Shani Dev: శని దేవుని బాధితులకు త్వరలో ఊరట.. ! వారికి ఆకస్మిక ధన లాభానికి అవకాశం..

| Edited By: Janardhan Veluru

Oct 23, 2023 | 6:53 PM

శని గ్రహం వక్రగతి నుంచి బయటపడి సరైన మార్గంలో ప్రయాణించడం ప్రారంభం అవుతుంది. ఇంతవరకూ శని వక్రగతి వల్ల జీవితంలో స్తబ్ధత ఏర్పడి, ఏ పనీ పూర్తి కాకుండా ఆగిపోయి ఇబ్బంది పడుతున్నవారికి ఎంతగానో ఊరట లభిస్తుంది. జీవితం మళ్లీ వేగం పుంజుకుంటుంది. పని భారం తగ్గడం, అదనపు బాధ్యతల నుంచి విముక్తి పొందడం..

Shani Dev: శని దేవుని బాధితులకు త్వరలో ఊరట.. ! వారికి ఆకస్మిక ధన లాభానికి అవకాశం..
Lord Shani
Follow us on

గత జూన్ 18న తన స్వక్షేత్రమైన కుంభరాశిలో వక్రగతి ప్రారంభించిన శనీశ్వరుడు నవంబర్ 5న వక్ర త్యాగం చేయబోతున్నాడు. వక్రగతి నుంచి బయటపడి సరైన మార్గంలో ప్రయాణించడం ప్రారంభం అవుతుంది. ఇంతవరకూ శని వక్రగతి వల్ల జీవితంలో స్తబ్ధత ఏర్పడి, ఏ పనీ పూర్తి కాకుండా ఆగిపోయి ఇబ్బంది పడుతున్నవారికి ఎంతగానో ఊరట లభిస్తుంది. జీవితం మళ్లీ వేగం పుంజుకుంటుంది. పని భారం తగ్గడం, అదనపు బాధ్యతల నుంచి విముక్తి పొందడం, పురోగతి వేగం పుంజుకోవడం వంటివి జరుగుతాయి. శని రుజువర్తన ఏ రాశివారికి ఏ విధంగా ఉండ బోయేదీ పరిశీలిద్దాం.

