AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Kuja Gochar: కన్యారాశిలోకి కుజుడి సంచారం.. వారి ఆర్థిక పరిస్థితి మరింత మెరుగుపడటం పక్కా.. !

Kuja Gochar 2023: ఈ నెల 22న కన్యారాశిలో ప్రవేశించిన కుజ గ్రహం అక్టోబర్ 3 వరకూ ఇదే రాశిలో కొనసాగుతుంది. కుజ గ్రహాన్ని జ్యోతిష శాస్త్రంలో ఒక ఫైటర్ గా అభివర్ణిస్తారు. పోరాటాలు, యుద్ధాలంటే కుజుడికి చాలా ఇష్టం. అంతేకాదు, టెక్నికల్, టెక్నలాజికల్, ఎలక్ట్రికల్ వంటి రంగాలకు ఈ గ్రహం ప్రాతినిధ్యం వహిస్తుంది. ఏదైనా పోరాడి సాధించుకోవడం..

Kuja Gochar: కన్యారాశిలోకి కుజుడి సంచారం.. వారి ఆర్థిక పరిస్థితి మరింత మెరుగుపడటం పక్కా.. !
Mars Transit
TV9 Telugu Digital Desk
| Edited By: Janardhan Veluru|

Updated on: Aug 22, 2023 | 7:42 PM

Share

Mars transit Virgo 2023: ఈ నెల 22న కన్యారాశిలో ప్రవేశించిన కుజ గ్రహం అక్టోబర్ 3 వరకూ ఇదే రాశిలో కొనసాగుతుంది. కుజ గ్రహాన్ని జ్యోతిష శాస్త్రంలో ఒక ఫైటర్ గా అభివర్ణిస్తారు. పోరాటాలు, యుద్ధాలంటే కుజుడికి చాలా ఇష్టం. అంతేకాదు, టెక్నికల్, టెక్నలాజికల్, ఎలక్ట్రికల్ వంటి రంగాలకు ఈ గ్రహం ప్రాతినిధ్యం వహిస్తుంది. ఏదైనా పోరాడి సాధించుకోవడం, పట్టుదలగా నెరవేర్చుకోవడం, మొండి ధైర్యం, కోపతాపాలు కూడా కుజ గ్రహంలో కాస్తంత ఎక్కువ మోతాదులోనే ఉంటాయి. ఈ కుజ గ్రహానికి కన్యారాశి అధిపతి అయిన బుధుడితో అంత సఖ్యత లేదు. అయితే, కొన్ని రంగాలవారికి తప్పకుండా సహకరిస్తాడు. ఏయే రాశుల వారికి ఏయే రంగాల ద్వారా సహకరిస్తాడో ఇక్కడ చూద్దాం.

