రసవత్తరంగా సాగర సంగ్రామం.. ఎవరికి వారు సరికొత్త లెక్కలు.. గెలుపే లక్ష్యంగా టీఆర్ఎస్

నాగార్జునసాగర్ నియోజకవర్గంలో గెలుపు లక్ష్యంగా అన్ని పార్టీల నేతలు.. ఒకరి ఎత్తులకు మరొకరు పైఎత్తులు వేస్తున్నారు.

రసవత్తరంగా సాగర సంగ్రామం.. ఎవరికి వారు సరికొత్త లెక్కలు.. గెలుపే లక్ష్యంగా టీఆర్ఎస్
Nagarjunasagar Bypoll 2021
Follow us
Balaraju Goud

|

Updated on: Mar 28, 2021 | 1:03 PM

Nagarjunasagar bypoll 2021: నాగార్జునసాగర్ ఉప ఎన్నికపై ప్రధాన రాజకీయ పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. ఇప్పటికీ ప్రధాన పార్టీల అభ్యర్థులు ఖరారు కాలేదు. ఓవైపు బీసీ, రెడ్డి కులాల్లో ఎవరికి టికెట్ ఇవ్వాలనే అంశంపై టీఆర్​ఎస్​మల్లగుల్లాలు పడుతోంది. టీఆర్ఎస్ అభ్యర్థి ప్రకటన తర్వాత తన అభ్యర్థిని ఎంపిక చేయాలని బీజేపీ భావిస్తోంది. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ తన అభ్యర్థిగా మాజీ మంత్రి జానారెడ్డి పేరును ప్రకటించింది. ఆయన గత మూడు నెలలుగా అసెంబ్లీ సెగ్మెంట్ లో ఉంటూ ఎన్నికల ప్రచారం కొనసాగిస్తున్నారు. మరోవైపు నియోజకవర్గంలో గెలుపు లక్ష్యంగా అన్ని పార్టీల నేతలు.. ఒకరి ఎత్తులకు మరొకరు పైఎత్తులు వేస్తున్నారు. దీంతో నాగార్జున సాగర్‌ బైపోల్‌ వార్‌ ఉత్కంఠ రేపుతోంది.

సమయం దగ్గర పడుతుండటంతో ప్రధాన పార్టీ నేతల్లో టెన్షన్ పెరుగుతుంది. నామినేషన్‌కు ఒకే ఒక్క రోజే సమయం ఉంది. అయినా రెండు ప్రధాన పార్టీల అభ్యర్థులు ఫైనల్‌ కాలేదు. ఈ నెల 30వ తేదీతో నామినేషన్ల గడువు ముగియనుంది. అయితే, ఇవాళ, రేపు, ఎల్లుండి సెలవులు రావడంతో నేతల్లో సమయం లేకుండాపోయింది. దీంతో 30వ తేదీ మంగళవారం ఒక్క రోజే నామినేషన్‌కు అవకాశం ఉంది.

సిట్టింగ్‌ స్థానాన్ని కాపాడుకునే వ్యూహాల్లో తన అభ్యర్థిపై ఆచితూచి వ్యవహరిస్తోంది గులాబీ పార్టీ. అభ్యర్థి ఫైనల్‌ కాకపోయినా… నెల రోజుల నుంచే గ్రామాల్లో ఇంటింటి ప్రచారం చేస్తోంది. మండలానికి ఒక ఎమ్మెల్యే, గ్రామానిక ఒక కీలక నేతకు ఎన్నిక బాధ్యతలు అప్పగించారు. అభ్యర్థిని చివరి నిమిషంలో ప్రకటించినా పెద్దగా ఇబ్బంది ఉండదనేది టీఆర్‌ఎస్‌ భావిస్తోంది.

