Telugu Astrology: ఆ రాశులకు బలహీనంగా కీలక గ్రహాలు.. ఏ పరిహారాలు చేయాలంటే..?
Telugu Astro Tips: మేషం, కర్కాటకం, సింహం, వృశ్చికం, ధనుస్సు, మీన రాశుల వారికి కొన్ని ముఖ్య గ్రహాలు బలహీనంగా ఉన్నాయి. దీని ప్రభావంతో ఆ రాశుల వారికి ఉద్యోగంలో ఆటంకాలు, ఆర్థిక సమస్యలు, కుటుంబ జీవితంలో ఇబ్బందులు వంటివి ఎదురవుతాయి. ఈ సమస్యలకు పరిహారంగా ఇంద్రనీలం, పుష్యరాగం, మరకతం వంటి రత్నాలను ధరించడం ఉత్తమం.

Telugu Astrology
సాధారణంగా ఏ రాశికైనా గ్రహాలన్నీ అనుకూలంగా ఉండడమనేది అసాధ్యం. కొన్ని గ్రహాలు మాత్రమే అనుకూలంగా ఉంటాయి. ఒక కోణంలో బాగుంటే మరో కోణంలో ఇబ్బందులు ఎదురు కావచ్చు. ప్రధాన గ్రహం బలహీనపడడం వల్ల కష్టనష్టాలు ఎక్కువగా కలిగే అవకాశం ఉంటుంది. రాశ్యధిపతి, గురు, శుక్రులు బలహీనపడడం ఏమాత్రం మంచిది కాదు. ప్రస్తుత గ్రహ సంచారం ప్రకారం మేషం, కర్కాటకం, సింహం, వృశ్చికం, ధనుస్సు, మీన రాశుల వారికి కొన్ని ముఖ్యమైన గ్రహాలు బలహీనపడడం జరిగింది. వీటి ఫలితాలు, పరిహారాలను పరిశీలించడం జరుగుతుంది.
- మేషం: ఈ రాశికి దశమ, లాభ స్థానాధిపతి అయిన శని వ్యయ స్థానంలో ఉన్నందువల్ల బలహీనపడడం జరిగింది. దీనివల్ల ఉద్యోగంలో అడ్డంకులు, ఆటంకాలు ఎక్కువగా కలిగే అవకాశం ఉంటుంది. పురోగతి స్తంభించిపోతుంది. ఎంత కష్టపడ్డా ఫలితం ఉండదు. ఆదాయం నిదానంగా పెరుగుతుంది. నిరుద్యోగులకు ఆశాభంగాలు ఎక్కువగా ఉంటాయి. వీటి నుంచి బయటపడి విజయాలు, సాఫల్యాలు సాధించాలన్న పక్షంలో ఈ రాశివారు ఇంద్రనీలం పొదిగిన ఉంగరాన్ని ధరించడం మంచిది.
- కర్కాటకం: ఈ రాశికి షష్ట, భాగ్యాధిపతిగా అత్యంత శుభుడైన గురువు వ్యయగతుడైనందువల్ల మంచి అవ కాశాలు చేజారిపోయే అవకాశం ఉంటుంది. అనాలోచిత నిర్ణయాలతో ఇబ్బంది పడడం జరుగుతుంది. ఆదాయం కంటే ఖర్చులు ఎక్కువగా ఉంటాయి. ప్రతిభకు, నైపుణ్యాలకు లోటు లేకపోయినా జీవితంలో పురోగతి ఉండదు. ఎంత కష్టపడ్డా ఆదాయం పెరగదు. ఈ సమస్యల నుంచి బయటపడాలన్న పక్షంలో ఈ రాశివారు పుష్యరాగం పొదిగిన ఉంగరాన్ని ధరించడం మంచిది.
- సింహం: ఈ రాశికి ధన, లాభాధిపతి అయిన బుధుడు వ్యయ స్థానంలో ఉండడం, పైగా వక్రించడం వల్ల అనుకున్నదొకటి అయిందొకటి అన్నట్టుగా ఉంటుంది. ఏ ప్రయత్నం చేపట్టినా ఒక పట్టాన ఫలించకపోవచ్చు. కష్టార్జితంలో ఎక్కువ భాగం వృథా కావడం, నష్టపోవడం, మోసపోవడం జరుగుతుంది. కుటుంబ జీవితం అస్తవ్యస్తంగా మారుతుంది. మాటకు విలువ తగ్గుతుంది. ఎంత కష్టపడ్డా పురోగతి ఉండదు. మరకతం (పచ్చ) పొదిగిన ఉంగరం ధరించడం వల్ల ఈ సమస్యలు తొలగిపోతాయి.
- వృశ్చికం: ఈ రాశికి ధన, పంచమాధిపతిగా అత్యంత శుభుడైన గురువు అష్టమ స్థానంలో సంచారం చేయ డం వల్ల అనవసర ఖర్చులు బాగా పెరుగుతాయి. నష్టదాయక వ్యవహారాలతో ఆర్థిక సమస్యలు పెరుగుతాయి. ఏ పనీ, ఏ ప్రయత్నమూ కలిసి రాకపోవచ్చు. ఉద్యోగంలో ప్రాధాన్యం తగ్గుతుంది. పదోన్నతులకు ఆటంకాలు ఏర్పడతాయి. పిల్లల వల్ల సమస్యలు కలుగుతాయి. పుష్యరాగం పొదిగిన ఉంగరం ధరించడం వల్ల ఈ కష్టనష్టాల నుంచి తప్పకుండా బయటపడడం జరుగుతుంది.
- ధనుస్సు: ఈ రాశికి అర్ధాష్టమ శని కారణంగా పురోగతి స్తంభించిపోతుంది. ఉద్యోగంలో పదోన్నతులు ఆగిపోతాయి. వృత్తి, వ్యాపారాలు మందగిస్తాయి. కుటుంబంలో సుఖ సంతోషాలు మందగిస్తాయి. మనశ్శాంతి లోపిస్తుంది. గృహ నిర్మాణానికి సంబంధించిన పనుల్లో ఆటంకాలు ఏర్పడతాయి. ఆదాయ ప్రయత్నాలు ఆశించిన ఫలితాలనివ్వకపోవచ్చు. ఆశాభంగాలు, నిరాశా నిస్పృహలు ఎక్కువగా ఉంటాయి. ఈ దుస్థితి నుంచి బయటపడడానికి ఇంద్ర నీలం పొదిగిన ఉంగరం ధరించడం చాలా మంచిది.
- మీనం: శనీశ్వరుడు ఈ రాశిలో సంచారం చేయడం వల్ల ఏలిన్నాటి శని ప్రభావం కాస్తంత ఎక్కువగా ఉంటుంది. ఉద్యోగంలో ప్రాధాన్యం బాగా తగ్గుతుంది. పదోన్నతులు కలగడానికి, జీతభత్యాలు పెరగడానికి అవకాశం ఉండకపోవచ్చు. ఉద్యోగం పోయే అవకాశం కూడా ఉంది. అనారోగ్యాలు పీడిస్తాయి. ప్రతి పనిలోనూ వ్యయప్రయాసలు పెరుగుతాయి. ఎంత ప్రతిభ ఉన్నా చిన్న ఉద్యోగాలు చేయాల్సి వస్తుంది. ఇంద్రనీలం పొదిగిన ఉంగరాన్ని ధరించడం వల్ల వీటి నుంచి విముక్తి లభిస్తుంది.