  1. మేషం: ఈ రాశికి కుజుడు అధిపతి. ఈ కుజుడు ఆరవ రాశిలో ఉండడం వల్ల ఈ రాశివారిలో పోటీతత్వం పెరుగుతుంది. తప్పకుండా శత్రు జయం ఉంటుంది. వృత్తి, వ్యాపారాల్లో ఎటువంటి పోటీ ఎదురైనా, ఎటువంటి సవాలు ఎదురైనా ధైర్యంగా ఎదుర్కోవడం, విజయం సాధించడం జరుగుతాయి. ఆరోగ్యం బలపడుతుంది. ఆర్థిక పరిస్థితిని గట్టు పట్టుదలతో మెరుగుపరచుకుంటారు. ఎవరైనా కుట్రలు, కుతంత్రాలకు పాల్పడితే, పరాభవం తప్పదు. ఐటీ రంగంవారికి తిరుగుండదు.
  2. వృషభం: పరమ శాంత స్వభావులైన ఈ రాశివారిలో ‘తీవ్రవాద’ ధోరణులు ప్రబలుతాయి. ఈ రాశికి పంచమ స్థానమైన (ఆలోచనా స్థానమైన) కన్యారాశిలో కుజుడు ప్రవేశించడం వల్ల దేనినైనా పోరాడి సాధించుకోవడం జరుగుతుంది. ప్రేమ వ్యవహారాల్లో కూడా పట్టుదలగా విజయం సాధిస్తారు. వృత్తి, వ్యాపార, ఉద్యోగాల్లో విప్లవాత్మకమైన, సమూలమైన మార్పులు ప్రవేశపెడతారు. పాతకు స్వస్తి చెబుతారు. కొత్తను ఆదరిస్తారు. పిల్లలకు సరికొత్త జీవితాన్ని అలవాటు చేస్తారు.
  3. మిథునం: కుజుడు నాలుగవ స్థానంలో సంచరించడం వల్ల కొద్ది కాలం పాటు ప్రతిదానికీ కోపతాపాలు పెరిగే అవకాశం ఉంది. వృత్తి, ఉద్యోగాల్లో బరువు బాధ్యతలు పెరిగే సూచనలున్నాయి. యూనియన్ లీడర్ అయ్యే సూచనలున్నాయి. వ్యక్తిగత జీవనశైలిలోనే కాక, కుటుంబ వ్యవహారాల్లో కూడా సమూలమైన మార్పులు తీసుకువచ్చే అవకాశం ఉంది. అనవసర పరిచయాలకు, వ్యసనాలకు కూడా దగ్గరయ్యే అవకాశం కూడా ఉంది. ఐటీ రంగం వారికి ఇబ్బడిముబ్బడిగా అవకాశాలు వస్తాయి.
  4. కర్కాటకం: ఈ రాశివారికి విక్రమ స్థానంలో, అంటే మూడవ స్థానంలో కుజ సంచారం వల్ల ఆత్మవిశ్వాసం, ధైర్యం ఇనుమడిస్తాయి. ఏ రంగంలో ఉన్నవారైనప్పటికీ దూసుకుపోతారు. కొత్త ఆలోచనలు, ప్రయత్నాలతో వృత్తి, ఉద్యోగాల్లో అధికారులను మెప్పిస్తారు. పనితీరులో సహోద్యోగులను మించి పోతారు. పోటీ పరీక్షల్లో విజయాలు సాధిస్తారు. ప్రయాణాలు లాభిస్తాయి. ఆర్థికపరంగా ఏ ప్రయత్నం తలపెట్టినా సఫలం అవుతారు. అయితే, సోదరులతో సఖ్యతకు విఘాతం కలుగుతుంది.
  5. ఇవి కూడా చదవండి
  6. సింహం: ఈ రాశివారికి ధన స్థానంలో అంటే రెండవ స్థానంలో కుజ సంచారం వల్ల తప్పకుండా ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. అప్రయత్న ధన లాభం ఉంటుంది. కొద్ది ప్రయత్నంతో లేదా కొద్ది పట్టుదలతో బాకీలన్నీ వసూలు అవుతాయి. ముఖ్యంగా స్త్రీ మూలక ధనలాభం ఉంటుంది. భూ సంబంధమైన ఆస్తి కలిసి వస్తుంది. స్థిరాస్తి వ్యవహారాలు లాభిస్తాయి. రియల్ ఎస్టేట్ వారికి పట్ట పగ్గాలుండవు. అయితే, తొందరపాటు వల్ల కుటుంబంలో చిన్న చిన్న చికాకులు తలెత్తవచ్చు.
  7. కన్య: ఈ రాశిలోనే కుజ సంచారం జరుగుతున్నందువల్ల ఐటీ రంగంవారికి, టెక్నికల్, ఎలక్ట్రికల్, లిక్కర్, రియల్ ఎస్టేట్ రంగం వారికి లాభాల పంట పండుతుంది. ఈ రంగాలకు చెందిన వారికి ఏమాత్రం ఊహించని పురోగతి ఉంటుంది. క్రీడారంగం వారు కూడా బాగా రాణించడం జరుగుతుంది. అయితే, ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండాలి. రక్తం, ఎముకల సంబంధమైన సమస్యలు తలె త్తవచ్చు. వాహన ప్రమాదాలకు కూడా అవకాశం ఉంది. ప్రయాణాల్లో జాగ్రత్తగా ఉండడం మంచిది.
