బాలాజీ భక్తులకు కరోనా ఎఫెక్ట్…! చిలుకూరు ఆలయం మూసివేత
తెలంగాణలోని హైదరాబాద్‌లో ప్రఖ్యాతిగాంచిన చిలుకూరు బాలాజీకి సైతం వైరస్ ప్రభావం తప్పటం లేదు. చిలుకూరి బాలాజీ టెంపుల్‌లో కూడా ముందు జాగ్రత్త చర్యలు..
కరోనా ఎఫెక్ట్‌తో దేశంలోని చాలా ఆలయాలు మూతపడ్డాయి. షిర్డి సాయినాధ మందిరం కూడా మార్చి 17 మధ్యాహ్నం నుంచే మూసివేశారు. ఉజ్జయిని మహాకాళి ఆలయం మొదలు…అన్నవరం క్షేత్రం వరకు అన్ని ఆధ్యాత్మీక క్షేత్రాలకు కొవిడ్ ఎఫెక్ట్ పడింది. తాజాగా తెలంగాణలోని హైదరాబాద్‌లో ప్రఖ్యాతిగాంచిన చిలుకూరు బాలాజీకి సైతం వైరస్ ప్రభావం తప్పటం లేదు. చిలుకూరి బాలాజీ టెంపుల్‌లో కూడా ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నట్లు ఆలయ ప్రధాన అర్చకులు తెలిపారు. చర్యల్లో భాగంగా… మార్చి 19 (గురువారం) నుంచీ మార్చి 25 వరకూ… ఆలయాన్ని మూసివేస్తున్నట్లు ప్రకటించారు. మూసివేయడమంటే… పూర్తిగా మూసేయడం కాదు… స్వామి వారికి రోజువారి పూజలు, నైవేద్యాలను సమర్పిస్తారు. భక్తులను మాత్రం అనుమతించరు. అందువల్ల భక్తులు ఎవరూ 25 వరకూ ఆలయానికి రావొద్దని అర్చకులు కోరుతున్నారు. ఇది ఎంతో బాధాకరమైన విషయం అయినప్పటికీ… కరోనా వైరస్ వ్యాప్తిని తగ్గించే చర్యల్ని చేపట్టడంలో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. ఈ వైరస్ త్వరగా వెళ్లిపోవాలని దేవుణ్ని కోరుకుంటూ ప్రత్యేక పూజలు చేసినట్లు వివరించారు. ప్రస్తుతం ఏ ఆలయాలకు భక్తులు వెళ్లకపోవడమే మంచిదన్నారు. ఇళ్లలోనే ఉంటూ దేవుడున్ని ప్రార్థించుకోవాలన్నారు. ప్రపంచాన్ని కుదిపేస్తున్న ఈ మహమ్మారి కరోనా వైరస్ తొందరగా వదిలివెళ్లాలని కోరుకుందామన్నారు.