కరోనా ఎఫెక్టు.. ఏపీలో భారీగా ఉద్యోగాల జాతర
కరోనా ప్రభావంతో దేశంలో పలు రంగాల్లో వేలాది మంది ఉద్యోగాలు కోల్పోతుంటే.. ఏపీలో మాత్రం భారీ ఉద్యోగాల జాతరకు తెరలేచింది. కరోనా ప్రభావంలోను భారీ రిక్రూట్‌మెంటుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. పైగా....

కరోనా ప్రభావంతో దేశంలో పలు రంగాల్లో వేలాది మంది ఉద్యోగాలు కోల్పోతుంటే.. ఏపీలో మాత్రం భారీ ఉద్యోగాల జాతరకు తెరలేచింది. కరోనా ప్రభావంలోను భారీ రిక్రూట్‌మెంటుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. పైగా.. ఈ రిక్రూట్‌మెంటులో ఎంపికైన వారికి భవిష్యత్తులో మరింత ప్రోత్సాహకరంగా వుండేందుకు పదిహేను ప్రత్యేక రిజర్వేషన్‌లు కేటాయించాలని కూడా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నిర్ణయించారు.
కోవిడ్19 వైరస్ వ్యాప్తి చెందకుండా నియంత్రణా చర్యలను వేగంగా తీసుకుంటున్న ఏపీ ప్రభుత్వం ఈ క్రమంలో వైద్య, ఆరోగ్య శాఖకు సిబ్బంది కొరత వున్నట్లు గుర్తించారు. వైద్య పరీక్షలు నిర్వహించడం, చికిత్స అందించడం తద్వారా వైరస్ వ్యాప్తిని అదుపు చేయడంలో భాగంగా అవసరమైన అభ్యర్థుల కోసం కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ పద్దతిలో నియామకాలకు ప్రకటన జారీ చేసింది ఏపీ ప్రభుత్వం. ఈ మేరకు జిల్లాల కలెక్టర్లు నియామకాలు జరిపేలా ఆదేశాలు జారీ చేశారు.
ఈ రిక్రూట్‌మెంటులో ఎంపికైన అభ్యర్థులు.. కోవిడ్ 19 కార్యక్రమాల్లో సేవలు అందిస్తే.. వారి సేవలకు గుర్తింపుగా.. భవిష్యత్తులో చేపట్టబోయే ఉద్యోగ నియామకాల్లో తగిన ప్రాముఖ్యత ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నారు. దీంతోపాటు కోవిడ్ 19 విధులలో సేవలు అందించడానికి ముందుకు వచ్చే కాంట్రాక్టు, ఔట్ సోర్స్ సిబ్బందికి భవిష్యత్తులో చేపట్టబోయే రెగ్యులర్ నియామకాలలో 15 శాతం వెయిటేజి ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. తాజాగా జారీ అయిన ఆదేశాలకు అనుగుణంగా వైద్య ఆరోగ్య, కుటుంబ సంక్షేమశాఖలోని అన్ని విభాగాల అధిపతులు తగిన చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి జగన్ ఆదేశాలిచ్చారు.