  8. తుల: ఈ రాశివారికి వ్యయ స్థానంలో కుజ సంచారం వల్ల దూర ప్రాంతాలలో లేదా విదేశాల్లో ఉద్యోగాల కోసం ప్రయత్నాలు చేస్తున్నవారి పంట పండుతుంది. జీవితంలో ఒకసారైనా విదేశాల్లో ఉద్యోగాలు చేయాలన్న ఐటీ, తదితర రంగాలవారి కలలు సాకారం అవుతాయి. ప్రతి సమస్యనూ పరిష్క రించుకునే ప్రయత్నం చేస్తారు. అందుకు ఎంత ఖర్చుకైనా సిద్ధపడతారు. అయితే, డబ్బు బాగా దుర్వ్యయం అయ్యే అవకాశం ఉంది. జీవిత భాగస్వామితో కొద్దిగా సమస్యలు తలెత్తవచ్చు.
  9. వృశ్చికం: ఈ రాశినాథుడైన కుజుడు లాభస్థానంలో సంచరించడం వల్ల కుటుంబంలో శుభకార్యాలు జరిగే అవకాశం ఉంటుంది. ఆర్థికంగా సహాయ సహకారాలు అందుతాయి. స్నేహితుల నుంచి, సోదరుల నుంచి ఆర్థిక ప్రయోజనాలు ఉంటాయి. వృత్తి ఉద్యోగాల్లో పురోగతి ఉంటుంది. ఐటీ రంగంవారికి అనేక అవకాశాలు అందివస్తాయి. నిరుద్యోగులు పట్టుదలగా మంచి ఉద్యోగం సంపాదించుకుం టారు. కుటుంబ పెద్దలతో గానీ, జ్యేష్ట సోదరులతో గానీ వివాదాలు తలెత్తే అవకాశం ఉంది.
  10. ధనుస్సు: ఈ రాశివారికి దశమ స్థానంలో కుజ సంచారం వల్ల వృత్తి, ఉద్యోగాల్లో ప్రాభవం, ప్రాధాన్యం పెరుగుతాయి. తప్పకుండా అధికార యోగం పడుతుంది. రాజకీయాలు, రియల్ ఎస్టేట్, లిక్కర్, ఎక్సైజ్, ప్రభుత్వం వంటి రంగాలలో ఉన్నవారు ఆశించిన స్థాయిలో పురోగతి సాధిస్తారు. అయితే, ఈ రంగాలలోని వారికి కొద్దిగా టెన్షన్లు ఉండే అవకాశం ఉంది. నాయకత్వ స్థానంలో ఉన్నవారు మోతాదు మించి అధికారం చెలాయించే అవకాశం ఉంటుంది. ఉద్యోగపరంగా శుభవార్తలు వింటారు.
  11. మకరం: ఈ రాశివారికి భాగ్య స్థానంలో కుజ సంచారం వల్ల విదేశీ సంబంధమైన వ్యవహారాల్లో ప్రతిబంధ కాలు, సమస్యలు తొలగిపోతాయి. ఈ స్థానంలో కుజ సంచారం వల్ల తండ్రి వైపు నుంచి సంపద వచ్చే అవకాశం ఉంటుంది కానీ, తండ్రి ఆరోగ్యానికి మాత్రం మంచిది కాదు. కెరీర్ పరంగా గానీ, ఆర్థికపరంగా గానీ అదృష్టం పడుతుంది. స్త్రీ మూలక ధన లాభం ఉంటుంది. తల్లి వైపు నుంచి కూడా సహాయ సహకారాలు అందుతాయి. వృత్తి, వ్యాపారాల్లో ధైర్యంగా కొన్ని నిర్ణయాలు తీసుకుంటారు.
  12. కుంభం: ఈ రాశివారికి అష్టమ స్థానంలో ఉన్న కుజుడి వల్ల పెద్దగా ప్రయోజనం ఉండకపోవచ్చు. ఉద్యోగ పరంగా లేదా వృత్తిపరంగా అధికారులతో ముఖాముఖీ తలపడే అవకాశం ఉంది. కొద్దిగా ఓర్పు, సహనాలతో వ్యవహరించడం మంచిది. కుటుంబ విషయాల్లో కూడా మాట పట్టింపులు ఏర్పడ తాయి. జీవిత భాగస్వామితో అపార్థాలు తలెత్తుతాయి. వ్యాపారాల్లో అనుకోని వివాదాలు చోటు చేసుకుంటాయి. పెట్టుబడులు పెంచడానికి, పెట్టుబడులు పెట్టడానికి ఇది సమయం కాదు.
  13. మీనం: ఈ రాశివారికి సప్తమ స్థానంలో కుజ సంచారం వల్ల అనేక మార్గాలలో సంపద పెరుగుతుంది. జీవిత భాగస్వామికి, తండ్రికి అదృష్టం పడుతుంది. ఐ.టి రంగానికి చెందిన వారికి ఎదురుండదు. నిరుద్యోగులకు అవకాశాలు పెరుగుతాయి. అకస్మాత్తుగా పెళ్లి సంబంధం కుదురుతుంది. ఆరోగ్యం చాలావరకు మెరుగుపడుతుంది. కొద్ది ప్రయత్నంతో భాగస్వాములతో విభేదాలు పరిష్కారం అవుతాయి. కోపతాపాలు, అసహనాలు తగ్గించుకోవడం మంచిది. తొందరపాటు పనికి రాదు.

Note: ఇక్కడ సమకూర్చిన సమాచారం వారివారి నమ్మకం, విశ్వాసాల మీద ఆధారపడి ఉంటుంది.  దీన్ని నిర్ధారించేందుకు ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవు. పాఠకుల ఆసక్తిని, నమ్మకాన్ని దృష్టిలో ఉంచుకుని ఈ సమాచారాన్ని అందించాము.

మరిన్ని జ్యోతిష్య కథనాలు చదివేందుకు ఇక్కడ క్లిక్ చేయండి.