ప్రేమ, రొమాన్స్ వంటి విషయాలకు కారకుడైన శుక్ర గ్రహం ప్రస్తుతం ద్విస్వభావ రాశి అయిన మిధునంలో సంచరిస్తున్నందువల్ల కొన్ని రాశుల వారు ప్రేమలో పడే అవకాశం కనిపిస్తోంది. వృషభం, మిధునం, సింహం, తుల, ధనస్సు, కుంభ రాశులకు ఇది వర్తిస్తుంది. సాధారణంగా శుక్రుడు మిధున రాశిలో సంచారం చేస్తున్నప్పుడు ప్రేమ వ్యవహారాలలో దిగేపక్షంలో అది తప్పకుండా పెళ్లికి దారి తీయడం జరుగుతుంది. అందువల్ల తెలిసో, తెలియకో ప్రేమలో పడేవారు ఆచితూచి అడుగు వేయడం మంచిది. శుక్ర గ్రహం తన ప్రాణ స్నేహితుడైన బుధుడి రాశిలో సంచరించడం యువతి యువకుల్లో తప్పకుండా ప్రేమ భావాలను రేకెత్తిస్తుంది. ప్రేమ పరంగా ఒక విధమైన రహస్య జీవితానికి అవకాశం కల్పిస్తుంది. ఇప్పుడు ప్రేమలో పడ్డవారు అతి త్వరలో మూడు ముళ్ళు వేయడానికి అవకాశం ఉంది. ఇది యువతి యువకులు ఇద్దరికీ వర్తిస్తుంది.
వృషభ రాశి: ఈ రాశి వారికి ద్వితీయ స్థానంలో అంటే కుటుంబ స్థానంలో శుక్రుడు సంచరించడం వల్ల తప్పకుండా ప్రేమలో పడే అవకాశం ఉంది. సాధారణంగా బాగా పరిచయస్తులతో లేదా బంధు వర్గానికి చెందిన వారితో ప్రేమతో పడే సూచనలు ఉన్నాయి. ఈ ప్రేమకు భవిష్యత్తులో కుటుంబం నుంచి ఆమోదం లభించే అవకాశం కూడా ఉంది. ఈ ప్రేమ విజయవంతం అయ్యే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి.
మిథున రాశి: ఈ రాశిలో శుక్ర గ్రహ సంచారం వల్ల తప్పకుండా ప్రేమ బీజాలు నాటుకునే అవకాశం ఉంది. ఉద్యో గంలో సహచరురాలు లేదా తోటి విద్యార్థితో ప్రేమతో పడే సూచనలు కనిపిస్తున్నాయి. ప్రేమ వ్యవహారాలలో కొద్దిపాటి ఆటంకాలు అవరో ధాలు ఎదురు కావచ్చు. అయితే, చివరికి ఈ ప్రేమ తప్పకుండా విజయం సాధిస్తుంది. సాధారణంగా కులాంతర లేదా మతాంతర ప్రేమ వ్యవహారం అయ్యే అవకాశం ఉంది. స్నేహంగా ప్రారంభం అయిన పరిచయం ప్రేమకు దారి తీయడం జరుగుతుంది.
సింహ రాశి: ఈ రాశి వారికి 11వ స్థానంలో శుక్ర సంచారం వల్ల లవ్ అట్ ఫస్ట్ సైట్ అయ్యే అవకాశం ఉంది. బహుశా ఈ ప్రేమ భాగస్వామి ఇరుగుపొరుగున ఉండే అవకాశం ఉంది. కులాంతర ప్రేమకు ఎక్కువ అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ ప్రేమ వ్యవహారం మున్ముందు కొద్ది సమస్యలతో కూడు కొని ఉండవచ్చు. పెద్దల నుంచి అభ్యంతరాలు వ్యక్తం కావచ్చు. చివరికి సాంప్రదాయబద్ధంగానే పెళ్లి జరిగే అవకాశం ఉంది. ఏ విషయంలోనూ తొందరపాటుతనంతో వ్యవహరించకపోవడం మంచిది.
తులా రాశి: ఈ రాశి వారికి భాగ్య స్థానంలో శుక్ర సంచారం వల్ల దూర ప్రాంతంలో ఉన్న వారితో ప్రేమలో పడే అవకాశం ఉంటుంది. సాధారణంగా ఉద్యోగం, లేదా వృత్తిపరంగా సంపర్కం ఏర్పడే సూచనలు ఉన్నాయి. ఈ ప్రేమ జీవితానికి పెద్దల నుంచి గానీ, ఇతరత్రా గానీ అభ్యంతరాలు ఉండక పోవచ్చు. ఈ ప్రేమ జీవితంలో మధ్య మధ్య ఈగో సమస్యలు తలెత్తడానికి అవకాశం ఉంది. అపార్థాలు కూడా తలెత్తవచ్చు. అయితే, ప్రేమ బంధం మరింత పటిష్టంగా ముందుకు సాగే అవకాశమే కనిపిస్తోంది. ప్రేమ వ్యవహారంలో తప్పకుండా విజయం సాధిస్తారు.
ధను రాశి: ఈ రాశి వారికి సప్తమ స్థానంలో అంటే వివాహ స్థానంలో శుక్ర సంచారం వల్ల ఇప్పుడు ప్రేమ జీవితం ప్రారంభమయ్యే అవకాశం ఉంది. ఇది అతి త్వరలో పెళ్లికి దారి తీసే సూచనలు కూడా ఉన్నాయి. సాధారణంగా ప్రయాణాలలో పరిచయాలు ఏర్పడి ప్రేమకు దారి తీసే అవకాశం ఉంది. ప్రేమ భాగస్వామి సంపన్న కుటుంబానికి చెందిన వ్యక్తి అయి ఉండవచ్చు. ప్రేమ జీవితం చాలా వరకు సాఫీగా సాగిపోతుంది. ఎక్కువగా విహారయాత్రలు కూడా చేయటానికి అవకాశం ఉంది.
కుంభ రాశి: ఈ రాశి వారికి పంచమ స్థానంలో అంటే ఆలోచన స్థానంలో శుక్రుడు వంటి రొమాంటిక్ గ్రహం సంచరించడం తప్పకుండా ప్రేమ జీవితానికి నాంది పలుకుతుంది. స్నేహితులకు సంబంధిం చిన వ్యక్తితో ప్రేమాయణం ప్రారంభం కావచ్చు. పెద్దలనుంచి తీవ్రంగా అభ్యంతరాలు వ్యక్తం అవుతున్నప్పటికీ ఈ ప్రేమ కథ చివరికి సుఖాంతం అయ్యే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి. కులాంతర లేదా మతాంతర ప్రేమ అయ్యే అవకాశం లేకపోలేదు. పెళ్లి మాత్రం సాంప్రదాయబద్ధంగానే జరిగే సూచనలు ఉన్నాయి. కొద్దిగా ఓర్పు, సహనాలతో వ్యవహరిస్తే విజయం తప్పకుండా వరిస్తుంది.
Note: (ఇక్కడ ఇచ్చిన సమాచారం నమ్మకం మీద ఆధారపడి ఉంటుంది.. దీనికి శాస్త్రీయ ఆధారాలు లేవు. మనుషుల ఆసక్తిని నమ్మకాన్ని దృష్టిలో ఉంచుకుని ఇక్కడ అందించాం).
మరిన్ని జ్యోతిష్య వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..