  1. మేషం: ఈ రాశివారికి లాభ స్థానంలో ఉన్న శని వక్రించడం వల్ల జీవితం స్తంభించిపోయి ఉంటుంది. అధికార యోగం పట్టడం, ప్రమోషన్ రావడం, ఆదాయం పెరగడం, ఆర్థిక పరిస్థితి మెరుగుపడడం, సంతానయోగం కలగడం వంటివి జరగాల్సి ఉంది. శని వక్ర గతి కారణంగా ఆగిపోయిన ఈ పరిణామాలన్నీ నవంబర్ 5వ తేదీ నుంచి చోటు చేసుకోవడం మొదలవుతుంది. ఆకస్మిక ధన లాభానికి అవకాశం ఉంటుంది. వృత్తి, వ్యాపార, ఉద్యోగాల్లో తీరిక లేని పరిస్థితి ఏర్పడుతుంది.
  2. వృషభం: ఈ రాశివారికి దశమ స్థానంలో వక్రగతిలో ఉన్నశనీశ్వరుడి వల్ల ఇప్పటి వరకు పనిభారం పెరగడం, బరువు బాధ్యతలు మీద పడడం, ఇతరుల బాధ్యతలు కూడా మోయాల్సి రావడం వంటివి జరుగుతూ వచ్చాయి. ఇక ఆ భారాలన్నీ తగ్గిపోయే అవకాశం ఉంది. అనుకూలమైన ఉద్యోగంలోకి మారే అవకాశం కూడా ఉంటుంది. వృత్తి, ఉద్యోగాల్లో ప్రాధాన్యం బాగా పెరుగుతుంది. సామాజికంగా కూడా కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. నిరుద్యోగులకు మంచి ఉద్యోగం లభిస్తుంది.
  3. మిథునం: ఈ రాశివారికి భాగ్య స్థానంలో శనీశ్వరుడు వక్రించడం వల్ల కృషి ఫలితం ఒకపట్టాన చేతికి అందని పరిస్థితి ఉంటుంది. శనీశ్వరుడు వక్ర త్యాగం చేసిన తర్వాత నుంచి జీవితంలో మళ్లీ వేగం పెరుగు తుంది. ఆగిపోయిన పనులన్నీ పూర్తవుతాయి. ముఖ్యమైన వ్యవహారాలను తేలికగా ముగించడం జరుగుతుంది. విదేశీయానానికి మార్గం సుగమం అవుతుంది. విదేశాల నుంచి వృత్తి, ఉద్యోగాల పరంగా శుభవార్తలు వింటారు. వృత్తి, ఉద్యోగాల్లో సానుకూల మార్పులు చోటు చేసుకుంటాయి.
  4. కర్కాటకం: ఈ రాశివారికి అష్టమంలో ఉన్న శనీశ్వరుడు వక్రించడం వల్ల వృత్తి, ఉద్యోగాల్లో విపరీతమైన భారం పెరిగే అవకాశం ఉంటుంది. ఉద్యోగం ఉంటుందా, పోతుందా అన్న పరిస్థితి ఏర్పడుతుంది. ప్రస్తుతం శనీశ్వరుడు వక్ర త్యాగం చేస్తున్నందువల్ల కొద్దిగా ఊరట లభించే అవకాశం ఉంది. పని భారం ఉన్నప్పటికీ తగిన ప్రతిఫలం ఉంటుంది. సతీమణికి సమయం అనుకూలంగా మారుతుంది. వృత్తి, ఉద్యోగాల్లో ఆశించిన పురోగతి ఉంటుంది. నిరుద్యోగులకు సొంత ఊర్లోనే ఉద్యోగం లభిస్తుంది.
  5. సింహం: ఈ రాశివారికి సప్తమ స్థానంలో శనీశ్వరుడు వక్రించడం వల్ల పని భారంతో పాటు, అనవసర ఖర్చులకు, అనవసర పరిచయాలకు, స్వల్ప అనారోగ్యాలకు ఎక్కువ అవకాశం ఉంటుంది. శని వక్ర త్యాగంతో వాటన్నిటి నుంచి విముక్తి లభిస్తుంది. రాజకీయ ప్రవేశం చేసే అవకాశం ఉంటుంది. ఉన్నత స్థాయి వ్యక్తులతో లాభదాయక పరిచయాలు ఏర్పడతాయి. రియల్టర్లకు లాభాలు పెరుగుతాయి. వృత్తి, వ్యాపారాలు ఒక్కసారిగా ఊపందుకుంటాయి. పేరు ప్రతిష్టలు పెరుగుతాయి.
  6. కన్య: ఈ రాశికి ఆరవ స్థానంలో ఉన్న శని వక్రగతి నుంచి బయటకు రావడం వల్ల ఈ రాశివారికి అనేక శుభ ఫలితాలు అనుభవానికి రాబోతున్నాయి. ముఖ్యంగా వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో సాను కూల మార్పులు చోటు చేసుకుంటాయి. శత్రు, రోగ, రుణ సమస్యల నుంచి చాలావరకు విముక్తి లభిస్తుంది. కుటుంబ సభ్యులు అభివృద్ధి చెందుతారు. శుభ కార్యాలు జరుగుతాయి. సతీమణికి అదృష్టం పడుతుంది. ఆదాయం బాగా పెరుగుతుంది. ఆర్థికంగా ఆశించిన స్థిరత్వం లభిస్తుంది.
