
Shukra Gochar 2026
శుభ స్థానాల్లో ఉన్నప్పుడు సుఖ సంతోషాలను కలగజేసే శుక్రుడు దుస్థానాల్లో ఉన్నప్పుడు కష్ట నష్టాలను కలగజేయడం జరుగుతుంది. ఈ నెల(జనవరి) 12 నుంచి ఫిబ్రవరి 6 వరకు మకర రాశిలో సంచారం చేస్తున్న శుక్ర గ్రహం కొన్ని రాశుల వారిని ఓ 25 రోజుల పాటు కొద్దిగా సమస్యలకు గురి చేసే అవకాశం ఉంది. మిథునం, కర్కాటకం, సింహం, వృశ్చికం, కుంభ రాశులవారు దుస్థా నంలో ఉన్న శుక్రుడితో కొన్ని అవస్థలు పడకతప్పదు. ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది.
- మిథునం: ఈ రాశికి అష్టమ స్థానంలో శుక్ర సంచారం వల్ల వైవాహిక జీవితంలో కొద్దిగా విభేదాలు, వివాదాలు తలెత్తే అవకాశం ఉంది. శుక్రుడు వైవాహిక జీవితానికి కారకుడైనందువల్ల కుటుంబంలో సుఖ సంతోషాలు బాగా తగ్గడం జరుగుతుంది. పెళ్లి ప్రయత్నాల్లో ఆశాభంగాలు తప్పకపోవచ్చు. ప్రేమ వ్యవహారాల్లో అపార్థాలు తలెత్తుతాయి. ఆదాయ వృద్ధి ప్రయత్నాలు వెనుకబడతాయి. సన్నిహితులు దూరమవుతారు. పిల్లల విషయాలేవీ అనుకూలంగా సాగకపోవచ్చు. బంధువుల వల్ల నష్టపోతారు.
- కర్కాటకం: ఈ రాశికి సప్తమ స్థానంలో శుక్ర సంచారం ఈ రాశివారికి ప్రతికూల ఫలితాలనిస్తుంది. ఆదాయంలో ఎక్కువ భాగం వృథా కావడం లేదా నష్టపోవడం జరుగుతుంది. కుటుంబ జీవితంలోనూ, దాంపత్య జీవితంలోనూ సుఖ సంతోషాలు బాగా తగ్గుతాయి. పెళ్లి ప్రయత్నాలేవీ సఫలం కాకపోవచ్చు. కష్టానికి తగ్గ ప్రతిఫలం ఉండదు. శ్రమ ఎక్కువ ఫలితం తక్కువగా ఉంటుంది. ప్రతి పనిలోనూ శ్రమ, తిప్పట ఎక్కువగా ఉంటాయి. జీవిత భాగస్వామికి అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి.
- సింహం: ఈ రాశికి షష్ట స్థానంలో శుక్ర సంచారం వల్ల జీవిత భాగస్వామితో అకారణ విభేదాలు ఏర్పడతాయి. కుటుంబ విషయాల్లో బంధువులు కల్పించుకోవడం వల్ల సమస్యలు తలెత్తుతాయి. అనారోగ్యాలు ఇబ్బంది పెడతాయి. ఉద్యోగంలో ప్రాధాన్యం తగ్గుతుంది. జూనియర్లకు పదోన్నతులు లభించే అవకాశం ఉంది. ఆర్థిక, వ్యక్తిగత సమస్యలు ఒత్తిడి కలిగిస్తాయి. బంధుమిత్రులకు బాగా దూరమవుతారు. సహాయం పొందినవారు ముఖం చాటేస్తారు. ప్రయాణాలు ఇబ్బంది కలిగిస్తాయి.
- వృశ్చికం: ఈ రాశికి తృతీయ స్థానంలో శుక్ర సంచారం వల్ల ప్రతికూల ఫలితాలు ఎక్కువగా కలుగుతాయి. అనుకున్న పనులేవీ పూర్తి కావు. ఏ ప్రయత్నం చేపట్టినా విఫలం అయ్యే అవకాశం ఉంటుంది. ప్రయాణాల్లో విలువైన వస్తువులు, పత్రాలు కోల్పోయే అవకాశం ఉంది. అనవసర పరిచయాల వల్ల ఇబ్బంది పడతారు. కొందరు బంధుమిత్రుల వల్ల ఆర్థికంగా బాగా నష్టపోయే అవకాశం ఉంది. ఉద్యోగంలో పని భారం పెరుగుతుంది. వృత్తి, వ్యాపారాలు చాలావరకు మందకొడిగా సాగుతాయి.
- కుంభం: ఈ రాశికి వ్యయ స్థానంలో శుక్ర సంచారం వల్ల అనవసర ఖర్చులు పెరుగుతాయి. కుటుంబంలో సుఖ సంతోషాలు తగ్గుతాయి. అనుకున్న పనులేవీ ఒక పట్టాన పూర్తి కాక ఇబ్బంది పడతారు. వ్యయ ప్రయాసలు ఎక్కువగా ఉంటాయి. అనారోగ్యాలకు గురయ్యే అవకాశం ఉంది. అనవసర ప్రయాణాలు చేయవలసి వస్తుంది. ఉద్యోగంలో సహచరుల నుంచి ఇబ్బందులు ఎదురవుతాయి. జీవిత భాగస్వామి దూర ప్రాంతానికి బదిలీ కావడం జరుగుతుంది. ఆదాయం బాగా తగ్గుతుంది.