AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

కొత్త ఆంక్షలతో లాక్‌డౌన్.. మార్పులపై నేడే ప్రకటన

లాక్ డౌన్ పొడిగించాలని నిర్ణయించిన కేంద్ర ప్రభుత్వం కొత్త మార్గదర్శకాలు, ఆంక్షలతో వచ్చే రెండు వారాలు దేశాన్ని నడిపించాలని భావిస్తోంది. ముఖ్యంగా దేశాన్ని మూడు జోన్లుగా విభజించి లాక్ డౌన్ అమలు పరచాలన్నది కేంద్ర ప్రభుత్వ వ్యూహంగా కనిపిస్తోంది. అదే సమయంలో రెండు వారాల లాక్ డౌన్‌తోపాటు వచ్చే 3,4 వారాలు అత్యంత కీలకమని ప్రధాని భావిస్తున్నారు.

కొత్త ఆంక్షలతో లాక్‌డౌన్.. మార్పులపై నేడే ప్రకటన
Rajesh Sharma
|

Updated on: Apr 12, 2020 | 8:48 AM

Share

లాక్ డౌన్‌ని ఏప్రిల్ నెలాఖరు దాకా పొడిగించాలని నిర్ణయించిన మోదీ ప్రభుత్వం సరికొత్త యాక్షన్‌తో అందుకు రంగాన్ని సిద్దం చేస్తోంది. గత 18 రోజులుగా దేశంలో లాక్ డౌన్ అమలు అవుతోంది. దాన్ని మరో రెండు వారాల పాటు పొడించాలన్న రాష్ట్రాలు, రాజకీయ పక్షాల సూచన మేరకు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ లాక్ డౌన్ పొడింగించాలని నిర్ణయించారు. అయితే ప్రస్తుతం ఉన్న విధివిధానాలతోనే లాక్ డౌన్ పొడిగించడం కంటే కొన్ని మార్పులు చేయాలని ప్రధాని భావిస్తున్నట్లు సమాచారం.

రాష్ట్రాల ఫీడ్ బ్యాక్‌తోపాటు.. వివిధ వర్గాల నుంచి వ్యక్తమైన అభిప్రాయాలను పరిగణలోకి తీసుకున్న మోదీ దేశంలో లాక్ డౌన్ అమలుకు కొన్ని కొత్త విధివిధానాలను అమల్లోకి తేవాలని భావించారు. అందుకు అనుగుణంగా కేంద్ర హోం శాఖ కొత్త మార్గదర్శకాలను సిద్దం చేస్తున్నట్లు సమాచారం.

దేశాన్ని మొత్తం మూడు జోన్లుగా విభజించి.. లాక్ డౌన్‌ని పక్కాగా అమలు చేయాలని మోదీ హోం శాఖకు సూచించారు. దానికి అనుగుణంగా రెడ్, ఎల్లో, గ్రీన్ జోన్లుగా దేశాన్ని విభజించి.. లాక్ డౌన్‌ను ఏప్రిల్ నెలాఖరుదాకా పొడిగించబోతున్నారు. రెడ్ జోన్ అంటే.. ప్రస్తుతం కంటైన్మెంట్ క్లస్టర్లుగా భావిస్తున్న ఏరియాలు. ఆ క్లస్టర్లు (జోన్లు) అత్యంత పకడ్బందీ చర్యలు చేపట్టబోతున్నారు.

ప్రజలు తమ ఇళ్ళ నుంచి బయటికి రాకుండా చూడడంతోపాటు.. వారికి కావాల్సిన నిత్యావసరాలు, పాలు, కూరగాయలు.. ఇతర పదార్థాలను వారి ఇళ్ళ వద్దకే సరఫరా జరిగేలా చూస్తారు. ప్రజా సంచారాన్ని ఏ మాత్రం అనుమతించకుండా కరోనా కట్టడికి చర్యలు తీసుకుంటారు. ఇక ఎల్లో జోెన్ అంటే.. ఎంతో కొంత కరోనా ప్రభావం వుండే అవకాశం వున్నవి. ఇలాంటి చోట్ల నిర్దిష్టమైన సమయంలో ప్రజా సంచారాన్ని అనుమతిస్తారు. కొన్ని రకాల షాపులను తెరిచేందుకు అనునమతిస్తారు. కొంత మేరకు సాధారణ జనజీవనం కొనసాగేలా చూస్తారని సమాచారం.

ఇక గ్రీన్ జోన్‌లో కరోనా ప్రభావం ఏ మాత్రం లేని గ్రామీణ ప్రాంతాలుండబోతున్నాయి. దేశంలో రబీ దిగుబడులు వస్తున్నందున ఈ సమయంలో అక్కడ లాక్ డౌన్ కొనసాగితే .. రైతాంగం తీవ్ర ఇబ్బందుల పాలవుతాయని భావిస్తూ.. గ్రామీణ ప్రాంతాలను గ్రీన్ జోన్‌లో పెట్టడం ద్వారా వ్యవసాయోత్పత్తుల క్రయ, విక్రయాలను అనుమతిస్తారు. కానీ.. భారీ ఎత్తున జనం పోగవడానికి మాత్రం అనుమతించరు.

అదే సమయంలో దేశవ్యాప్తంగా భారీ సభలు, సమావేశాలు, వివాహాలు, మత సంబంధమైన సమూహాలు ఏర్పాటు చేయడం వంటివి మాత్రం నిరవధికంగా నిషేధించాలని కేంద్రం భావిస్తున్నట్లు సమాచారం. మారిన విధివిధనాలపై కేంద్ర హోంశాఖ ఆదివారం ఒక ప్రకటన చేసే అవకాశం ఉంది. ప్రధాని కూడా జాతిని ఉద్దేశించి ప్రసంగించే అవకాశం ఉందని చెబుతున్నారు.