Mangalya Dosha: నీచ కుజుడితో ఆ రాశుల వారికి మాంగల్య దోషాలు.. పరిహారాలు ఇవీ..!
ఏప్రిల్ 2 నుంచి జూన్ 6 వరకు కుజుడు కర్కాటక రాశిలో నీచస్థితిలో సంచరించబోతున్నాడు. దీని ప్రభావంతో కొన్ని రాశుల వారికి మాంగల్య దోషం ఏర్పడే అవకాశం ఉంది. ఈ దోషం కారణంగా దాంపత్య జీవితంలో సమస్యలు, ఆర్థిక ఇబ్బందులు, ఆరోగ్య సమస్యలు ఏర్పడే అవకాశముంది. కొన్ని పరిహారాల ద్వారా మాంగల్య దోష నివారణకు అవకాశముంటుంది.

Kuja Dosha
ఏప్రిల్ 2వ తేదీ నుంచి జూన్ 6వ తేదీ వరకు కుజుడు కర్కాటక రాశిలో నీచ స్థితిలో సంచారం చేయడం జరుగుతుంది. కుజుడు కర్కాటక రాశిలోకి ప్రవేశించబోతుండడం వల్ల కొన్ని రాశులకు మాంగల్య దోషాన్ని (కుజ దోషాన్ని) ఇచ్చే అవకాశం ఉంది. మాంగల్య దోషమంటే వైవాహిక జీవితంలో సమస్యలను కలగజేయడం. మేషం, మిథునం, కర్కాటకం, సింహం, ధనుస్సు, మకర రాశుల వారికి ఈ మాంగల్య దోషం కలిగే అవకాశం ఉంది. కుజుడు 1, 2, 4, 7, 8, 12 స్థానాల్లో సంచారం చేస్తున్నప్పుడు మాంగల్య దోషం కలుగుతుంది. తరచూ సుబ్రహ్మణ్యాష్టకాన్ని లేదా స్కంద స్తోత్రాన్ని పఠించడం వల్ల కుజ దోషం శాంతించే అవకాశం ఉంది.
- మేషం: రాశ్యధిపతి కుజుడు చతుర్థ స్థానంలో సంచారం వల్ల కుటుంబంలో టెన్షన్లు పెరిగే అవకాశం ఉంది. జీవిత భాగస్వామితో కానీ, కుటుంబ సభ్యులతో గానీ వాదోపవాదాలు తలెత్తవచ్చు. మానసిక ప్రశాంతత లోపిస్తుంది. దాంపత్య సుఖం తగ్గుతుంది. జీవిత భాగస్వామి కొద్దిగా అనారోగ్యానికి గురయ్యే అవకాశం ఉంటుంది. అయితే, సొంత ఇంటి ప్రయత్నాలు ఫలిస్తాయి. ఆస్తిపాస్తులు కలిసి వస్తాయి. భూ లాభం కలుగుతుంది. వృత్తి, ఉద్యోగాల్లో అధికారులతో సమస్యలు తలెత్తుతాయి.
- మిథునం: ఈ రాశికి కుటుంబ స్థానంలో నీచ కుజుడి సంచారం వల్ల కుటుంబ సమస్యలు చుట్టుముడతాయి. తొందరపాటు నిర్ణయాలు, తొందరపాటు మాటల వల్ల ఇబ్బంది పడతారు. జీవిత భాగస్వామితో అకారణ విభేదాలు కలుగుతాయి. ఆదాయానికి లోటుండకపోవచ్చు కానీ, కుటుంబ సభ్యుల మీద, ముఖ్యంగా జీవిత భాగస్వామి మీద ఖర్చులు పెరుగుతాయి. కొందరు సన్నిహితుల వల్ల ఆర్థికంగా నష్టపోయే అవకాశం ఉంది. ఆర్థిక వ్యవహారాల్లో ఆచితూచి వ్యవహరించడం మంచిది.
- కర్కాటకం: ఈ రాశిలో కుజుడు నీచ స్థితిలో ఉండడం వల్ల జీవిత భాగస్వామితో ఏదో విధమైన ఎడబాటు కలిగే అవకాశం ఉంటుంది. దూర ప్రాంతానికి బదిలీ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఉద్యోగంలో పని భారం వల్ల విశ్రాంతి లభించని పరిస్థితి ఏర్పడుతుంది. దాంపత్య సంబంధమైన సుఖ సంతోషాలు బాగా తగ్గే సూచనలున్నాయి. కోపతాపాలు, చిరాకులు, చికాకుల వల్ల కూడా దంపతుల మధ్య దూరం పెరిగే అవకాశం ఉంటుంది. ఉద్యోగంలో పదోన్నతి లభించే అవకాశం ఉంది.
- సింహం: ఈ రాశికి వ్యయ స్థానంలో కుజ సంచారం వల్ల దాంపత్య జీవితంలో సుఖ సంతోషాలు బాగా తగ్గే అవకాశం ఉంది. ప్రధానంగా అనారోగ్య కారణాల వల్ల, వ్యసనాల వల్ల దంపతుల మధ్య దూరం పెరిగే సూచనలున్నాయి. దంపతుల్లో ఒకరికి దూర ప్రాంతానికి బదిలీ కావడం లేదా దూర ప్రాంతంలో మంచి ఉద్యోగం లభించడం వంటివి జరగవచ్చు. కుటుంబ సభ్యుల మీద ఖర్చులు బాగా పెరుగుతాయి. ఉద్యోగంలో పదోన్నతి లభిస్తుంది. వృత్తి, వ్యాపారాల్లో యాక్టివిటీ పెరుగుతుంది.
- ధనుస్సు: ఈ రాశికి అష్టమ స్థానంలో కుజుడి సంచారం వల్ల భార్యాభర్తల మధ్య ఎక్కువ కాలం ఎడబాటుకు అవకాశం ఉంటుంది. అనారోగ్యాలు గానీ, విభిన్న ప్రాంతాల్లో ఉద్యోగాలు చేయడం వల్ల గానీ ఈ విధమైన ఎడబాటు కలిగే అవకాశం ఉంది. అపార్థాలకు, కీచులాటలకు అవకాశం ఇవ్వకపోవడం మంచిది. ఈ రాశికి చెందిన ఉద్యోగులు, నిరుద్యోగులకు విదేశీ ఆఫర్లు అందే అవకాశం ఉంది. ఆస్తి సమస్యలు, కోర్టు కేసులు అనుకూలంగా పరిష్కారం కావచ్చు. ఆర్థిక నష్టం జరిగే అవకాశముంది.
- మకరం: ఈ రాశికి సప్తమ స్థానంలో కుజ సంచారం వల్ల కుటుంబ జీవితంలో ఒత్తిళ్లు, ఉద్రిక్తతలు పెరిగే అవకాశం ఉంది. దంపతుల మధ్య కోపతాపాలు పేట్రేగే సూచనలున్నాయి. అనవసర పరిచయాల వల్ల ఇబ్బందులు తలెత్తుతాయి. అనవసర ఖర్చులను వీలైనంతగా తగ్గించుకోవడం మంచిది. ఆస్తి సమస్యలు అనుకూలంగా పరిష్కారమై భూ లాభం కలుగుతుంది. కొత్తగా ఇంటిని కొనుగోలు చేసే సూచనలున్నాయి. ప్రయాణాల వల్ల లాభాలు కలుగుతాయి. ఆదాయం బాగా వృద్ధి చెందుతుంది.