ముఖ్యమంత్రి పాల్గొన్న కార్యక్రమంలో కలుషిత ఆహారం కలకలం.. ఆరోగ్య మంత్రితో సహా 145 మంది అస్వస్థత

అసోం రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన విందులో రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రితో సహా 145 మందికి పైగా అస్వస్థతకు గురయ్యారు.

ముఖ్యమంత్రి పాల్గొన్న కార్యక్రమంలో కలుషిత ఆహారం కలకలం.. ఆరోగ్య మంత్రితో సహా 145 మంది అస్వస్థత
Follow us
Balaraju Goud

|

Updated on: Feb 04, 2021 | 2:44 PM

Food poisoned in Assam : విందు భోజనం జనం ప్రాణాల మీదకు తెచ్చింది. సాక్షాత్తు ముఖ్యమంత్రి పాల్గొన్న కార్యక్రమంలో ఏర్పాటు చేసిన విందులో రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రితో సహా 145 మందికి పైగా అస్వస్థతకు గురయ్యారు. ఈ ఘటన అసోం రాష్ట్రంలో చోటుచేసుకుంది. అసోం రాష్ట్రం కర్బి అంగ్లాంగ్‌ జిల్లాలోని మెడికల్‌ కాలేజ్‌లో ఎంబీబీఎస్‌ అకడమిక్‌ సెషన్‌ ప్రారంభోత్సవానికి ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి సర్బానంద సోనోవాల్‌, ఆరోగ్య శాఖ మంత్రి హిమంత బిశ్వ శర్మ తదితరులు హాజరయ్యారు.

అయితే, కార్యక్రమం అనంతరం కాలేజ్ యాజమాన్యం విందు భోజనాలు ఏర్పాటు చేసింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఎనిమిదివేల మందికి బిర్యానీ ప్యాకెట్‌ను సరఫరా చేశారు. ఈ ఆహారం తిన్న 145 మంది వరకు అస్వస్థతకు గురయ్యారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఆరోగ్య శాఖ మంత్రి హిమంత బిశ్వ శర్మ కూడా అస్వస్థతకు లోనవడంతో దిపు మెడికల్‌ కాలేజ్‌లో చికిత్స పొందుతున్నారు. బిర్యానీ తీసుకున్న అనంతరం తాను కూడా అనారోగ్యానికి గురయ్యానని, ఇప్పుడు కోలుకున్నానని ఆయన చెప్పారు. కాగా, ఈ విందుకు హాజరైన వారిలో పలువురు వాంతులు, విరేచనాలతో బాధపడుతున్నారు.

మంగళవారం రాత్రి నుంచి 145 మందిని వివిధ ఆసుపత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు. కాగా చికిత్సపొందుతున్న వారిలో 28 మంది ఇప్పటివరకూ డిశ్చార్జి అయ్యారని మంత్రి శర్మ తెలిపారు. ఈ ఘటనకు దారితీసిన పరిస్థితులపై న్యాయ విచారణకు ఆదేశించామని కర్బి అంగ్లాంగ్‌ డిప్యూటి కమిషనర్‌ చంద్ర ధ్వజ సింఘ వెల్లడించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఓ వ్యక్తి చికిత్స పొందుతూ మరణించడం కలకలం రేపింది. ఫుడ్‌ పాయిజన్‌తోనే ఆయన మరణించారా అనేది ఇంకా తేలాల్సి ఉందని అధికారులు తెలిపారు. ఇప్పటికే ఆహార నమూనాలను సేకరించి పరీక్షలకు పంపామని పేర్కొన్నారు.

Read Also….Union Bank Fraud: బ్యాంకులో “చిల్లర దొంగలు”.. రూ.15లక్షలు మాయం చేశారు.. ఇంటి దొంగల పనేనా..?