప్పటికీ తన అవసరం ఉన్నచోట పనిచేయడం గొప్ప అవకాశంగా భావిస్తానని ఆయన వ్యాఖ్యానించారు. ఓ ఆంగ్లమీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో రాజన్ పలు వ్యాఖ్యలు చేశారు. రానున్న ఎన్నికల్లో మహాకూటమి అధికారంలోకి వస్తే రాజన్ ఆర్థిక మంత్రిగా బాధ్యతలు స్వీకరించే అవకాశం ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. దీనిపై రాజన్‌ను ప్రశ్నించగా ‘‘ఈ విషయంపై ఇప్పుడే స్పందించడం తొందరపాటు అవుతుంది’’ అని అన్నారు.
ఈసారి ఎన్నికలు భారత్‌కు చాలా కీలకమని.. దేశంలో నూతన సంస్కరణలు తీసుకురావాల్సిన అవసరం ఉందని రాజన్ వ్యాఖ్యానించారు. నూతన సంస్కరణల కోసం తనకు సలహాలు అందించే అవకాశం వస్తే సంతోషిస్తానని చెప్పారు. ఆర్థికమంత్రిగా పనిచేసే అవకాశం వస్తే.. దేశ ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టగలిగే స్వల్పకాల లక్ష్యాలపై దృష్టి సారిస్తానని రాజన్ పేర్కొన్నారు. అలాగే బ్యాంకింగ్ రంగంలోనూ పలు మార్పులు తీసుకువస్తానని ఆయన చెప్పారు.
రైతాంగ సంక్షోభాన్ని తగ్గించేలా పటిష్ఠ వ్యవసాయ విధానాలను అమలు చేయాల్సిన అవసరం ఉందని.. భూసేకరణ పద్ధతిలోనూ రాష్ట్రాలు అవలంబిస్తున్న మెరుగైన విధానాన్ని ఎంచుకోవాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు. ఈ విషయంలో రాష్ట్రాలకు అవసరమైన మేర స్వతంత్రం ఇవ్వాలని రాజన్ అభిప్రాయపడ్డారు. ఇవే తన ప్రధాన అంశాలని రాజన్ వివరించారు.
ఇక భారత ఆర్థిక వ్యవస్థ ఏడు శాతం వృద్ధితో పరుగులు తీస్తోందని ప్రభుత్వం ప్రకటించడంపై రాజన్ అనుమానాలు వ్యక్తం చేశారు. ఉద్యోగాల సృష్టి మందగించిన నేపథ్యంలో అంతటి వృద్ధి ఎలా సాధ్యమవుతుందని ఆయన ప్రశ్నించారు. ప్రస్తుత జీడీపీ గణాంకాలపై ఉన్న అనుమానాలను తొలగించాల్సిన అవసరం ఉందని.. అందుకోసం ఒక నిష్పాక్షిక వ్యవస్థ ఏర్పాటు చేయాలని రాజన్ అభిప్రాయపడ్డారు. కాగా 2013 సెప్టెంబరు నుంచి సెప్టెంబరు 2016 మధ్య ఆర్బీఐ గవర్నర్‌గా విధులు నిర్వహించిన రాజన్.. అంతర్జాతీయ ద్రవ్య నిధి (ఐఎంఎఫ్) ముఖ్య ఆర్థికవేత్తగా కూడా వ్యవహరించిన విషయం తెలిసిందే.