అమరావతిని వ్యతిరేకించడమంటే.. మోదీని వ్యతిరేకించడమే : వవన్
ఏపీ రాజధానిగా అమరావతి ఇక్కడే కొనసాగుతుందన్నారు జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్. రాజధాని రైతులతో సమావేశమైన ఆయన వైసీపీ ప్రభుత్వ విధానాలపై తీవ్రస్ధాయిలో మండిపడ్డారు. రాజకీయం అంటే స్కూలు పిల్లల ఆటకాదని, రాజధానిని తరలిస్తామనే మాటలు సరైనవి కాదంటూ మండిపడ్డారు. ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణను టార్గెట్ చేస్తూ పవన్ తనదైన శైలిలో మాట్లాడారు. బొత్సాకు సీఎం కావాలనే ఆశ మనసులో ఏ మూలనో ఉందని, ఈ ప్రభుత్వంలో ఆయన ముఖ్యమంత్రి కావచ్చేమో అంటూ ఎద్దేవా చేశారు. […]
ఏపీ రాజధానిగా అమరావతి ఇక్కడే కొనసాగుతుందన్నారు జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్. రాజధాని రైతులతో సమావేశమైన ఆయన వైసీపీ ప్రభుత్వ విధానాలపై తీవ్రస్ధాయిలో మండిపడ్డారు.
రాజకీయం అంటే స్కూలు పిల్లల ఆటకాదని, రాజధానిని తరలిస్తామనే మాటలు సరైనవి కాదంటూ మండిపడ్డారు. ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణను టార్గెట్ చేస్తూ పవన్ తనదైన శైలిలో మాట్లాడారు. బొత్సాకు సీఎం కావాలనే ఆశ మనసులో ఏ మూలనో ఉందని, ఈ ప్రభుత్వంలో ఆయన ముఖ్యమంత్రి కావచ్చేమో అంటూ ఎద్దేవా చేశారు.
తమ భవిష్యత్తు తరాలకోసం వేలాది మంది రైతులు తమ భూములు ఇచ్చారనే ఆ విషయాన్ని ప్రభుత్వం మర్చిపోకూడదని, కులాలపై కక్ష ఉంటే దాన్ని ప్రజలందరి మీదా రుద్దడం మంచిపని కాదన్నారు జనసేనాని. రాజకీయం చేయడమంటే స్కూలు పిల్లల ఆట కాదన్నారు పవన్. ఇప్పటికే పోలవరం టెండర్లు రద్దు చేసి.. చెడ్డపేరు మూటగట్టుకున్నారని , రాజధాని నిర్మాణం, పోలవరం ప్రాజెక్టు పనుల్లో ఎంతో మంది ఉత్తరాధి ప్రాంతానికి చెందిన కూలీలు పనిచేస్తున్నారని వారి జీవితాలు కూడా రోడ్డున పడతాయని చెప్పుకొచ్చారు.
గత టీడీపీ ప్రభుత్వ విధానాలనే వైసీపీ ప్రభుత్వం అమలు చేయడం సరికాదని, ఇసుక విధానంలో ప్రభుత్వం అనుసరిస్తున్న విధానంతో భవన నిర్మాణ కార్మికులు వలసలు వెళుతున్నారని విమర్శించారు. 151 మంది ఎమ్మెల్యేలతో అధికారం చేపట్టిన వైసీపీ ఆలోచించి అడుగులు వేయాలని సూచించారు పవన్.
రాజధాని నిర్మాణానికి శంకుస్థాపన చేసింది ప్రధాని మోదీ అని, ఒకవేళ రాజధానిని వ్యతిరేకిస్తే మోదీని వ్యతిరేకించినట్టేనని, అమిత్ షాను వ్యతిరేకించినట్టేననే విషయం మంత్రి బొత్స గమనించాలన్నారు.
రాజధాని రైతులు ఎలాంటి ఆందోళన అవసరం లేదన్నారు. ఎప్పుడు ఎలాంటి సమస్య ఎదురైనా తాను పోరాటం చేయడానికి సిద్ధంగా ఉన్ననంటూ పవన్ చెప్పుకొచ్చారు.