దీనికి తోడు నెల రోజుల కిందటే హాలియాలో బహిరంగ సభ పెట్టి ఎన్నికల శంఖారావాన్ని మోగించారు సీఎం కేసీఆర్‌. అప్పటి నుంచే గ్రామాల్లో తిరుగుతున్నారు పార్టీ నేతలు. అయితే అభ్యర్థిని ఖరారు చేయడానికి వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారు గులాబీ బాస్‌. ఇప్పటికే ఏడుగురు నేతల అభ్యర్థిత్వాన్ని పరిశీలించారు. గెలుపు గుర్రాల కోసం కొన్ని సర్వేలు చేయించారు. చివరకు ఇద్దరిని షార్ట్‌ లిస్ట్‌ చేశారు. దివంగత ఎమ్మెల్యే నోముల నర్సింహయ్య కుమారుడు నోముల భగత్‌.. శాసన మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డిల్లో ఎవరో ఒకరిని అభ్యర్థిగా ప్రకటిస్తారని తెలుస్తోంది.

సాగర్‌లో యాదవ సామాజికవర్గం ఓట్లు ఎక్కువగా ఉండటం, నోముల నర్సింహయ్య మృతితో సెంటిమెంట్‌ పని చేస్తుందనే అంచనాతో నోముల భగత్‌ వైపే అధినేత కేసీఆర్ మొగ్గు చూపే అవకాశముందని పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. అయితే, కాంగ్రెస్‌ నుంచి జానారెడ్డి బలమైన అభ్యర్థిగా ఉండటంతో భగత్‌ పోటీ ఇవ్వగలరా అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. దీంతో గుత్తాకు ఇస్తే ఎలా ఉంటుందనే ప్లాన్‌-బీని టీఆర్ఎస్ ఆలోచిస్తోందని తెలుస్తోంది. మంగళవారం నామినేషన్‌కు ఒక్క రోజే అవకాశం ఉండటంతో… సోమవారం రోజే అభ్యర్థిని ప్రకటిస్తారని తెలుస్తోంది. అలా చేయడం ద్వారా బీజేపీ వ్యూహాలను చిత్తు చేయాలని భావిస్తోంది టీఆర్ఎస్. పార్టీలో టిక్కెట్‌ ఆశించిన వారు అసంతృప్తి చెంది మరో పార్టీలోకి వెళ్లకుండా జాగ్రత్త పడుతోంది.

ఇదిలావుంటే, సాగర్‌లో బీజేపీ అభ్యర్థి ఎవరన్న దానిపై కన్ఫ్యూజన్‌ కంటిన్యూ అవుతోంది. ఒకరు నామినేషన్‌ వేస్తే… మరొక ఇద్దరు గట్టిగా లాబీయింగ్‌ చేస్తున్నారు. ఇప్పటికే నామినేషన్‌ వేసిన బీజేపీ జిల్లా అధ్యక్షుడు కంకణాల శ్రీధర్‌రెడ్డి సతీమణి కంకణాల నివేదితకు పార్టీ బీఫామ్‌ ఇస్తుందా? లేదంటే కొత్త ఫేస్‌ను బరిలోకి దించుతుందా? అనేది ఉత్కంఠ రేపుతోంది. దీంతో అభ్యర్థి ఎవరో తెలియక కేడర్‌లో అయోమయం నెలకొంది. ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓడిపోయినా, దుబ్బాక, జీహెచ్ఎంసీలో జోష్‌ కచ్చితంగా సాగర్‌లో ప్రభావం చూపిస్తుందని భావిస్తున్నారు కమలం నేతలు. అందుకే సాగర్‌లో సీటు తెచ్చుకుని అదృష్టాన్ని పరీక్షించుకోవాలని చూస్తున్నారు ఆశావహులు. దీంతో పోటీ చేసేందుకు పార్టీలో పోటీ ఎక్కువ ఉందని చెప్పుకుంటున్నారు.

బీజేపీ టికెట్ అశిస్తున్నవారిలో నివేదితతో పాటు కడారి అంజయ్య, రవినాయక్‌ పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. వీరందరు అధిష్టానం మెప్పు పొందేందుకు తమ ప్రయత్నాల్లో బిజీగా ఉన్నారు. సొంత పార్టీ నేతలు కాకుండా… ఇదే కాకుండా టీఆర్ఎస్ నుంచి ఎవరైనా వస్తారా అని ఎదురు చూస్తోంది బీజేపీ రాష్ట్ర నాయకత్వం. గులాబీ పార్టీలో టిక్కెట్‌ ఆశిస్తున్న కోటిరెడ్డి, ఎమ్మెల్సీ తేరా చిన్నపురెడ్డి తమ వైపు చూస్తున్నారనే ప్రచారం సాగుతోంది. అందుకే టీఆర్ఎస్ టిక్కెట్‌ ఫైనల్‌ చేసే వరకు వేచిచూస్తున్నట్లు సమాచారం.

