Zodiac Signs: బుధుడు వక్రగతిలో సంచారం.. ఆ రాశుల వారికి ఉద్యోగ జీవితంలో ఆకస్మిక మార్పులు!
ఈ నెల 22వ తేదీ నుంచి మే నెల 15వ తేదీ వరకు మేషరాశిలో బుధుడు వక్రగతిలో సంచారం చేయడం జరుగుతుంది. బుద్ధి కారకుడు అయిన బుధ గ్రహం సూర్య గ్రహానికి దూరంగా వెళ్ళిన ప్పుడు ఈ రకమైన వక్రగతి ప్రారంభం అవుతుంది. ఈ వక్రగతి వల్ల బుధ గ్రహంలో వేగం పెరుగుతుంది.
ఈ నెల 22వ తేదీ నుంచి మే నెల 15వ తేదీ వరకు మేషరాశిలో బుధుడు వక్రగతిలో సంచారం చేయడం జరుగుతుంది. బుద్ధి కారకుడు అయిన బుధ గ్రహం సూర్య గ్రహానికి దూరంగా వెళ్ళిన ప్పుడు ఈ రకమైన వక్రగతి ప్రారంభం అవుతుంది. ఈ వక్రగతి వల్ల బుధ గ్రహంలో వేగం పెరుగుతుంది. స్వతంత్రంగా వ్యవహరించడం ప్రారంభం అవుతుంది. ఈ గ్రహానికి కొత్తగా సూక్ష్మ బుద్ధి అనే లక్షణం తోడవుతుంది. దీనివల్ల మేషం, మిధునం, కర్కాటకం, తుల, ధనస్సు రాశుల వారికి చాలా వరకు మేలు జరుగుతుంది. మిగిలిన రాశుల వారికి దానివల్ల ప్రత్యేకంగా మేలు జరిగే అవకాశం లేదనే చెప్పవచ్చు.
మేష రాశి: ఈ రాశిలో వక్ర బుధుడు సంచరిస్తున్నందువల్ల ఉద్యోగ జీవితంలో అకస్మాత్తుగా మార్పులు చోటు చేసుకోవడం, ఏమాత్రం ఊహించని విధంగా దూరప్రాంతం నుంచి లేదా విదేశాల నుంచి మంచి కబురు అందడం, అనారోగ్యం నుంచి అప్రయత్నంగా కోల్పోవడం వంటివి తప్పకుండా జరిగే అవకాశం ఉంది. ఇతర కంపెనీ నుంచి మంచి హోదా లేదా అధికారంతో ఆఫర్లు అందవచ్చు. అనుకోకుండా ప్రయాణాలు చోటు చేసుకోవచ్చు. తప్పనిసరిగా శుభపరిణామాలు చోటు చేసుకుంటాయి. శుభవార్తలు అందుతాయి. వీసా సమస్యలు పరిష్కారం అవుతాయి. ముఖ్యంగా చాలాకాలంగా ఇబ్బంది పెడుతున్న వ్యక్తిగత సమస్యలు వాటంతవే పరిష్కారమయ్యే అవకాశం కూడా ఉంది.
మిథున రాశి: ఈ రాశికి అధిపతి అయిన బుధుడు లాభ స్థానంలో వక్రించడం ఆదాయపరంగా ఒక శుభయోగంగా చెప్పుకోవచ్చు. ఆశించని విధంగా అకస్మాత్తుగా ఆదాయం పెరగటం, ఆర్థిక పరిస్థితిలో స్థిరత్వం ఏర్పడటం, లాటరీ తగలటం, ఉద్యోగ జీవితంలో పురోగతి చెందడం, మంచి ఉద్యోగంలోకి మారటం వంటివి తప్పకుండా చోటు చేసుకుంటాయి. శత్రువులే మిత్రులుగా మారే అవకాశం ఉంది. ఇంతవరకు ఇష్టానుసారం విమర్శలు చేసినవారు మెచ్చుకోవడం ప్రారంభిస్తారు. ఆర్థిక పరిస్థితి మెరుగుపడి, రుణ సమస్యల నుంచి విముక్తి లభిస్తుంది. నిరుద్యోగులు శుభ వార్త వింటారు. ఆలోచనలు, నిర్ణయాలు, ప్రయత్నాలు మంచి ఫలితాలను ఇస్తాయి.
