AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

హైదరాబాద్ డెలివరీ మ్యాన్‌కు పాజిటివ్.. మార్చి 19న ఆయన కలిసిందెవరినో

తెలంగాణ రాష్ట్రంలో ఫుడ్ డెలివరీ సంస్థలు జొమాటో, స్విగ్గీ వంటి వాటిని నిరవధికంగా నిషేధించిన నేపథ్యంలో ఓ ఆసక్తికరమైన కరోనా పాజిటివ్ కేసు వెలుగు చూసింది. తబ్లిఘీ జమాత్ సదస్సుకు వెళ్ళి వచ్చిన తన సోదరుని ద్వారా సదరు డెలివరీ మ్యాన్‌కు...

హైదరాబాద్ డెలివరీ మ్యాన్‌కు పాజిటివ్.. మార్చి 19న ఆయన కలిసిందెవరినో
Rajesh Sharma
|

Updated on: Apr 20, 2020 | 12:45 PM

Share

తెలంగాణ రాష్ట్రంలో ఫుడ్ డెలివరీ సంస్థలు జొమాటో, స్విగ్గీ వంటి వాటిని నిరవధికంగా నిషేధించిన నేపథ్యంలో ఓ ఆసక్తికరమైన కరోనా పాజిటివ్ కేసు వెలుగు చూసింది. తబ్లిఘీ జమాత్ సదస్సుకు వెళ్ళి వచ్చిన తన సోదరుని ద్వారా సదరు డెలివరీ మ్యాన్‌కు కరోనా పాజిటివ్ సోకినట్లు తేలడంతో అధికారులు, పోలీసులు ఆయన ఎవరెవరికి ఫుడ్ డెలివరీ చేసాడనే కోణంలో కాంటాక్టు ట్రేసింగ్ మొదలు పెట్టారు. అయితే ఈక్రమంలో మార్చ 19వ తేదీ అత్యంత కీలకంగా మారినట్లు అధికారుల చెబుతున్నారు.

హైదరాబాద్ నాంపల్లికి చెందిన ముప్పై ఏళ్ళ డెలివరీ మ్యాన్ కరోనా పాజిటివ్ కేసుల్లో ఒకనిగా తేలాడు. అతని 36 ఏళ్ళ సోదరుడు మార్చిలో ఢిల్లీలో జరిగిన తబ్లిఘీ జమాత్ సదస్సుకు వెళ్ళి రాగా.. అతనింట్లో మొత్తం అయిదుగురికి కరోనా సోకింది. దాంతో మొత్తం కుటుంబాన్ని క్వారెంటైన్‌లో వుంచారు. ఢిల్లీ వెళ్ళి వచ్చిన వ్యక్తితోపాటు అతని 30 ఏళ్ళ డెలివరీ మ్యాన్ తమ్ముడుకూడా క్వారెంటైన్ పూర్తి చేసుకున్నాడు.

తన అన్న తబ్లిఘీ నుంచి తిరిగి వచ్చిన తర్వాత తాను కేవలం ఒకరోజు అంటే మార్చి 18న తన అన్న తిరిగి రాగా.. తాను కేవలం మార్చి 19న మాత్రమే డెలివరీ జాబ్ చేశానని సదరు వ్యక్తి చెబుతున్నాడు. దాంతో ఆ ఒక్కరోజు అతను ఎవరెవరికి ఫుడ్ డెలివరీ ఇచ్చాడనే కోణంలో అధికారులు కాంటాక్టు ట్రేసింగ్ చేస్తున్నారు. ఆ ఒక్కరోజు ఎవరిని కలిశాడు.. వారు మరి ఎంత మందిని ఈ నెల రోజుల్లో కలిసి వుంటారు. వారిలో ఎందరికి కరోనా సోకి వుండొచ్చు అనేదిపుడు టెన్షన్ పుట్టించే విషయంగా మారింది.

ఇన్నాళ్ళు క్వారెంటైన్‌లో వున్న సదరు డెలివరీ మ్యాన్… మొదటి రోజుల్లోనే తాను మార్చి 19న ఫుడ్ డెలివరీ ఇచ్చిన విషయం వెల్లడించి వుంటే కాంటాక్టు ట్రేసింగ్ సులభమై వుండేదని, నెల రోజుల తర్వాత ఈ కాంటాక్టు ట్రేసింగ్ చాలా కష్టమని చెబుతున్నారు అధికారులు. సదరు డెలివరీ మ్యాన్ తాను ఫుడ్ డెలివరీ ఇచ్చిన విషయం రహస్యంగా వుంచడం వెనుక ఉద్దేశాన్ని పోలీసులు కూపీ లాగుతున్నారు.

ఉద్దేశపూర్వకంగానే తాను ఫుడ్ డెలివరీ ఇచ్చిన విషయం దాచి వుంటే మాత్రం అది నేరంగా పరిగణించాల్సి వుంటుంది. కానీ పోలీసులు ఆ దిశగా అడుగులు వేయకపోవడంపై కొందరు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మొత్తానికి కాంటాక్టు ట్రేసింగ్ అటు వైద్యాధికారులకు, పోలీసులకు సవాల్‌గా మారింది. ప్రభుత్వం కఠినంగా వ్యవహరించకపోతే ఇలాంటి వ్యక్తుల వల్ల మొత్తం సమాజానికే చేటు అని కొందరంటున్నారు.