
November 2025 Horoscope
November 2025 Astrology: గ్రహాలు రాశులు మారడంతో కొన్ని రాశుల వారి జీవితాలు మంచి మలుపు తిరిగే అవకాశం ఉంటుంది. ఆదాయం వృద్ధి చెందడం, ఉద్యోగంలో పదోన్నతులు కలగడం, జీతభత్యాలు పెరగడం, వృత్తి, వ్యాపారాల్లో యాక్టివిటీ పెరగడం వంటివి జరిగే అవకాశం ఉంటుంది. నవంబర్ నెలలో కొన్ని గ్రహాలు రాశులు మారుతున్నందువల్ల అటువంటి ఫలితాలే కలిగే అవకాశం ఉంది. నవంబర్ నెలలో గురువు ఉచ్ఛస్థితి, శని వక్ర స్థితి కొనసాగడంతో పాటు శుక్ర, కుజులు స్వక్షేత్రాల్లో సంచారం చేయడం, రవి తన నీచ స్థితి నుంచి బయటపడి నవంబర్ 16న తన మిత్రక్షేత్రమైన వృశ్చిక రాశిలోకి ప్రవేశించడం జరుగుతోంది. దీనివల్ల మేషం, మిథునం, కర్కాటకం, కన్య, తుల, మకర రాశులవారు విశేషంగా లబ్ధి పొందడం జరుగుతుంది.
- మేషం: ఈ రాశికి చతుర్థ స్థానంలో గురువు ఉచ్ఛపడుతున్నందువల్ల ఏలిన్నాటి శని దోషం నుంచి పూర్తిగా విముక్తి లభిస్తుంది. రాశ్యధిపతి కుజుడు స్వస్థానంలో సంచారం చేయడం వల్ల ఉద్యోగంలో పదోన్నతులు కలగడం, ఈ రాశివారి సారథ్యంలో ఉన్న సంస్థలు పురోగతి చెందడం, ప్రముఖులతో పరిచయాలు ఏర్పడడం, ఆరోగ్యం కుదుటపడడం వంటివి తప్పకుండా జరుగుతాయి. ఉద్యోగులకు ఆశించిన ఉద్యోగం లభిస్తుంది. సంపన్న కుటుంబంతో పెళ్లి సంబంధం కుదురుతుంది.
- మిథునం: ఈ రాశికి ధన స్థానంలో గురువు ఉచ్ఛపట్టడం, శుక్ర, కుజులు అనుకూలంగా మారడం వల్ల ఆదాయం అనేక విధాలుగా వృద్ధిచెంది, ఆర్థిక, వ్యక్తిగత సమస్యలన్నీ పరిష్కారమవుతాయి. కుటుంబంలో శుభ కార్యాలు జరగడానికి ఆస్కారముంది. ఉద్యోగంలో పదోన్నతులు కలుగుతాయి. జీత భత్యాలు బాగా పెరుగుతాయి. వృత్తి, ఉద్యోగాలరీత్యా ఇతర దేశాలకు వెళ్లే అవకాశం కలుగుతుంది. ఉద్యోగులు, నిరుద్యోగులకు విదేశీ ఆఫర్లు అందుతాయి. మంచి పెళ్లి సంబంధం కుదురుతుంది.
- కర్కాటకం: ఈ రాశికి శుక్ర, గురు, బుద, కుజ, రవి గ్రహాలు బాగా అనుకూలంగా మారడం వల్ల నవంబర్ నెలంతా వీరికి జీవితం నల్లేరు మీద బండిలా సాగిపోతుంది. మనసులోని కోరికలు చాలావరకు నెరవేరుతాయి. సొంత ఇంటి ప్రయత్నాలు ఫలిస్తాయి. నిరుద్యోగులకు విదేశాల నుంచి కూడా ఆఫర్లు అందుతాయి. బంధువర్గంలో ఆశించిన పెళ్లి సంబంధం కుదురుతుంది. ఉద్యోగంలో పదోన్న తులు కలుగుతాయి. వృత్తి, వ్యాపారాల్లో యాక్టివిటీ బాగా పెరుగుతుంది. ఆదాయానికి లోటుండదు.
- కన్య: రాశ్యధిపతి బుధుడితో పాటు, కుజ, శుక్ర, గురు గ్రహాల అనుకూలత పెరుగుతున్నందువల్ల ఈ రాశివారికి పట్టిందల్లా బంగారం అవుతుంది. కొద్ది ప్రయత్నంతో ఆదాయం బాగా వృద్ధి చెందు తుంది. రావలసిన సొమ్ము చేతికి వస్తుంది. బాకీలు, బకాయిలు వసూలవుతాయి. ఉద్యోగ, పెళ్లి ప్రయత్నాల్లో శుభవార్తలు అందుతాయి. ఇంట్లో శుభ కార్యాలు జరగడానికి అవకాశం ఉంది. విహార యాత్రలకు, విదేశీ ప్రయాణాలకు ఎక్కువగా అవకాశం ఉంది. భూలాభం కలుగుతుంది.
- తుల: రాశ్యధిపతి శుక్రుడు స్వస్థానంలో ప్రవేశించడం, ధనాధిపతి కుజుడు ధన స్థానంలో, దశమ స్థానంలో ఉచ్ఛ గురువు సంచారం వంటి కారణాల వల్ల ఈ రాశివారి జీవితం నవంబర్ నెలంతా నిత్య కల్యాణం పచ్చతోరణంలా సాగిపోతుంది. ఒక ప్రముఖుడుగా గుర్తింపు లభిస్తుంది. ఆరోగ్యం మెరుగ్గా ఉంటుంది. అనేక మార్గాల్లో ఆదాయం వృద్ధి చెందుతుంది. ఉద్యోగంలో అధికార యోగం పడుతుంది. ఉద్యోగులు, నిరుద్యోగులకు విదేశీ ఆఫర్లు అందుతాయి. శుభవార్తలు ఎక్కువగా వింటారు.
- మకరం: ఈ రాశికి గ్రహాల మార్పుతో సప్తమ, దశమ, లాభ స్థానాలు బాగా బలపడుతున్నందు వల్ల పట్టిందల్లా బంగారం అవుతుంది. ఉన్నత స్థాయి కుటుంబంతో పెళ్లి సంబంధం కుదురుతుంది. ప్రేమ వ్యవహారాలు పెళ్లికి దారితీస్తాయి. ఉద్యోగంలో పదోన్నతులు కలుగుతాయి. జీతభత్యాలు బాగా పెరుగుతాయి. నిరుద్యోగులకు ఆశించిన ఆఫర్లు అందుతాయి. ప్రముఖులతో పరిచయాలు వృద్ధి చెందుతాయి. ఉద్యోగులకు డిమాండ్ పెరుగుతుంది. ఆదాయం దినదినాభివృద్ధి చెందుతుంది.