Telugu News Astrology Shukra Moudhyami 2025: Rajayogam and Wealth for 6 Zodiac Signs Telugu Astrology
Raja Yoga: శుక్ర మూఢమితో ఆ రాశుల వారికి రాజ యోగాలు, ధన యోగాలు ఖాయం..!
డిసెంబర్ 8 నుంచి ఫిబ్రవరి 6 వరకు శుక్ర మౌఢ్యమి కొనసాగుతుంది. సాధారణంగా శుభ కార్యాలకు ఇది పనికిరాదు. అయితే, ఈ మూఢమి వృషభం, సింహం, తుల, మకరం, కుంభం, మీన రాశులకు శుభ యోగాలను, రాజయోగాలను ప్రసాదిస్తుంది. వీరికి ఆర్థికాభివృద్ధి, అనూహ్య ధన లాభాలు, ఉద్యోగ, వ్యాపారాల్లో విజయాలు కలుగుతాయి. ఈ రాశుల వారికి సంపద, సౌభాగ్యాలు వృద్ధి చెందుతాయి.
డిసెంబర్ 8 నుంచి ఫిబ్రవరి 6 వరకు శుక్ర మౌఢ్యమి లేదా శుక్ర మూఢమి చోటు చేసుకుంటోంది. రవి గ్రహానికి శుక్ర గ్రహం బాగా దగ్గరగా వెళ్లినప్పుడు శుక్రుడు బలహీనపడడం వల్ల మూఢమి ఏర్పడుతుంది. ప్రస్తుతం శుక్ర, రవులు వృశ్చిక రాశిలో కలుసుకుంటున్నాయి. శృంగారానికి, పెళ్లిళ్లకు, ప్రేమలకు కారకుడైన శుక్రుడు తన శక్తిని కోల్పోయే పక్షంలో ఈ అంశాలన్నీ పూర్తిగా దెబ్బతినడం జరుగుతుంది. అందువల్ల శుక్ర మూఢమి సమయంలో సాధారణంగా శుభ కార్యాలు చేసే అవకాశం ఉండదు. అయితే, ప్రస్తుత మూఢమి వల్ల వృషభం, సింహం, తుల, మకరం, కుంభం, మీన రాశుల వారికి శుక్ర మూఢమిలోనూ శుభ యోగాలు కలుగుతాయి. రాజ యోగాలతో పాటు ధన యోగాలు పొందడం జరుగుతుంది.
వృషభం: ఈ రాశివారికి శుక్ర, రవులు కలవడమనేది యోగదాయకం అవుతుంది. వీరికి తప్పకుండా రాజయోగాలు కలుగుతాయి. ప్రధానంగా ఆర్థికాభివృద్ధికి ఈ మూఢమి బాగా దోహదం చేస్తుంది. వృత్తి, వ్యాపారాలు లాభాలపరంగా దూసుకుపోతాయి.. ఉద్యోగంలో అంచనాలకు మించి ఆదాయం పెరుగుతుంది. ఏ రంగంలో ఉన్నవారికైనా ఆర్థికంగా బలం ఏర్పడి, జీవితం సుఖ సంతోషాలతో సాగిపోతుంది. గృహ, వాహన సౌకర్యాలు ఏర్పడతాయి. సంపద, సౌభాగ్యాలు వృద్ధి చెందుతాయి.
సింహం: ఈ రాశికి చతుర్థ స్థానంలో ఏర్పడుతున్న శుక్ర మూఢవి వల్ల ఉద్యోగంలో హోదా పెరుగుతుంది. వృత్తి, వ్యాపారాల్లో రాబడి అంచనాలను మించుతుంది. ఆస్తి వివాదాలు అనుకూలంగా పరిష్కారం అవుతాయి. ధన యోగాలతో కూడిన రాజయోగం పడుతుంది. ఎటువంటి ఆర్థిక ప్రయత్నమైనా కలిసి వస్తుంది. షేర్లు, ఆర్థిక లావాదేవీలు బాగా లాభిస్తాయి. ప్రముఖులతో పరిచయాలు విస్తరిస్తాయి. నిరుద్యోగులకు కలలో కూడా ఊహించని మంచి ఆఫర్లు అందుతాయి. గృహ యోగం పడుతుంది.