ఇక, నామినేషన్‌ వేసిన నివేదిత కచ్చితంగా తనకే బీఫామ్‌ వస్తుందన్న విశ్వాసంతో ఉన్నారు. ఆమె గత ఎన్నికల్లో ఓడిపోయారు. సిద్ధాంతానికి కట్టుబడిన, ముందు నుంచి కష్టపడిన తనకు కాక ఇంకెవరికి టిక్కెట్‌ ఇస్తారనేది నివేదిత వాదన. కొత్త నేతలు ఎవరైనా వస్తే… మరోచోట వారికి అవకాశం ఇస్తుందని చెబుతున్నారు. ఒకవేళ టీఆర్ఎస్ నుంచి ఎవరూ రాకపోతే… అప్పుడు నివేదిత, అంజయ్య, రవినాయక్‌ల్లో ఎవరో ఒకరికి టిక్కెట్‌ ఫైనల్‌ చేయొచ్చనే ప్లాన్‌లో ఉంది బీజేపీ రాష్ట్ర నాయకత్వం. కాకపోతే టీఆర్ఎస్ నుంచి ఎవరో ఒకరిని లాగేయాలని గట్టిగా ప్రయత్నిస్తోంది.

మరోవైపు, కాంగ్రెస్‌ పార్టీలో వన్‌మ్యాన్‌ షో నడుస్తోంది. పార్టీ కన్నా… తన ఇమేజ్‌తోనే ఉప ఎన్నికను ఫేస్‌ చేస్తున్నారు మాజీ మంత్రి జానారెడ్డి. అత్యంత సీనియర్‌ కావడం… నియోజకవర్గం అంతా తన ప్రభావం ఉండటంతో మరెవరూ అవసరం లేకుండానే ప్రచారం చేస్తున్నారు. కాంగ్రెస్‌ పార్టీ నుంచి ఇంత వరకు ఇన్‌ఛార్జులు లేరు. కీలక నేతలెవరూ ప్రచారంలో పాల్గొనడం లేదు. అయినా, జానారెడ్డి మాత్రం గెలుపు తనదే అంటూ ధీమా వ్యక్తం చేస్తున్నారు. సీఎం కేసీఆర్‌ గత నెలలో హాలియాలో సభ పెట్టిన చోటే ఇప్పుడు జనగర్జన సభ పెట్టారు జానా.

జనగర్జనతో సాగర్‌లో కాంగ్రెస్‌ ప్రచారం ఊపందుకుంది. ఇప్పటిదాకా వన్‌మ్యాన్‌షో నడుపుతూ వచ్చిన జానాకి.. హాలియా మీటింగ్‌తో మేమూ తోడున్నామంటూ గొంతు కలిపారు టీకాంగ్రెస్‌ ముఖ్యనేతలు. క్యాండేట్‌ని ముందే ప్రకటించి కాంగ్రెస్‌ స్పీడ్‌మీదుంటే…టీఆర్‌ఎస్‌, బీజేపీ అభ్యర్థులపై సస్పెన్స్‌ కంటిన్యూ అవుతోంది. ఇప్పటికే అధికార,ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం మొదలైంది. టీఆర్ఎసం ఇంటింటికి వెళుతుండటంతో… తాను కూడా ప్రతి గ్రామానికి వెళుతున్నారు. బయట జిల్లాల నుంచి నేతలు రాకుండానే ప్రచారాన్ని కొనసాగిస్తున్నారు. అంతా తానై వ్యవహరిస్తున్నారు. ఇక్కడ గెలుపోటములు జానారెడ్డి భవితవ్వాన్నే కాదు… కాంగ్రెస్‌ భవిష్యత్త్‌ను తేలుస్తాయి. అయినా జానా ఒంటరి పోరాటం చేస్తున్నారు.

Read Also… తమిళనాడులో ఐటి దాడుల కలకలం.. రాజకీయ పార్టీలకు దడ పుట్టిస్తున్న ఆదాయపన్నుల శాఖ..!