ఆధ్యాత్మికత ఉట్టిపడేలా యాదాద్రిలో రవాణా సదుపాయాలు
యాదాద్రి దేవాలయాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకున్న రాష్ట్ర ప్రభుత్వం దేశంలోనే తలమానికంగా పునర్నిర్మాణ పనులు చేపడుతోంది.
యాదాద్రి దేవాలయాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకున్న రాష్ట్ర ప్రభుత్వం దేశంలోనే తలమానికంగా పునర్నిర్మాణ పనులు చేపడుతోంది. ప్రధాన ఆలయం నుంచి కాటేజీలు, భక్తుల సౌకర్యాలు, రవాణా సదుపాయాలు, విడిది కేంద్రాలు ఇలా అన్ని వసతులను సమకూరుస్తుంది. యాదాద్రి పూర్తి ఆధ్యాత్మిక వాతావరణంలో భక్తులు పరవశించేలా ఏర్పాట్లు సాగుతున్నాయి. ముఖ్యంగా యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి ఆలయాన్ని సందర్శించే భక్తులకు 50 ఏళ్ల భవిష్యత్తు అవసరాలకు సరిపోను ప్రయాణ, వసతి సౌకర్యాలను కల్పించేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నామని రవాణా, రోడ్డు భవనాల శాఖ. ఇందుకు సంబంధించిన వివరాలను మంత్రులు వేముల ప్రశాంత్‌రెడ్డి, పువ్వాడ అజయ్‌కుమార్ తెలిపారు. ఈ సందర్భంగా ఆర్టీసీకి ప్రభుత్వం కేటాయించిన స్థలాన్ని రవాణాశాఖ కార్యదర్శి అనిల్ కుమార్‌కు జిల్లా కలెక్టర్ అనితా రామచంద్రన్ అప్పగించారు.
యాదాద్రి ఆలయ పురోగతిపై ఇటీవల సీఎం కేసీఆర్ ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించిన నేపథ్యంలో మంత్రులు సైదాపురం శివారులో, గండిచెరువు వద్ద, కొండపై ప్రయాణ ప్రాంగణాలకు అనువైన స్థలాలను మంగళవారం పరిశీలించారు. యాదాద్రి ఆలయ ప్రారంభం నాటికి కొత్త బస్‌డిపో, బస్టాండ్, భారీ బస్ టర్మినల్స్ నిర్మాణాలను పూర్తి చేస్తామని మంత్రులు వెల్లడించారు. రాష్ట్ర నలుమూలల నుంచి యాదాద్రి క్షేత్రాన్ని సందర్శించే భక్తుల కోసం సాధారణ బస్‌స్టేషన్, టెంపుల్ బస్ టర్మినల్స్‌ను వేర్వేరుగా ఏర్పాటు చేస్తామని తెలిపారు. 150 బస్సులను నిలిపేలా విశాలమైన డిపో ను నిర్మిస్తామని ప్రకటించారు.
అలాగే ఆలయ పుష్కరిణి, కల్యాణకట్ట, నిత్యాన్నదాన సత్రాలతో పాటు భక్తులు బస చేసే టెంపుల్ సిటీ నుంచి కొండపైకి చేరవేయడానికి ప్రత్యేక బస్సులు నడిపిస్తామన్నారు. ఆలయ ప్రతిష్ఠకు అనుగుణంగా ఆధ్యాత్మికత ఉట్టిపడేలా బస్టాండ్లు, టర్మినల్స్‌ను వైటీడీఏ ఆర్కిటెక్ట్ అద్భుతం గా రూపొందిస్తారని తెలిపారు. కల్యాణకట్ట, పుష్కరిణి ప్రవేశ ద్వారాల వద్ద అద్భుతమైన ఆర్చీ గేట్లను నిర్మిస్తామని చెప్పారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాలతో అతి త్వరలోనే నిర్మాణ పనులు చేపట్టి అందుబాటులోకి తీసుకురానున్నట్లు మంత్రులు తెలిపారు.