తుల: ఈ రాశికి ధన స్థానంలో శుక్రుడితో రవి కలుస్తున్నందువల్ల దాదాపు పట్టిందల్లా బంగారం అవుతుంది. గ్రహచారంలో ఎటువంటి దోషాలున్నా మటుమాయం అవుతాయి. ఏ ప్రయత్నం తలపెట్టినా విజయవంతం అవుతుంది. వ్యక్తిగత సమస్యల నుంచి చాలావరకు విముక్తి లభిస్తుంది. వారసత్వ సంపద సమకూరుతుంది. ఉద్యోగంలో భారీ జీతభత్యాలతో పాటు ఆశించిన పదోన్నతి రావడానికి అవకాశముంది. వృత్తి, వ్యాపారాల్లో అంచనాలకు మించిన లాభాలు గడించడం జరుగుతుంది.
మకరం: ఈ రాశికి లాభ స్థానంలో శుక్ర మూఢమి ఏర్పడుతున్నందు వల్ల ఈ రాశివారికి రెండు నెలల పాటు యోగదాయకంగా ఉంటుంది. ఒకటికి రెండుసార్లు ధన యోగాలు కలుగుతాయి. ఏదో విధంగా ఆదాయం పెరిగే అవకాశం ఉంది. కొద్ది ప్రయత్నంతో సగటు వ్యక్తి సైతం సంపన్నుడవుతాడు. ఉద్యోగ స్థిరత్వానికి, ఆర్థిక స్థిరత్వానికి అవకాశముంది. కొందరితో లాభదాయక పరిచయాలు ఏర్పడతాయి. గృహ, వాహన యోగాలు కలుగుతాయి. వృత్తి, వ్యాపారాల్లో డిమాండ్ పెరుగుతుంది.
కుంభం: ఈ రాశికి దశమ స్థానంలో శుక్ర మూఢమి ఏర్పడుతున్నందువల్ల రాజయోగాలు కలుగుతాయి. శుక్ర, రవులు రాజయోగ గ్రహాలు. అందువల్ల ఈ రాశివారికి శుక్ర మూఢమి యోగదాయకంగా మారుతుంది. సిరిసంపదలు బాగా వృద్ధి చెందుతాయి. ఆర్థిక ప్రయత్నాలన్నీ విజయవంతమవుతాయి. ఉద్యోగ జీవితం పదోన్నతులు, భారీ జీత భత్యాలతో కొత్త పుంతలు తొక్కుతుంది. వృత్తి, వ్యాపారాల్లో అంచనాలకు మించి లాభాలు పెరుగుతాయి. నిరుద్యోగులకు విదేశీ ఆఫర్లు అందుతాయి.
మీనం: ఈ రాశికి భాగ్య స్థానంలో ఏర్పడుతున్న శుక్ర మూఢమి వల్ల ఊహించని అదృష్టం పట్టే అవకాశముంది. అనేక మార్గాల్లో ఆదాయం ఇబ్బడిముబ్బడిగా పెరుగుతుంది. ఆకస్మిక ధన లాభానికి కూడా అవకాశముంది. వృత్తి, వ్యాపారాలు లాభాల బాటపడతాయి. ఆస్తి వివాదాలు అనుకూలంగా పరిష్కారమవుతాయి. ఆస్తి విలువ పెరుగుతుంది. ఉద్యోగంలో అధికార యోగం పడుతుంది. నిరుద్యోగులకు విదేశీ అఫర్లు అంది వస్తాయి. ఆరోగ్య సమస్యల నుంచి ఊరట లభిస్తుంది.