  7. తుల: ఈ రాశివారికి శని వక్రించడం వల్ల వృత్తి, ఉద్యోగాలపరంగానే కాకుండా కుటుంబపరంగా కూడా కొన్ని తప్పటడుగులు వేయడం జరిగింది. ఈ పరిస్థితిలో మార్పు వస్తుంది. శని వక్ర త్యాగం వల్ల ఏ పని తలపెట్టినా, ఏ ప్రయత్నం చేపట్టినా కలిసి వస్తుంది. వృత్తి, ఉద్యోగాల్లో ఆదాయం పెరుగు తుంది. వ్యాపారాలు అంచనాలకు మించి అభివృద్ధి చెందుతాయి. పిల్లలు ఆశించిన స్థాయిలో పురోగతి సాధిస్తారు. మీ ఆలోచనలు, నిర్ణయాలు సత్ఫలితాలనిస్తాయి. ఉద్యోగంలో తిరుగుండదు.
  8. వృశ్చికం: ఈ రాశివారికి అర్ధాష్టమ శని జరుగుతున్నందువల్ల శని వక్రగతికి, వక్ర త్యాగానికి తేడా ఉండకపో వచ్చు. ఇంటా బయటా కొద్దిగా ఒత్తిడి తగ్గే అవకాశం ఉంటుంది. గృహ నిర్మాణం పనులలో వేగం పెరుగుతుంది. కుటుంబ వ్యవహారాల పట్ల శ్రద్ధ పెరుగుతుంది. పిల్లలు చదువులు లేదా ఉద్యోగ కారణంగా దూర ప్రాంతాలకు వెళ్లవలసి వస్తుంది. ఉద్యోగంలో కొన్ని మార్పులు చోటు చేసు కుంటాయి. వృత్తి, వ్యాపారాలలో లాభాలు పెరగడం ప్రారంభిస్తాయి. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది.
  9. ధనుస్సు: ఈ రాశివారికి తృతీయ స్థానంలో ఉన్న శనీశ్వరుడి వల్ల ఆర్థిక లాభాలు ఎక్కువగా ఉంటాయి. నిజానికి వక్రగతిలోనే ప్రయోజనాలు ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది. వృత్తి, ఉద్యోగ, వ్యాపా రాల్లో మంచి అభివృద్ధి ఉంటుంది. వ్యాపారంలో కొత్త ఆలోచనలు ప్రవేశపెడతారు. నిరుద్యోగులకు విదేశాల నుంచి కూడా ఆఫర్లు అందుతాయి. ఆస్తి వివాదాలు సానుకూలంగా పరిష్కారం అవు తాయి. తండ్రి నుంచి సహాయ సహకారాలు అందుతాయి. ప్రయాణాల వల్ల బాగా లాభం ఉంటుంది.
  10. మకరం: ఈ రాశికి అధిపతి అయిన శని ధన స్థానంలో వక్రించడం వల్ల వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో పని భారం పెరగడం, బరువు బాధ్యతలు మోయాల్సి రావడం, అదనపు బాధ్యతలు మీద పడడం వంటివి జరిగే అవకాశం ఉంది. అంతేకాక, ఆశించిన స్థాయిలో ఆర్థిక ప్రయోజనాలు సిద్ధించే అవకాశం ఉండదు. త్వరలో శని వక్ర త్యాగం వల్ల ఈ పరిస్థితుల నుంచి చాలావరకు విముక్తి లభిస్తుంది. మంచి గుర్తింపు లభిస్తుంది. కష్టానికి తగ్గట్టుగా దక్కవలసిన ప్రతిఫలమంతా దక్కుతుంది.
  11. కుంభం: ఈ రాశినాథుడైన శనీశ్వరుడు వక్రించడం వల్ల ‘తానొకటి తలచిన దైవమొకటి తలచును’ అన్న ట్టుగా జీవితం సాగిపోయి ఉంటుంది. ఏ ప్రయత్నమూ పూర్తి స్థాయిలో కలిసి రాక, నిరాశా నిస్పృ హలకు లోనవడం కూడా జరిగి ఉంటుంది. ఇప్పుడు ఆ పరిస్థితుల్లో ఆశించినంతగా మార్పు వస్తుంది. అయితే, ఏలిన్నాటి శని ప్రభావం మాత్రం కొనసాగుతుంది. వృత్తి, ఉద్యోగాల్లో అధికారులు అతిగా ఉపయోగించుకోవడం జరుగుతుంది. శ్రమ ఎక్కువ, ఫలితం తక్కువ అన్నట్టుగా ఉంటుంది.
  12. మీనం: ఈ రాశివారికి పన్నెండవ స్థానంలో ఉన్న శని వక్రగతి వల్ల అనుభవానికి వచ్చిన అనేక శుభ ఫలితాలు వక్ర త్యాగంతో బాగా తగ్గే అవకాశం ఉంది. కష్టార్జితంలో ఎక్కువ భాగం వృథా అవుతూ ఉంటుంది. వైద్య ఖర్చులు పెరిగే సూచనలున్నాయి. రహస్య శత్రువుల వల్ల వృత్తి, ఉద్యోగాల్లో నష్టపోయే అవకాశం ఉంటుంది. విదేశీ ప్రయాణాలకు ఎక్కువగా అవకాశం ఉంది. ఆస్తిపాస్తులకు సంబంధించిన వివాదాలు ఇబ్బంది కలిగిస్తాయి. ఆధ్యాత్మిక చింతన అనుకూలంగా ఉంటుంది.