కర్కాటక రాశి: ఈ రాశి వారికి ఉద్యోగ స్థానంలో బుధుడు వక్రించడం వల్ల వృత్తి, ఉద్యోగాల పరంగా శుభ ఫలితాలు అనుభవానికి వస్తాయి. వృత్తి, ఉద్యోగాల్లో సానుకూల మార్పులు, చేర్పులు చోటు చేసుకుంటాయి. అధికారుల నుంచి ఆదరణ, ప్రోత్సాహం లభిస్తాయి. ఆశించని విధంగా నిరుద్యోగులకు మంచి కంపెనీల నుంచి ఆఫర్లు వస్తాయి. సమాజంలో పేరు ప్రతిష్టలు పెరుగుతాయి. పది మందికీ మేలు జరిగే పనులు చేస్తారు. వితరణ గుణం అభివృద్ధి చెందుతుంది. వ్యాపారాలు ఆశాజనకంగా ఉంటాయి. ఉద్యోగం మారడానికి చేస్తున్న ప్రయత్నాలు సఫలం అవుతాయి. గృహ, వాహన యోగాలకు అవకాశం ఉంది. మనసులోని కోరికల్లో కొన్ని అయినా నెరవేరుతాయి.
తులా రాశి: ఈ రాశి వారికి సప్తమ స్థానంలో బుధ గ్రహం వక్ర గతిలోకి వెళ్లడం వల్ల ఇప్పుడు తీసుకునే నిర్ణయాలన్నీ తప్పకుండా సత్ఫలితాలను ఇస్తాయి. చాలాకాలంగా సఫలం కాని ప్రయత్నాలన్నీ సానుకూల ఫలితాలను ఇవ్వడం మొదలవుతుంది. ముఖ్యంగా వివాహ ప్రయత్నాలు సఫలం అవుతాయి. దాంపత్య జీవితంలో అన్యోన్యత పెరుగుతుంది. వైవాహిక, ప్రేమ జీవితాలు కొత్త పుంతలు తొక్కుతాయి. వ్యక్తిగత సమస్యలు, కుటుంబ సమస్యల నుంచి పరిష్కారం లభిస్తుంది. విలాస జీవితం అలవాటు అవుతుంది. చక్కని పరిచయాలు ఏర్పడతాయి. సామాజిక సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. బాగా ఆక్టివిటీ పెరుగుతుంది. బంధుమిత్రులు చుట్టూ చేరతారు. జీవితం సాఫీగా, సరదాగా సాగిపోతుంది. కొత్త కొత్త ఆలోచనలు ప్రారంభం అవుతాయి.
ధను రాశి: ఈ రాశి వారికి పంచమ స్థానంలో బుధుడు వక్రించటం వల్ల వీరి ఆలోచనలు, సలహాలు, సూచనలు శుభ ఫలితాలను ఇస్తాయి. ఆకస్మిక ధన లాభానికి అవకాశం ఉంది. ఆర్థిక లావాదేవీలవల్ల ప్రయోజనం ఉంటుంది. షేర్లు, వడ్డీ వ్యాపారం, జూదం వంటివి ఆర్థిక పరిస్థితిని బాగా మెరుగుపరుస్తాయి. సంతానం నుంచి శుభవార్తలు వింటారు. ఇంతవరకు సంతానం లేని వారికి సంతాన యోగానికి సంబంధించి మంచి కబురు వింటారు. ఈ సమయాన్ని సద్వినియోగం చేసుకొని కొత్త ప్రయత్నాలు చేయటం వల్ల, కొత్త నిర్ణయాలు తీసుకోవడం వల్ల భవిష్యత్తులో ఎంతగానో లాభం పొందుతారు. కొద్దిపాటి ప్రయత్నంతో ప్రస్తుతం ముఖ్యమైన పనులన్నీ పూర్తి అయ్యే అవకాశం ఉంది. కుటుంబంలో సామరస్య వాతావరణం ఏర్పడుతుంది.
కొన్ని పరిహారాలు: బుధ గ్రహం వక్ర గతిలో ఉన్న నెల రోజుల కాలంలో దుర్గా దేవి స్తోత్రం పారాయణ చేయడం వల్ల సత్ఫలితాలు త్వరగా, తప్పకుండా అనుభవానికి వస్తాయి. వినాయకుడికి, సుబ్రహ్మణ్య స్వామికి అర్చన లేదా పూజ చేయించడం వల్ల కూడా శుభ ఫలితాలు చోటు చేసుకుంటాయి. పచ్చ లేదా మరకతాన్ని ఉంగరంలో పొదిగి ధరించడం వల్ల కూడా శుభ ఫలితాలు అనుభవానికి వస్తాయి. ఎక్కువగా పచ్చ లేదా పసుపు రంగు కలసిన దుస్తులు ధరించటం వల్ల పాజిటివ్ ఫలితాలు పెరుగుతాయి.
Note: (ఇక్కడ ఇచ్చిన సమాచారం నమ్మకం మీద ఆధారపడి ఉంటుంది.. దీనికి శాస్త్రీయ ఆధారాలు లేవు. మనుషుల ఆసక్తిని నమ్మకాన్ని దృష్టిలో ఉంచుకుని ఇక్కడ అందించాం).
మరిన్ని జ్యోతిష్య వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..